Telugu Global
Sports

క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కూతురు చనిపోలేదు.. మీడియాలో తప్పుడు ప్రచారం

చనిపోయిన పాప పేరు ఆనీ. డేవిడ్ మిల్లర్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్. కొన్నాళ్లుగా ఆ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల అనారోగ్యం క్షీణించి మరణించింది.

క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కూతురు చనిపోలేదు.. మీడియాలో తప్పుడు ప్రచారం
X

సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కూతురు చనిపోయిందని రెండు రోజుల నుంచి మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. బడా మీడియా సంస్థలు కూడా ఈ వార్తను కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచురించేశాయి. తమ వెబ్‌సైట్లలో కూడా మిల్లర్ కూతురు చనిపోయిందంటూ రాసుకొచ్చాయి. కూతురు చనిపోయినా డేవిడ్ మిల్లర్ ఇండియాలోనే ఎందుకు ఉన్నాడు? క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు ఆడుతున్నాడు? అని ఒక్క క్షణమైనా ఆలోచించకుండా.. మిల్లర్ కూతురు మరణం అంటూ ప్రచారం చేశాయి. అయితే చనిపోయింది మిల్లర్ కూతురు కాదని.. ఆమె ఒక ఫ్యాన్ అని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న డేవిడ్ మిల్లర్.. టీమ్ ఇండియాతో తొలి మ్యాచ్ అనంతరం ఓ వీడియో పోస్టు చేశాడు. 'రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ రాక్ స్టార్.. లవ్ యూ ఆల్వేస్' అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ వీడియోలో మిల్లర్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నది. దీంతో ఆ పాప డేవిడ్ మిల్లర్ కూతురే అని భావించిన మీడియా.. తప్పుడు వార్తలు రాసేసింది. మిల్లర్ కూతురు మరణించిందని, ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునుగిపోయిందని వార్తలు వండి వార్చారు. సౌతాఫ్రికా జట్టు కూడా బాధలో ఉన్నట్లు చెప్పారు. అయితే, ఆమె డేవిడ్ మిల్లర్ కుమార్తె కాదని తర్వాత స్పష్టమైంది.

చనిపోయిన పాప పేరు ఆనీ. డేవిడ్ మిల్లర్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్. చాన్నాళ్ల నుంచి మిల్లర్‌కు పరిచయం. అయితే కొన్నాళ్లుగా ఆ చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల అనారోగ్యం క్షీణించి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మిల్లర్.. ఆ పాపతో గతంలో తీసుకున్న ఫొటోలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ఇన్‌స్టాలో నివాళి అర్పించాడు. తనకు ఎంతో ఆప్తురాలైన చిన్నారి ఫ్యాన్ మరణించడంతో మిల్లర్ విషాదంలో మునిగిపోయాడు. అయితే, ఆ పోస్టును మీడియా తప్పుగా అర్థం చేసుకొని మిల్లర్ కూతురిగా వార్తలు రాసింది. డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం రాంచీలో ఉన్నారు. ఇవ్వాళ ఇండియాతో జరుగనున్న రెండో వన్డేలో మిల్లర్ ఆడతాడని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం తెలిపింది.






First Published:  9 Oct 2022 5:31 AM GMT
Next Story