Telugu Global
Sports

ఐపీఎల్ బెల్లం,భారత క్రికెట్ అల్లం - గవాస్కర్

భారత క్రికెట్లో వర్క్ లోడ్ అన్నపదాన్ని పదేపదే వల్లించడాన్ని మాజీ కెప్టెన్, విఖ్యాత క్రికెట్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తప్పు పట్టారు. ఐపీఎల్ ఆడే సమయంలో క్రికెటర్లకు వర్క్ లోడ్ గుర్తుకు రాదా అంటూ నిలదీశారు.

సునీల్ గవాస్కర్
X

సునీల్ గవాస్కర్

భారత క్రికెట్లో వర్క్ లోడ్ అన్నపదాన్ని పదేపదే వల్లించడాన్ని మాజీ కెప్టెన్, విఖ్యాత క్రికెట్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తప్పు పట్టారు. ఐపీఎల్ ఆడే సమయంలో క్రికెటర్లకు వర్క్ లోడ్ గుర్తుకు రాదా అంటూ నిలదీశారు....

భారత క్రికెటర్లకు వర్క్ లోడ్ పేరుతో విశ్రాంతి ఇవ్వటాన్ని దిగ్గజ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తప్పు పట్టారు. వర్క్ లోడ్ పేరుతో జట్టుకు అందుబాటులో లేని కీలక ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టు మనీలో కోత విధించాలంటూ సలహా ఇచ్చారు.

భారత క్రికెట్ ప్రయోజనాలే ప్రధానం...

రెండున్నర నెలల కాలంలో కోట్లరూపాయలు కురిపించే ఐపీఎల్ అంటే మక్కువ చూపించే స్టార్ క్రికెటర్లు భారత క్రికెట్ ప్రయోజనాలను బలిపెడుతున్నారంటూ సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కీలక ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగే సమయంలో కీలక ఆటగాళ్లు జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చహార్ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకపోడం భారతజట్టు సమతౌల్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. పైగా బౌలింగ్ బలహీన పడిపోయింది. జట్టుకు అందుబాటులో ఉన్నా...లేకున్నా బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్టు రూపంలో 7 కోట్ల రూపాయలు అందుకొంటున్నారని, వర్క్ లోడ్ పేరుతో జట్టుకు దూరంగా ఉండే క్రికెటర్ల కాంట్రాక్టు మనీ నుంచి ఆ మేరకు కోత పెట్టాలని సలహా ఇచ్చారు.

ఐపీఎల్ ఆడే సమయంలో నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో ఉండే ఆటగాళ్లంతా భారతజట్టు ఆడే కీలక సిరీస్ లకు వర్క్ లోడ్ పేరుతో దూరంగా ఉండిపోడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

భారత కెప్టెన్ కూ గవాస్కర్ చురకలు..

ప్రపంచకప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమి పొందిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వర్క్ లోడ్ విషయాన్ని సాకుగా చూపడాన్ని తప్పుపట్టారు. ఐపీఎల్ ఆడే సమయంలో లేని వర్క్ లోడ్...భారతజట్టుకు ఆడే సమయంలో ఎందుకు గుర్తుకు వస్తుందంటూ ప్రశ్నించారు.

న్యూజిలాండ్ పర్యటనకు కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ తో సహా పలువురు సీనియర్ క్రికెటర్లు అందుబాటులో లేకపోడాన్ని గవాస్కర్ ప్రశ్నించారు. ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ దేశాల పర్యటనలకు ఉన్న గ్లామర్ ..న్యూజిలాండ్ లాంటి దేశంలో పర్యటించే సమయంలో అడ్డువస్తుందని మండిపడ్డారు.

ఐపీఎల్ సీజన్లోని మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ లు ఆడటానికి చూపే శ్రద్ధ...ఆరు లేదా ఏడుమ్యాచ్ లతో సాగే ప్రపంచకప్, మూడుమ్యాచ్ లు లేదా ఐదుమ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే సమయంలో ఉండటం లేదని, భారత క్రికెట్ ప్రయోజనాలను బలిపెట్టడం సమంజసంకాదని చెప్పారు.

వర్క్ లోడ్ పేరుతో జట్టుకు దూరంగా ఉండే ఆటగాళ్లను పక్కనపెట్టి ..వారికిచ్చే కాంట్రాక్టు మనీ నుంచి కోతలు మొదలు పెడితే దారికొస్తారంటూ తెలిపారు.

స్టార్ క్రికెటర్లు ఏదికోరితే అది చేయనివ్వడంతోనే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు.

First Published:  13 Nov 2022 10:00 AM GMT
Next Story