Telugu Global
Sports

హైదరాబాద్ కు ఐపీఎల్ ఫీవర్, నేడు ముంబైతో సన్ రైజర్స్ ఢీ!

ఐపీఎల్ ఫీవర్ మరోసారి హైదరాబాద్ నగరాన్ని తాకింది. రాజీవ్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే పోరులో ముంబైతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.

Sunrisers Hyderabad vs Mumbai Indians: హైదరాబాద్ కు ఐపీఎల్ ఫీవర్, నేడు ముంబైతో సన్ రైజర్స్ ఢీ!
X

హైదరాబాద్ కు ఐపీఎల్ ఫీవర్, నేడు ముంబైతో సన్ రైజర్స్ ఢీ!

ఐపీఎల్ ఫీవర్ మరోసారి హైదరాబాద్ నగరాన్ని తాకింది. రాజీవ్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే పోరులో ముంబైతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది....

ఐపీఎల్ -16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో మరో ఆసక్తికరమైన పోరుకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 7-30కి ప్రారంభమయ్యే లీగ్ 25వ మ్యాచ్ లో ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ కు మాజీ విజేత, ఆతిథ్య హైదరాబాద్ సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.

సమఉజ్జీల సమరం...

ప్రస్తుత సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఇటు హైదరాబాద్, అటు ముంబైజట్లు చెరో నాలుగుమ్యాచ్ లు చొప్పున ఆడి రెండు విజయాలు, రెండు పరాజయాల రికార్డుతో ఉన్నాయి.

మొదటి రెండురౌండ్లలోనూ ఓటమి పొందిన సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ..మూడు, నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లో మాత్రం కళ్లు చెదిరే విజయాలతో ఫామ్ లోకి వచ్చాయి.

సన్ రైజర్స్ కే హోం ఎడ్వాంటేజ్....

70 మ్యాచ్ ల ప్రస్తుత సీజన్ లీగ్ లో హైదరాబాద్ వేదికగా..సన్ రైజర్స్ హోం మ్యాచ్ లు ఏడు జరుగనున్నాయి. అందులో ఇప్పటికే రెండుమ్యాచ్ లు ముగిసిపోయాయి.

తొలిమ్యాచ్ లో సన్ రైజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేస్తే..రెండోమ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ కంగు తినిపించింది.

అయితే..సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తమ రెండో విజయాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ పైనే సాధించడం విశేషం.

రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ ఐదోరౌండ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హోంఎడ్వాంటేజ్ తో బరిలోకి దిగుతోంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్ లో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 180కి పైగా స్కోరు సాధించగలిగితే చేజింగ్ కు దిగిన జట్టుకు కష్టాలు తప్పవు.

ముంబై 10- హైదరాబాద్ 9

ఐపీఎల్ గత 15 సీజన్లుగా ముంబై- హైదరాబాద్ జట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులను బట్టి చూస్తే.. ముంబై ఇండియన్స స్వల్పఆధిక్యతతో ఉంది. రెండుజట్లూ 19 మ్యాచ్ ల్లో తలపడితే ముంబై 10 విజయాలు, హైదరాబాద్ సన్ రైజర్స్ 9 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఎయిడెన్ మర్కరమ్ నాయకత్వంలోని హైదరాబాద్ సన్ రైజర్స్ గత రెండురౌండ్లలో సాధించిన విజయాల జోరుతో వరుసగా మూడో విజయానికి ఉరకలేస్తోంది.

ఓపెనర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీతో ఫామ్ లోకి రావడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ కుదురుకున్నట్లే కనిపిస్తోంది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వరుస పరాజయాలు టీమ్ మేనేజ్ మెంట్ ను కలవర పెడుతున్నాయి.

బౌలింగ్ లో సీమర్ల త్రయం భువీ, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తో పాటు స్పిన్ జోడీ మార్కండే, వాషింగ్టన్ సుందర్ తో పాటు..ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ సైతం కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.

పవర్ ఫుల్ ముంబైని నిలువరించాలంటే సన్ రైజర్స్ ఆట అన్ని విభాగాలలోనూ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించక తప్పదు.

టాప్ గేర్ లో ముంబై ఇండియన్స్..

ఢిలీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఓపెనర్ ఇషాన్ కిషన్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి రావడంతో ముంబై బ్యాటింగ్ అత్యంత భీకరంగా కనిపిస్తోంది.

మిడిలార్డర్లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ నమ్మదగిన బ్యాటర్ గా ముంబైకి పెట్టని కోటలా నిలుస్తూ వస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మేడిన్ హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియంలో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ నే ఈరోజే ఆడనున్నాడు.

ప్రస్తుత సీజన్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో 84 నాటౌట్, 22, 41, 30 స్కోర్లతో నిలకడగా రాణించిన తిలక్ వర్మ..భారీస్కోరుకు తహతహలాడుతున్నాడు.

దానికితోడు..గత మ్యాచ్ లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ను ఈమ్యాచ్ లో సైతం ముంబై కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్సీని పక్కన పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా గత మ్యాచ్ బరిలోకి దిగి 20 పరుగులు సాధించిన రోహిత్ శర్మ..ప్రస్తుత హైదరాబాద్ మ్యాచ్ లో నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

బౌలింగ్ విభాగంలో ముంబై ను వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఆదుకొంటూ వస్తున్నాడు. డెత్ బౌలింగ్ లో మెర్డిత్ పైనే ముంబై పూర్తిగా ఆధారపడి ఉంది. స్పిన్ జోడీ హృతిక్ షౌకిన్, కుమార కార్తికేయ సైతం ముంబైకి కీలకం కానున్నారు.

టాస్ కీలకపాత్ర పోషించనుంది. ఏదీ ఏమైనా..ముంబై ఇండియన్స్ - హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల ఈ కీలక పోరుకు రాజీవ్ స్టేడియం కిటకిటలాడనుంది.

First Published:  18 April 2023 11:30 AM GMT
Next Story