Telugu Global
Sports

పాక్ ప్రధానిపై ఇర్ఫాన్ పఠాన్ బౌన్సర్!

ఈర్ష్య, అసూయ, ద్వేషం, కడుపుమంట, ఆక్రోశం, పొరుగుదేశం పచ్చగా ఉంటే రెండుకళ్ళతో చూడలేని తనం...ఈ పదాలకు పర్యాయపదమే పాకిస్థాన్. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, బోర్డు పెద్దలు మాత్రమే కాదు..చివరకు ఆ దేశప్రధాని షెబాజ్ షరీఫ్ సైతం భారత క్రికెట్ పై అక్కసు వెళ్ళగక్కుతూ పదేపదే తమ చిల్లరతనాన్ని చాటుకొంటున్నారు.

పాక్ ప్రధానిపై ఇర్ఫాన్ పఠాన్ బౌన్సర్!
X

పాక్ ప్రధానిపై ఇర్ఫాన్ పఠాన్ బౌన్సర్!

ఈర్ష్య, అసూయ, ద్వేషం, కడుపుమంట, ఆక్రోశం, పొరుగుదేశం పచ్చగా ఉంటే రెండుకళ్ళతో చూడలేని తనం...ఈ పదాలకు పర్యాయపదమే పాకిస్థాన్. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, బోర్డు పెద్దలు మాత్రమే కాదు..చివరకు ఆ దేశప్రధాని షెబాజ్ షరీఫ్ సైతం భారత క్రికెట్ పై అక్కసు వెళ్ళగక్కుతూ పదేపదే తమ చిల్లరతనాన్ని చాటుకొంటున్నారు. ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భారత్ చేతిలో తమకు ఎదురైన పరాభవాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా దొడ్డిదారిన సెమీఫైనల్స్ చేరామన్న స్పృహ లేకుండా భారత క్రికెట్ పైన పడి ఏడుస్తున్నారు.

భారత్ హుందా తనం...పాక్ చిల్లర తనం!

ప్రస్తుత పాక్ జట్టులోని ఆటగాళ్లందరికీ భారత క్రికెటర్లంటే ఎంతో గౌరవం.ప్రధానంగా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పరస్పరం గౌరవించుకొంటూ, అభినందించుకొంటూ వస్తున్నారు.

గత రెండేళ్లుగా ఫామ్ లో లేక పరుగుల కోసం నానాపాట్లు పడిన సమయంలో విరాట్ కు ధైర్యం చెబుతూ బాబర్ అజమ్ సందేశాలు పంపాడు. అలానే ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో వరుస వైఫల్యాలు చవిచూసి...సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై కీలక హాఫ్ సెంచరీ సాధించిన పాక్ కెప్టెన్ బాబర్ ను అభినందిస్తూ విరాట్ కొహ్లీ సైతం ఓ సందేశాన్ని పంపాడు.

అయితే...రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పొందిందో లేదో పాక్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా, మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, డానిష్ కనేరియా నుంచి దేశప్రధాని షెబాజ్ షరీఫ్ వరకూ పలు విధాలుగా భారత క్రికెట్ పైన, క్రికెటర్ల పైన వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు.

పాక్ ప్రధాని దిగజారుడు వ్యాఖ్యలు...

ప్రపంచకప్ ఫైనల్స్ కు మూడోసారి పాకిస్థాన్ జట్టు అర్హత సాధించడం..అదే సమయంలో భారతజట్టు సెమీస్ నుంచే ఇంటిదారి పట్టడంతో పాక్ క్రికెటర్లు మినహా మిగిలిన వారందరికీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ పై తమ జట్టు సాధించిన 152 పరుగులు, భారత్ పై ఇంగ్లండ్ సాధించిన 170 పరుగుల స్కోర్లతో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ తమ కెప్టెన్ బాబర్ అజమ్ కు పంపిన ట్విట్టర్ సందేశం కలకలమే రేపింది.

2021 ప్రపంచకప్ లో భారత్ ను పాకిస్థాన్ చిత్తు చేసిందని, ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగే ప్రపంచకప్ టైటిల్ సమరంలో 152/0 తో 170/0 జట్లు తలపడబోతున్నాయంటూ ట్విట్ చేశారు. భారత క్రికెట్ జట్టు తక్కువ చేస్తూ, ఎద్దేవా చేస్తూ స్వయానా పాక్ ప్రధానే ట్విట్ చేయడం విమర్శలకు దారితీసింది.

పాక్ కెప్టెన్ వివరణ...

తమదేశ ప్రధాని భారత క్రికెట్ పై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్విట్ గురించి తనకు తెలియదని మెల్బోర్న్ మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ వివరణ ఇచ్చాడు. తమ పైన ఎలాంటి ఒత్తిడి లేదని, తమ దృష్టంతా టైటిల్ సమరం పైనే ఉందంటూ దాట వేశాడు.

మరోవైపు..పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, మాజీ ఓపెనర్ వాసిం రాజా అవకాశం చిక్కిన ప్రతిసారీ భారత క్రికెట్ ను తక్కువ చేసి మాట్లాడుతూ తన కడుపుమంటను చల్లార్చుకొంటున్నాడు.

భారతజట్టు సెమీఫైనల్లో ఓడిన వెంటనే పీసీబీ చైర్మన్ హోదాలో రమీజ్ రాజా ఓ చిల్లర వ్యాఖ్య చేశాడు. వందలకోట్ల రూపాయల భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్లోనే చతికిలపడిపోయిందంటూ ఎద్దేవా చేశాడు.

మరోవైపు..పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సైతం విశ్లేషణ పేరుతో భారత క్రికెట్ జట్టును తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడు. జింబాబ్వే, నెదర్లాండ్స్ లాంటి పిల్ల జట్లపై నెగ్గడం ద్వారా భారత్ సెమీఫైనల్స్ చేరిందని, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి పెద్దజట్లతో ఆడిన సమయంలో సరుకులేదని తేలిపోయిందంటూ ఎద్దేవా చేశాడు.

భారత జట్టులోని మెగా క్రికెటర్లంతా వెలవెలపోయారని...పసలేని బౌలింగ్ తో భారత్ ఫైనల్ చేరాలని, విశ్వవిజేతగా నిలవాలని కోరుకోడం ఏమిటంటూ ప్రశ్నించాడు.

పాక్ బౌలింగ్ ముందు భారత్ దిగదుడుపు...

బౌలింగ్ బలంలో పోల్చిచూస్తే పాకిస్థాన్ ముందు భారత్ దిగదుడుపేనని, పాక్ జట్టుకు నాణ్యమైన నలుగురు ఫాస్ట్ బౌలర్లు, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఇద్దరు మ్యాజిక్ స్పిన్నర్లున్నారని గుర్తు చేశాడు. అదే భారత బౌలింగ్ ఎటాక్ ను చూస్తే సరుకు, కరుకులేని మీడియం పేసర్లు, పేరుకే స్పిన్నర్లుగా ఉన్న మరో ఇద్దరు స్లో బౌలర్లు

ఉన్నారంటూ తన యూట్యూబ్ చానెల్ ద్వారా నోటిదురద తీర్చుకొన్నాడు.

ఇర్ఫాన్ పఠాన్ రివర్స్ ఎటాక్...

భారత క్రికెట్ పై పాక్ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని భారత మాజీ ఆల్ రౌండర్ , క్రికెట్ విశ్లేషకుడు ఇర్ఫాన్ పఠాన్ తప్పు పట్టాడు. 1992, 2022 ప్రపంచకప్ టోర్నీలో పాక్ జట్టు అదృష్టం కలసి వచ్చి దొడ్డిదారిన సెమీస్ చేరిందని, ఆ రెండు ప్రపంచకప్ టో్ర్నీలలోనూ భారత్ చేతిలో పాక్ పరాజయాలు చవిచూసిన తీరును గుర్తుంచుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

ఫైనల్లో ఎలా ఆడాలో చూసుకోకుండా సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన భారత్ పై ఏడుపు ఎందుకంటూ ఇర్ఫాన్ పఠాన్ నిలదీశాడు. భారత్ కు, పాక్ కు ఎంతో తేడా ఉందని, పొరుగు జట్టు విజయాలు సాధిస్తే భారత క్రికెటర్లు అభినందిస్తారని, అదే పాకిస్థాన్ పెద్దలు, వ్యాఖ్యాతలు..చివరకు దేశప్రధాని సైతం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని, భారత్ ఓడితే సంబరాలు జరుపుకొంటున్నారని మండిపడ్డాడు.

జయాపజయాలు ఆటలో భాగమన్న వాస్తవాన్ని గ్రహించాలని సూచించాడు.

First Published:  13 Nov 2022 9:03 AM GMT
Next Story