Telugu Global
Sports

ఐపీఎల్-17 వేలంలో రికార్డుల మోత...స్టార్క్ కు 24.75 కోట్లు!

ఐపీఎల్ -2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా నిర్వహించిన వేలంలో రికార్డుల మోత మోగింది. కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షల రూపాయల ధరతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్-17 వేలంలో రికార్డుల మోత...స్టార్క్ కు 24.75 కోట్లు!
X

ఐపీఎల్ -2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా నిర్వహించిన వేలంలో రికార్డుల మోత మోగింది. కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షల రూపాయల ధరతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ సరికొత్త సీజన్ ప్రారంభానికి ముందే రికార్డుల మోత మోగింది. వేలం దశలోనే పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలసి 230 కోట్ల 45 లక్షల రూపాయల మొత్తంతో 72 మంది ఆటగాళ్ళ కోసం వేలం బరిలో నిలిచాయి.

దేశం వెలుపల తొలిసారిగా వేలం!

2008 ప్రారంభ సీజన్ నుంచి 2023 సీజన్ వరకూ ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని దేశంలోని ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలలోనే నిర్వహిస్తూ వచ్చారు.

అయితే..దేశంలోనే వేలం నిర్వహించాలన్న 16 సీజన్ల సాంప్రదాయాన్ని పక్కన పెట్టి..17వ(2024 ) సీజన్ వేలం కార్యక్రమాన్ని దేశం వెలుపల, దుబాయ్ లోని కోకా కోలా ఎరీనా వేదికగా నిర్వహించారు.

కేవలం 72 స్థానాల భర్తీ కోసమే నిర్వహించిన ఈ వేలం కోసం తొలిదశలో 1166 మంది ఆటగాళ్ళు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. ఇందులో 830మంది భారత, 336 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో 909 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు, 212 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందే మొత్తం 10 జట్లు కలసి 173 మంది ఆటగాళ్ళను వేలం ప్రమేయం లేకుండా తమతోనే ఉంచుకోవాలని నిర్ణయించాయి.

333 మందితో తుదిజాబితా...

మినీ వేలం జాబితాలోని మొత్తం 333 మంది ప్లేయర్లలో భారత్ కు చెందిన 214మంది సైతం ఉన్నారు. విదేశీ ప్లేయర్ల జాబితాలో 30 స్థానాల కోసం 119 మంది పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు అసోసియేట్ సభ్యదేశాలకు చెందినవారూ ఉన్నారు.

మొత్తం ఆటగాళ్లలో 116 మంది అంతర్జాతీయ, 215 మంది దేశవాళీ అనుభవం ఉన్నవారు వేలం బరిలో నిలిచారు.

కోట్లు కొల్లగొట్టిన కంగారూ స్టార్లు.....

విదేశీ క్రికెటర్ల కోటాలో జరిగిన వేలంలో కంగారూ సూపర్ స్టార్లు మిషెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. మెరుపు ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకొన్న ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

కోల్ కతా ఫ్రాంచైజీ 24 కోట్ల 75 లక్షల రూపాయల ధరకు స్టార్క్ ను సొంతం చేసుకొంది. 2 కోట్ల రూపాయల కనీస వేలం ధరతో మొదలైన స్టార్క్ వేలం చివరకు రికార్డు ధర వద్ద ముగిసింది.

గతసీజన్లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరెన్ నెలకొల్పిన 18 కోట్ల 50 లక్షల రూపాయల ధర రికార్డును ప్రస్తుత సీజన్లో పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్ అధిగమించారు.

హైదరాబాద్ జట్టులో పాట్ కమిన్స్...

ఆస్ట్ర్రేలియా కెప్టెన్, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ను హైదరాబాద్ ఫ్రాంచైజీ 20 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు ఖాయం చేసుకొంది. 2 కోట్ల రూపాయల కనీస ధరతో ప్రారంభమైన కమిన్స్ వేలం జోరుగా సాగింది. 20 కోట్ల రూపాలను మించిన ధర దక్కించుకొన్న తొలి ప్లేయర్ గా కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. అయితే..ఈ రికార్డును ఆ వెంటనే స్టార్క్ అధిగమించాడు. ప్రస్తుత వేలంలో 20 కోట్లను మించిన ధరను దక్కించుకొన్న ఇద్దరు ఆటగాళ్ళూ ఆస్ట్ర్రేలియన్లే కావడం విశేషం.

న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ డారిల్ మిషెల్ ను 14 కోట్ల రూపాయలకు చెన్నై, కరీబియన్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ను 11 కోట్ల రూపాయల ధరకు బెంగళూరు, సఫారీ యువహిట్టర్ ర్యాలీ రూసోను 8 కోట్లకు పంజాబ్, వెస్టిండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ ను 7 కోట్ల 40 లక్షలకు జైపూర్, కుమార కుశాగ్రాను 7 కోట్ల 20లక్షలకు ఢిల్లీ, ట్రావిస్ హెడ్ ను 6 కోట్ల 80 లక్షలకు హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకొన్నాయి.

సమీర్ రిజ్వీ సరికొత్త రికార్డు....

అంతర్జాతీయమ్యాచ్ లు ఆడని అన్ క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో సమీర్ రిజ్వీని 8 కోట్ల 40 లక్షలకు చెన్నై ఫ్రాంచైజీ ఖాయం చేసుకొంది. భారత క్రికెటర్లలో అత్యధిక ధర దక్కించుకొన్న ప్లేయర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. హర్షల్ ను 11 కోట్ల 75 లక్షల రూపాయల ధరకు పంజాబ్ కింగ్స్ ఖాయం చేసుకొంది.

హైదరాబాద్ ఫ్రాంచైజీ సంచలనం..

34 కోట్ల రూపాయల మొత్తంతో 9 స్థానాల భర్తీ కోసం వేలం బరిలోకి దిగిన హైదరాబాద్ ఫ్రాంచైజీ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్ల కోసమే 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

పాట్ కమిన్స్ కు 20 కోట్ల 50 లక్షలు, ట్రావిస్ హెడ్ కు 6 కోట్ల 80 లక్షలు, వనిందు హసరంగకు కోటీ 50 లక్షలు ఖర్చు చేసింది. మిగిలిన 6 కోట్లతో ఆరుగురు భారత ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉంది.

సన్ రైజర్స్ జట్టులో ఎడెన్ మర్కరమ్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్టార్ ప్లేయర్లు ఇప్పటికే ఉన్నారు.

దక్షిణాఫ్రికా మెరుపు ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ ను జైపూర్ ఫ్రాంచైజీ కేవలం 50 లక్షల రూపాయల ధరకే దక్కించుకోగలిగింది. రచిన్ రవీంద్రను చెన్నై కోటీ 80 లక్షల రూపాయల ధరకే జట్టులో చేర్చుకొంది.

సఫారీ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోట్జే ను 5 కోట్ల ధరకు , దిల్షాన్ మధు శంఖ 4 కోట్ల 60 లక్షల రూపాయలకు ముంబై ఫ్రాంచైజీ దక్కించుకోగలిగింది. ఆటగాళ్ళ వేలం కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు కలసి 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.

First Published:  20 Dec 2023 4:37 AM GMT
Next Story