Telugu Global
Sports

ఐపీఎల్ -16లో అరుదైన రికార్డుల జోరు!

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 52 మ్యాచ్ లు ముగిసే సమయానికే చేజింగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.

IPL Records 2023: Rare records in IPL 16
X

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 52 మ్యాచ్ లు ముగిసే సమయానికే చేజింగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.

ఐపీఎల్ గత 15 సీజన్లకు భిన్నంగా ప్రస్తుత 16వ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన పుణ్యమా అంటూ 200కు పైగా స్కోర్లు సాధించడం ఎంతో తేలికో..200కు పైగా లక్ష్యాలను చేధించడం కూడా అంత సునాయాసంగా మారింది.

మొత్తం 10 జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని 70కి మొదటి 52 ( రాజస్థాన్- హైదరాబాద్ )మ్యాచ్ లు ముగిసే సమయానికే ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

ప్రస్తుతసీజన్ లీగ్ లో మరో 18 మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉండగా ఇప్పటికే ఆరుసార్లు 200కు పైగా స్కోర్ల లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా వివిధజట్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి.

గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 200కు పైగా లక్ష్యాలను అలవోకగా చేధించి సంచలన విజయాలు నమోదు చేశాయి.

మొత్తం ఆరుమ్యాచ్ ల్లో నాలుగుమ్యాచ్ ల ఫలితం చివరి బంతిలో తేలింది. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ రెండుసార్లు 200కు పైగా లక్ష్యాలను చేధించిన జట్టుగా నిలిస్తే..200కు పైగా లక్ష్యాలను రెండుసార్లు కాపాడుకోడంలో విఫలమైన జట్టుగా మరో మాజీ విజేత రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.

ప్రస్తుత సీజన్లో అతిపెద్ద ( 215 పరుగుల )లక్ష్యం చేధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

ఐపీఎల్ మొత్తం 16 సీజన్ల ( 2008 - 2023 ) చరిత్రలో 21సార్లు 200కు పైగా లక్ష్యాలను వివిధజట్లు చేధించగలిగాయి. రాజస్థాన్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ సాధించిన ఆఖరి బంతి చేజింగ్ విజయంతో రికార్డు సంఖ్య 21కి చేరింది.

అంతేకాదు..మొత్తం 60సార్లు వివిధజట్లు కలసి ఓ మ్యాచ్ లో 400కు పైగా స్కోర్లు నమోదు చేయడం మరో రికార్డుగా మిగిలిపోతుంది. ప్రస్తుత 16వ సీజన్లో ఇప్పటికే 12సార్లు 400కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.

200కు పైగా స్కోర్లలోనూ రికార్డే....

ఐపీఎల్ 2008 నుంచి ప్రస్తుత 2023 సీజన్ వరకూ అత్యధికంగా 200కు పైగా స్కోర్లు నమోదైన రికార్డు సైతం 16వ సీజన్ ఖాతాలో పడింది. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్ల్రర్ మ్యాచ్ వరకూ 26 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడం విశేషం.

2022 సీజన్లో 18, 2018 సీజన్లో 15సార్లు 200కు పైగా స్కోర్లు నమోదైతే..ప్రస్తుత సీజన్ లీగ్ 70 మ్యాచ్ ల్లోని మొదటి 52 ముగిసే సమయానికే అత్యధికంగా 26సార్లు నమోదు కావడం విశేషం.

స్ట్ర్రయిక్ రేటులోనూ అదేజోరు...

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో అత్యధిక స్ట్ర్రయిక్ రేట్ సాధించిన బ్యాటర్ గా హైదరాబాద్ సన్ రైజర్స్ మిడిలార్డర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు. కేవలం 7 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఓ బౌండ్రీతో సహా 25 పరుగులు సాధించడం ద్వారా 357.14 స్ట్ర్రయిక్ రేటుతో మ్యాచ్ విన్నర్ గా నిలవడమే కాదు..టాపర్ గానూ రికార్డుల్లో చేరాడు.

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాల రికార్డు..

ఒకేజట్టు ప్రత్యర్థిగా అత్యధిక విజయాలు సాధించిన ఘనతను ముంబై, కోల్ కతా, చెన్నై దక్కించుకొన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థిగా ముంబైకి 23 విజయాలు సాధించిన రికార్డు ఉంది.

ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిగా కోల్ కతా నైట్ రైడర్స్ 21 విజయాలు సాధించి రెండోస్థానంలో కొనసాగుతోంది.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థిగా చెన్నై సూపర్ కింగ్స్ 20 విజయాలతో మూడోస్థానంలో నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ముంబై ఇండియన్స్ కి 20 విజయాలు సాధించిన రికార్డు సైతం ఉంది.

ఆఖరు బంతి విజయాల రికార్డు..

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ లో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆఖరు బంతి విజయం నమోదు చేసింది. జైపూర్ వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో సైతం హైదరాబాద్ సన్ రైజర్స్ ఆఖరు బంతికే విజయం సాధించడం విశేషం.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో ఆఖరు బంతికి ఫలితం తేలిన మ్యాచ్ ల సంఖ్య 6కు చేరింది. 2012 సీజన్లో మాత్రమే మొత్తం 7 మ్యాచ్ ల్లో ఆఖరు బంతి విజయాలు నమోదయ్యాయి.

First Published:  9 May 2023 11:26 AM GMT
Next Story