Telugu Global
Sports

36 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట మాత్రమే అనుకొనేరోజులు పోయాయి. 36 సంవత్సరాల లేటు వయసులోనూ ఐపీఎల్ ఆడవచ్చునని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు నిరూపించాడు.

36 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట మాత్రమే అనుకొనేరోజులు పోయాయి. 36 సంవత్సరాల లేటు వయసులోనూ ఐపీఎల్ ఆడవచ్చునని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు నిరూపించాడు.

ఐపీఎల్ లో చెన్నై ఫ్రాంచైజీ అనగానే...వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘనతే అభిమానులకు గుర్తుకు వస్తుంది. అయితే..వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతిభ, అనుభవం ప్రాతిపదికన సీనియర్, వెటరన్ క్రికెటర్లకు తమ ఫ్రాంచైజీ తరపున ఆడే అవకాశం కల్పించడంలో చెన్నై తరువాతే ఏదైనా...

రెండో అతిపెద్ద వయసున్న ఆటగాడిగా...

ఐపీఎల్ 17వ సీజన్ 49వ మ్యాచ్ ద్వారా చెన్నైజట్టులోని వెటరన్ పేసర్ రిచర్డ్స్ గ్లీసన్ అరంగేట్రం చేశాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ కు చెందిన రిచర్డ్‌ గ్లీసన్ రంగప్రవేశం చేశాడు. ఈ క్రమంలోనే రికార్డుల్లో చేరాడు.

ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద వయస్కుడైన క్రికెటర్ గా గ్లీసన్ నిలిచాడు. 36 సంవత్సరాల 151 రోజుల వయసులో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో చేరాడు.

జింబాబ్వే బ్యాటింగ్ ఆల్ రౌండర్ సికిందర్ రాజా 36 సంవత్సరాల 342 రోజుల వయసులో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడితే..ఆ తరువాతి స్థానంలో రిచర్డ్ గ్లీసన్ నిలిచాడు.

దక్షిణాఫ్రికా వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 35 సంవత్సరాల 44 రోజుల వయసులోనూ, జలజ్ సక్సేనా 34 ఏళ్ల 124 రోజుల వయసులోనూ, కేశవ్ మహారాజ్ 34 ఏళ్ల 63 రోజుల వయసులోనూ ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముదురు ప్లేయర్లుగా నిలిచారు.

చెన్నైజట్టులోని డేవన్ కాన్వే గాయంతో అందుబాటులో లేకపోడంతో...అతనిస్థానంలో ఇంగ్లండ్ తరపున 6 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉన్న గ్లీసన్ కు చోటు కల్పించారు.

తన కెరియర్ లో 90 టీ-20 మ్యాచ్ లు ఆడి 101 వికెట్లు పడగొట్టిన రికార్డు గ్లీసన్ కు ఉంది. అంతేకాదు..ఇంగ్లండ్ తరపున 9 వికెట్లు సాధించాడు.

34 ఏళ్ల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్..

రిచర్డ్ గ్లీసన్ కు 34 ఏళ్ల వయసులో భారత్ ప్రత్యర్థిగా..జులై 2022న తన తొలి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ఆడిన ఘనత ఉంది. తన కెరియర్ మొదటి 8 బంతుల్లోనే భారత స్టార్ త్రయం రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రిషభ్ పంత్ లను గ్లీసన్ పెవీలియన్ దారి పట్టించడం ద్వారా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

పంజాబ్ ప్రత్యర్థిగా తన అరంగేట్రం మ్యాచ్ లో గ్లీసన్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. చెన్నైజట్టు ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

First Published:  2 May 2024 6:42 AM GMT
Next Story