Telugu Global
Sports

ఐపీఎల్ ఆఖరి బెర్త్ కోసం మూడుస్తంభాలాట!

ఐపీఎల్- 16వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్లో ఆఖరి బెర్త్ కోసం మూడుజట్లు పోటీపడుతున్నాయి. ఈ రోజు జరిగే ఆఖరి రౌండ్ పోటీల ఫలితాలతో ఆఖరిజట్టేదో తేలిపోనుంది.

ఐపీఎల్ ఆఖరి బెర్త్ కోసం మూడుస్తంభాలాట!
X

ఐపీఎల్ ఆఖరి బెర్త్ కోసం మూడుస్తంభాలాట!

ఐపీఎల్- 16వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్లో ఆఖరి బెర్త్ కోసం మూడుజట్లు పోటీపడుతున్నాయి. ఈ రోజు జరిగే ఆఖరి రౌండ్ పోటీల ఫలితాలతో ఆఖరిజట్టేదో తేలిపోనుంది...

దేశంలోని వివిధ నగరాలు వేదికగా గత ఆరువారాలుగా సాగుతూ వస్తున్న ఐపీఎల్- 16వ సీజన్ లీగ్ సమరం ముగింపు దశకు చేరింది. మొత్తం 70 మ్యాచ్ లు, 10 జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ఇప్పటికే ముగిసిన 68 మ్యాచ్ ల ఫలితాలతో..డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు..ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగుకు మూడు బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

మిగిలిన ఆఖరి బెర్త్ కోసం ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్, మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్, గతేడాది ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మూడుస్తంభాలాట జరుగుతోంది.

గుజరాత్ చేతిలో ముంబై భవితవ్యం!

ఐపీఎల్ -16వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ కు ముంబై ఇండియన్స్ చేరేది లేనిది తన ఆఖరు రౌండ్ మ్యాచ్ ఫలితం తో పాటు..టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ పైనా ఆధారపడి ఉంది.

హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగే ఆఖరిరౌండ్ పోరులో ముంబై భారీఆధిక్యంతో నెగ్గితీరాల్సి ఉంది.

నెట్ రన్ రేట్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కంటే వెనుకబడి ఉన్న ముంబై..ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్లలో 7 విజయాలు, 6 పరాజయాలతో పాటు 14 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 6వ స్థానంలో కొనసాగుతోంది.

సన్ రైజర్స్ తో జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో ముంబై నెగ్గితే 16 పాయింట్లు సంపాదించగలుగుతుంది. అయితే..భారీతేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసి తీరాల్సి ఉంది.

అంతేకాదు..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగే ఆఖరి రౌండ్ పోరులో గుజరాత్ టైటన్స్ నెగ్గితేనే..ముంబైకి ప్లే-ఆఫ్ రౌండ్లోని ఆఖరి బెర్త్ ఖాయంకానుంది.

వాంఖడే స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్- ముంబై ఇండియన్స్ జట్ల 14వ రౌండ్ మ్యాచ్ మధ్యాహ్నం 3-30కి ప్రారంభం కానుంది.

గుజరాత్ పై నెగ్గితేనే బెంగళూరుకు బెర్త్!

ఇక..బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను సైతం ప్లే-ఆఫ్ రౌండ్ ఆఖరి బెర్త్ ఊరిస్తోంది. ప్రత్యర్థి ముంబై, రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ తో దూకుడుమీదున్న బెంగళూరు..అర్హత సాధించాలంటే హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఆఖరి రౌండ్ పోరులో లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించితీరాల్సి ఉంది. మ్యాచ్ నెగ్గి 2 పాయింట్లు సాధిస్తే చాలు..నెట్ రన్ రేట్ తో పనిలేకుండానే బెంగళూరు ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్లలో 7 విజయాలు, 6 పరాజయాల ద్వారా 14 పాయింట్లు సాధించిన బెంగళూరు లీగ్ టేబుల్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

పవర్ ఫుల్ గుజరాత్ టైటాన్స్ ను అధిగమించాలంటే..స్టార్ ఓపెనర్లు విరాట్ కొహ్లీ- డూప్లెసీలతో పాటు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్, పేసర్ సిరాజ్, లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ అత్యుత్తమంగా రాణించి తీరక తప్పదు.

రాజస్థాన్ అవకాశాలు అంతంత మాత్రమే!

ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగో బెర్త్ కోసం పోటీలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో 7 విజయాలు, 7 పరాజయాలతో 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్ రాయల్స్ లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతోంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే...ఈరోజు జరిగే ఆఖరి రౌండ్ మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ చేతిలో ముంబై, గుజరాత్ టైటాన్స్ చేతిలో బెంగళూరు ఓడాల్సిఉంది.

ఆఖరి రెండురౌండ్లలో ఏ ఒక్కమ్యాచ్ ఫలితం తారుమారైనా రాజస్థాన్ నిష్క్ర్రమించక తప్పదు.

మూడుజట్లకు ప్లే-ఆఫ్ బెర్త్ లు..

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 13 రౌండ్లలో 9 విజయాలు, 4 పరాజయాలతో 18 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

క్వాలిఫైయర్ -1 పోరులో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ తలపడనుంది.

లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 14 రౌండ్లలో8 విజయాలు, 5 పరాజయాలతో 15 పాయింట్లు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

ఐపీఎల్ చరిత్రలో 12వసారి ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన చెన్నై ప్రస్తుత సీజన్ లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.

లక్నోకి లక్కీ చాన్సులే...!

ప్రస్తుత ఐపీఎల్ లో అత్యంత అదృష్టవంతమైన జట్టు ఏదంటే..లక్నో సూపర్ జెయింట్స్ అనిమాత్రమే చెప్పాలి. 13వ రౌండ్లో ముంబై, 14వ రౌండ్లో కోల్ కతా జట్లపై వెంట్రుక వాసి విజయాలు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానంలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు వరుసగా రెండోసీజన్లో సైతం చేరగలిగింది.

కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమైనా..స్టాప్ గ్యాప్ కెప్టెన్ కృణాల్ పాండ్యా నాయకత్వంలోని లక్నో జట్టు..14 రౌండ్లలో 8 విజయాలు, 5 పరాజయాలతో 17 పాయింట్లు సాధించడం ద్వారా మూడోస్థానంలో నిలిచింది.

ప్లే-ఆఫ్ రౌండ్లో ఆఖరి బెర్త్ ను సాధించిన జట్టుతో ఎలిమినేటర్ రౌండ్ పోరులో లక్నో తలపడాల్సి ఉంది.

First Published:  21 May 2023 5:59 AM GMT
Next Story