Telugu Global
Sports

ఐపీఎల్-17 లో ఈ బాదుడేంటీ..ఈ 200 స్కోర్లేంటీ?

ఐపీఎల్ -17వ సీజన్ లో బ్యాటర్లజోరు, వీరవిహారం అప్రతిహతంగా కొనసాగుతోంది. 200కు పైగా స్కోర్లు సాధారణ విషయంగా మారిపోయాయి.

ఐపీఎల్-17 లో ఈ బాదుడేంటీ..ఈ 200 స్కోర్లేంటీ?
X

ఐపీఎల్ -17వ సీజన్ లో బ్యాటర్లజోరు, వీరవిహారం అప్రతిహతంగా కొనసాగుతోంది. 200కు పైగా స్కోర్లు సాధారణ విషయంగా మారిపోయాయి...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ గత 17 సీజన్లుగా నిర్వహిస్తూ వస్తున్న ఐపీఎల్..ప్రస్తుత 2024 సీజన్లో దారితప్పినట్లుగా కనిపిస్తోంది.

బ్యాటుకు..బంతికీ నడుమ పొంతనే లేకుండాపోయింది. వినోదం స్థాయిని పెంచడం కోసం ఐపీఎల్ పాలకమండలి విచక్షణారహితంగా నిబంధనలను బ్యాటర్లకు అనుకూలంగా మార్చివేస్తూ వస్తోంది.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ నిబంధన పేరుతో 11కు బదులుగా 12 మందితో మ్యాచ్ ఆడించే స్థాయికి క్రికెట్ ను దిగజార్చింది. వివిధ ఫ్రాంచైజీలు ఈ నిబంధనను ఉపయోగించుకొంటూ..తుదిజట్టులోకి అదనపు బ్యాటర్ ను తీసుకోడం ద్వారా 20 ఓవర్లలో 200కు పైగా పరుగుల స్కోర్లను మంచినీళ్లప్రాయంలో సాధించగలుగుతున్నాయి.

భారత క్రికెట్ మక్కాలో బౌలర్ల ఊచకోత!

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ జట్ల నడుమ జరిగిన పోరు పరుగుల సునామీని సృష్టించింది. రెండుజట్లూ కలసి పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాయి.

మొత్తం 40 ఓవర్లలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండుజట్లూ కలసి 523 పరుగులు సాధించాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ తనముందు ఉంచిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా చేధించగలిగింది. పంజాబ్ బ్యాటర్లు ప్రత్యర్థి కోల్ కతా కంటే ఆరు సిక్సర్లు ఎక్కువగా...అంటే 24 సిక్సర్ షాట్లు బాదడం ద్వారా మరో రికార్డు నెలకొల్పారు.

ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ గా కోల్ కతా- పంజాబ్ జట్ల పోరు వచ్చి చేరింది. స్పిన్ జాదూ సునీల్ నరైన్ మినహా మిగిలిన బౌలర్లందరీని బ్యాటర్లు ఊచకోత కోశారు.

కోల్ కతా ఓపెనర్లు సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు, ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు సాధిస్తే..పంజాబ్ ఓపెనర్లు సైతం భారీభాగస్వామ్యంతో చెలరేగిపోయారు. బెయిర్ స్టో సునామీ శతకం సాధిస్తే ప్రభుసిమ్రన్ హాఫ్ సెంచరీతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో కేవలం 48 బంతుల్లోనే 108 పరుగుల సెంచరీతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే 68 పరుగులు బాదడంతో పంజాబ్ 18.4 ఓవర్లలోనే 262 పరుగుల కొండంత లక్ష్యాన్ని అధిగమించగలిగింది.

ఎందుకీ భారీస్కోర్లు.....

ప్రస్తుత ఐపీఎల్ లో నిబంధనలతో పాటు..మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్న పిచ్ లు సైతం బ్యాటింగ్ కు అనువుగా రూపొందిస్తున్నారు. బౌలర్లకు ఏమాత్రం అనువుగా లేకపోడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత (17వ ) సీజన్ లీగ్ మొదటి 44 మ్యాచ్ లు ముగిసే సమయానికి వివిధజట్లు 25సార్లు 200కు పైగా స్కోర్లను సాధించడం ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.

2009 నుంటి 2023 మధ్యకాలంలో ఒకే ఒక్కసారి ( 2013లో పూణే వారియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 263 పరుగుల స్కోరు ) 260కి పైగా స్కోరు నమోదయితే..ప్రస్తుత 2024 సీజన్లో ఇప్పటికే 7సార్లు 260, ఆ పైన స్కోర్లు వచ్చాయి

టీ-20 క్రికెట్ ఆవిర్భావం తరువాత 7సార్లు మాత్రమే 500కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అంటే బౌలర్లు సగటున ఓవర్ కు 10 పరుగులు చొప్పున ఇచ్చినట్లుగా రికార్డు ఉంది.

చేజింగ్ లోనూ అదేజోరు....

200కు పైగా విజయలక్ష్యాలను చేధించడంలో ప్రస్తుత సీజన్ మొదటి 44 మ్యాచ్ ల్లో 7సార్లు వివిధ జట్లు సఫలం కాగలిగాయి. ప్రస్తుత సీజన్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన పోరులో సన్ రైజర్స్ 287 పరుగుల స్కోరు, బెంగళూరు ప్రత్యర్థిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో 277 పరుగుల స్కోర్లతో రికార్డుల మోత మోగించింది.

42 మ్యాచ్ ల్లోనే సిక్సర్లసునామీ..

ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 42 మ్యాచ్ ల్లోనే 700కు పైగా సిక్సర్లు నమోదయ్యాయి. గత సీజన్ ఐపీఎల్ లో 1124 సిక్సర్లు మాత్రమే రాగా..ప్రస్తుత సీజన్ సగం మ్యాచ్ ల్లోనే 700 సిక్సర్లు రావడం విశేషం.

బ్యాటర్లకు అనువుగా తయారు చేసిన జీవం లేని పిచ్ లతో పాటు..ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సైతం 200కు పైగా స్కోర్లకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

క్రికెటర్లు అంటే బౌలర్లు, బ్యాటర్లూ కలసి ఆడే ఆటే. సాధారణంగా ఇటు బౌలర్లకు, అటు బ్యాటర్లకూ సమప్రాధాన్యమిస్తూ నిబంధనలు, పిచ్ లను రూపొందించడం మామూలు విషయం. అయితే..క్రికెట్లో వినోదం కోసం బౌలర్లను బలిపశువులను చేస్తూ బ్యాటర్లకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం తీవ్రచర్చనీయాంశంగా మారింది.

బౌలర్ అన్న పదానికి నిర్వచనం కూడా..బాదించుకొనేవాడు అన్నట్లుగా మారిపోయింది.

కురచ బౌండ్రీ లైన్లకు తోడు..జీవంలేని పిచ్ లు తయారు చేయటం బౌలర్లపాలిట శాపంగా మారిందంటూ మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ బౌలర్లు వాపోతున్నారు. బౌలర్లను కాపాడంటూ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సైతం తనదైన శైలిలో సందేశాలు పెడుతూ కలకలకం రేపుతున్నాడు.

ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే బ్యాటుకు బంతికీ నడుమ సమతూకం ఉండేలా నిబంధనలు రూపొందించాలంటూ భారత మాజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పిలుపునిచ్చాడు.

బంతిమీద బ్యాట్ సంపూర్ణ ఆధిపత్యం ఏవిధంగానూ సమర్థనీయం కాదని తేల్చి చెప్పాడు.

First Published:  28 April 2024 8:15 AM GMT
Next Story