Telugu Global
Sports

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోట్ల వెల్లువ!

ఐపీఎల్ అంటే అభిమానులకు వినోదం..ఐపీఎల్ అంటే క్రికెటర్లకు పరుగులు, వికెట్లు, రికార్డులు, విజయాలు...ఐపీఎల్ అంటే ఫ్రాంచైజీ యజమానులకు వందలకోట్ల రూపాయల వ్యాపారం.

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోట్ల వెల్లువ!
X

ఐపీఎల్ అంటే అభిమానులకు వినోదం..ఐపీఎల్ అంటే క్రికెటర్లకు పరుగులు, వికెట్లు, రికార్డులు, విజయాలు...ఐపీఎల్ అంటే ఫ్రాంచైజీ యజమానులకు వందలకోట్ల రూపాయల వ్యాపారం......

భారత క్రికెట్ బోర్డు బంగారు గని ఐపీఎల్. గత 15 సంవత్సరాలుగా క్రికెటర్లతో సహా క్రికెట్ నే నమ్ముకొని బతుకుతున్నవారి పాలిట కల్పవృక్షంగా మారింది. ఇక..వందలకోట్ల పెట్టుబడితో ప్రాంచైజీ యజమానులుగా మారిన నీతా అంబానీ, శ్రీనివాసన్, విజయ్ మాల్యా, షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పషెట్టి లాంటి బడావర్గాల పాలిట అల్లాఉద్దీన్ అద్భుత దీపంగా తయారయ్యింది.

వందలకోట్లతో వేలకోట్ల ఆదాయం....

ఐపీఎల్ అంటే కోట్ల రూపాయల వ్యాపారం. ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయంలో ప్రతిక్షణం, ప్రతినిముషం లక్షల రూపాయల వ్యవహారం. 2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్లో

400 నుంచి 500 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటికే వెయ్యి నుంచి 1500 కోట్ల రూపాయలకు పైగా సంపాదించిన ఫ్రాంచైజీలు చాలానే ఉన్నాయి.

అంబానీల ముంబై , షారుఖ్ ఖాన్ కోల్ కతా, శిల్పాషెట్టి జైపూర్, జీఎమ్మార్ ఢిల్లీ, విజయ్ మాల్యా బెంగళూరు, మారన్ ల హైదరాబాద్, శ్రీనివాసన్ ల చెన్నై

ఫ్రాంచైజీలు సగటున సీజన్ కు వందకోట్ల రూపాయలకు పైగా స్పాన్సర్ షిప్ ల ద్వారా సంపాదిస్తున్నాయి. దీనికితోడు బీసీసీఐకి లభించే ప్రసార,డిజిటిల్ మీడియా హక్కుల ఆదాయంలో సింహభాగం అదనంగా తమ ఖాతాలలో జమ చేసుకొంటున్నారు.

2023 సీజన్లో భారీ వ్యాపారం..

దేశంలోని 12 నగరాల వేదికల్లో 52 రోజులపాటు 70 లీగ్, నాలుగు నాకౌట్ మ్యాచ్ లతో కలుపుకొని 74 మ్యాచ్ లుగా 16వ సీజన్ పోటీలను నిర్వహిస్తున్నారు.

ఒక్కోజట్టు లీగ్ దశలో 14 మ్యాచ్ లు చొప్పున ఆడనుంది.

మ్యాచ్ లో పాల్గొనే తమజట్టు క్రికెటర్ల జెర్సీలు, కిట్ బ్యాగులు, టోపీలు, బ్యాటులు..కాదేదీ అనర్హమంటూ..ప్రతి అంగుళాన్ని స్పాన్సర్లకు అమ్మేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకొంటున్నాయి.

మార్చి 31 నుంచి మే 28 వరకూ జరిగే ప్రస్తుత 16వ సీజన్ ఐపీఎల్ ద్వారా..ఎంత సంపాదించాలనేది..ఏ ఫ్రాంచైజీకి ఆ ఫ్రాంచైజీనే ముందుగా నిర్ణయించుకొని పక్కప్రణాలికలు, వ్యూహాలతో సిద్ధమయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు ఇప్పటికే ఐపీఎల్ ను అత్యంత ఖరీదైన, విలువైన బ్రాండ్ గా నిర్ధారించారు. భారత ఆర్థికవ్యవస్థకు ఐపీఎల్ దన్నుగా నిలుస్తోందని, సీజన్ కు 11.5 బిలియన్ రూపాయలు ( 182 మిలియన్ డాలర్ల ) మేర కార్యకలాపాలు నిర్వహిస్తూ పలురకాల పన్నుల రూపంలో 500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూర్చుతోందని చెబుతున్నారు.

2008 ప్రారంభ ఐపీఎల్ లో 1.1 బిలియన్ డాలర్లు గా ఉన్న ఆర్థికకార్యకలాపాలు 2023 సీజన్ నాటికి 10.9 బిలియన్ డాలర్లకు చేరుకోడం చూస్తే..ఐపీఎల్ పవర్ ఏమిటో మరి చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసమే కేవలం రెండేళ్ల కాలానికే టాటా గ్రూప్ 670కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అంపైర్లు ధరించే దుస్తులు, స్టంపులు, ఆడియో, హెడ్ గియర్ హక్కులను సైతం స్పాన్సర్లకు విక్రయిస్తూ నిర్వాహక మండలి కోట్ల రూపాయల పంట పండించుకొంటోంది.

బీసీసీఐకి 5వేల కోట్ల రూపాయల ఆదాయం..

టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రకటనలు ద్వారానే ఐపీఎల్ బోర్డుకు 5వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసారహక్కుల్లో అధికభాగాన్ని 2023 నుంచి 2027 కాలానికి రిలయన్స్ గ్రూప్ దక్కించుకోగలిగింది. టీవీ ప్రసారహక్కులను డిస్నీ స్టార్ సంపాదించింది.

రిలయన్స్ సంస్థే 23వేల 758 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.

క్యూకట్టిన స్పాన్సర్లు...

ఐపీఎల్ ప్రసారాలకు అత్యధిక రేటింగ్ ఉండడంతో బహుళ జాతి సంస్థలతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు సైతం తమ తమ ఉత్తత్తుల ప్రచారం కోసం..

ఐపీఎల్ వేదికను వాడుకోడానికి పోటీపడుతున్నాయి.

టీవీ ప్రసారహక్కులు సంపాదించిన డిస్నీ స్టార్ స్పాన్సర్లలో టాటా న్యూ, డ్రీమ్ 11, ఏర్ టెల్, కోకా-కోలా, ఏషియన్ పెయింట్స్, క్యాడ్ బరీ, జిందాల్ పాంథర్, పార్లే బిస్కట్స్, బ్రిటానియా, రూపే, కమలా పసంద్, ఎల్ఐసీ ఉన్నాయి.

ఫ్రాంచైజీలలో ముంబై టాప్...

అంబానీకి చెందిన వయాకామ్ 18 సంస్థ ప్రస్తుత 2023 సీజన్లో స్పాన్సర్ల నుంచి 3వేల 700 కోట్ల రూపాయలు రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకొంది. టోర్నీ ప్రారంభానికి ముందే 2వేల 700 కోట్ల రూపాయల మేర వ్యాపారం పూర్తి చేయగలిగింది.

వయాకామ్ -18కు చెందిన జియో సినిమా ఓటీటీ వేదికగా పలు స్పాన్సర్లు ముందుకు వచ్చాయి. వీటిలో డ్రీమ్యూ, జియో మార్ట్, ఫోన్ పే, టాటాన్యూ, అజియో, పార్లే అగ్రో, ఈటీ మనీ, హేయర్, టీవీఎస్, క్యాడ్ బరీ, ఐటీసీ, కోకా-కోలా, కమలా పసంద్, ప్యూమా, అల్ట్ర్రాటెక్, కింగ్ ఫిషర్,ర్యాపిడో, అమెజాన్, లూయి ఫిలిప్పీ, ఇండీడ్ ఉన్నాయి.

రిలయన్స్ గ్రూప్ కు చెందిన రైజ్ వరల్డ్ వైడ్ సంస్థ 400 కోట్ల రూపాయల విలువైన 60 స్పాన్సర్ షిప్ ఒప్పందాలను కుదుర్చుకోగలిగింది.

జైపూర్ ఫ్రాంచైజీకి చెందిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఆడియో, హెడ్ గియర్ ప్రసార హక్కులను విక్రయించారు.

మిగిలిన క్రీడల లీగ్ లతో పోల్చిచూస్తే..ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారానే తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకొనే సమయం బహుళజాతి సంస్థలకు ఎక్కువగా ఉంటోదని, ఐపీఎల్ ను మించిన వేదిక మరొకటి లేదని మార్కెటింగ్ నిపుణలు చెబుతున్నారు.

ఐపీఎల్ ప్రసారాల ద్వారా హెర్బాలైఫ్ సైతం తన బ్రాండ్ ప్రచారం కోసం ముందుకు వచ్చింది. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీక రించింది.

ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్ లు సైతం ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వచ్చాయి.

100 నుంచి 120కోట్ల ఆదాయం..

లీగ్ లో పాల్గొంటున్న మొత్తం 10 ఫ్రాంచైజీలు..ప్రస్తుత 16వ సీజన్లో 100 నుంచి 120 కోట్ల రూపాయల ఆదాయం కళ్లచూసే అవకాశం ఉంది. ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఫ్రాంచైజీ ఆదాయం 20 నుంచి 22 శాతానికి పెరగనున్నట్లు చెబుతున్నారు.

ఐదుసార్లు విజేత ముంబై జట్టుకే 25 రకాల స్పాన్సర్లు ఉండటం ఓ రికార్డుగా నిలిచిపోతుంది. ప్రస్తుత సీజన్లో 11 సరికొత్త స్పాన్సర్ షిప్ లు రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టుకు దక్కాయి.

గత సీజన్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ రికార్డుస్థాయిలో తన స్పాన్సర్లను 35 శాతం మేర పెంచుకోగలిగింది. గుజరాత్ ఫ్రాంచైజీ యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ సైతం గణనీయంగా ఆదాయం పెంచుకోగలిగింది.

మొత్తం మీద బీసీసీఐతో పాటు..ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం ఐపీఎల్ బంగారు బాతు నుంచి గుడ్ల మీద గుడ్లు పెట్టించుకోగలుగుతున్నాయి.

రానున్నకాలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలువైన లీగ్ గా ఐపీఎల్ నిలిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  1 April 2023 2:09 PM GMT
Next Story