Telugu Global
Sports

ప్లే-ఆఫ్ రౌండ్లోనూ శుభ్ మన్ గిల్ రికార్డుల మోత!

గుజరాత్ టైటాన్స్ సూపర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ లీగ్ దశలో మాత్రమే కాదు..ప్లే- ఆఫ్ రౌండ్లో సైతం రికార్డుల మోత మోగించాడు. సుడిగాలి శతకంతో అరడజను రికార్డులు నెలకొల్పాడు.

ప్లే-ఆఫ్ రౌండ్లోనూ శుభ్ మన్ గిల్ రికార్డుల మోత!
X

గుజరాత్ టైటాన్స్ సూపర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ లీగ్ దశలో మాత్రమే కాదు..ప్లే- ఆఫ్ రౌండ్లో సైతం రికార్డుల మోత మోగించాడు. సుడిగాలి శతకంతో అరడజను రికార్డులు నెలకొల్పాడు.

ఐపీఎల్ -16వ సీజన్ గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ షోలా కొనసాగుతోంది. 14 మ్యాచ్ ల లీగ్ దశలో మాత్రమే కాదు..నాలుగుమ్యాచ్ ల ప్లే-ఆఫ్ రౌండ్లోనూ 23 సంవత్సరాల శుభ్ మన్ పరుగులహోరు, శతకాల జోరు రికార్డుల పంట పండించాడు.

ఒక్క సెంచరీ- అరడజను రికార్డులు...

లీగ్ దశ ఆఖరి మూడురౌండ్లలో రెండు శతకాలు బాదిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్..ప్లే-ఆఫ్ రౌండ్ తొలిమ్యాచ్ లో స్థాయికి తగ్గట్టుగా ఆడకపోయినా..

నెగ్గితీరాల్సిన క్వాలిఫైయర్ -2లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు.

హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్ -2 పోరులో ముంబైని ఓ ఆటాడుకొన్నాడు. 37 పరుగుల లోపే మూడుసార్లు అవుట్ కాకుండా తప్పించుకొన్న గిల్..సుడిగాలి సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 60 బంతుల్లోనే 129 పరుగులతో వీరవిహారం చేశాడు. 7 ఫోర్లు, 10 సిక్సర్లతో శివాలెత్తిపోయాడు.

సాయి సుదర్శన్ తో కలసి రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా తనజట్టుకు 233 పరుగుల భారీస్కోరు అందించాడు.

ప్లే-ఆఫ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు...

ముంబై ఇండియన్స్ పై శుభమన్ గిల్ 129 పరుగుల స్కోరు సాధించడం ద్వారా..గత 15 సీజన్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరుతో ఉన్న 122 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును శుభ్ మన్ తెరమరుగు చేయగలిగాడు.

2014 ఐపీఎల్ లో చెన్నైతో జరిగిన ప్లే-ఆఫ్ రౌండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తరపున వీరేంద్ర సెహ్వాగ్ క్వాలిఫైయర్స్ -2 మ్యాచ్ లో 122 పరుగులతో సెంచరీ సాధించాడు. అదే ఇప్పటి వరకూ ప్లే-ఆఫ్ రౌండ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.

అంతేకాదు..ఐపీఎల్ లోనే ఓ భారత బ్యాటర్ సాధించిన రెండో అత్యధిక స్కోరుగా కూడా గిల్ సాధించిన 129 పరుగుల స్కోరు రికార్డుల్లో చేరింది. 2020 ఐపీఎల్ లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ 132 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఇప్పటికీ రాహుల్ సాధించిన శతకమే అత్యధిక స్కోరుగా ఉంది.

అత్యధిక సిక్సర్ల రికార్డు..

ప్లే-ఆఫ్ రౌండ్లోని ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డును సైతం శుభ్ మన్ గిల్ నెలకొల్పాడు. గిల్ సాధించిన 129 పరుగుల శతకంలో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ వృద్ధిమాన్ సాహా, క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్ ఎనిమిదేసి సిక్సర్లు చొప్పున బాది..ప్లే-ఆఫ్ రౌండ్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల రికార్డును సంయుక్తంగా నిలుపుకొంటూ వచ్చారు.

వన్ డౌన్ ఆటగాడు సాయి సుదర్శన్ తో కలసి రెండో వికెట్ కు గిల్ 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా మరో రికార్డు నెలకొల్పాడు. ప్లే-ఆఫ్ రౌండ్లో అతిపెద్ద భాగస్వామ్యం గిల్- సాయి సుదర్శన్ లదే కావడం విశేషం2023 సీజన్లో..క్వాలిఫైయర్ -2 వరకూ గిల్ మూడు శతకాలతో సహా మొత్తం 851 పరుగులు సాధించాడు. 2016 లో విరాట్ కొహ్లీ 973, 2022 లో జోస్ బట్లర్ 863 పరుగులు సాధించగా..851 పరుగులతో శుభ్ మన్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

శుభ్ మన్ గిల్ సాధించిన 129 పరుగుల సెంచరీతో ..గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లకు 233 పరుగులు స్కోరు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.

ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సాధించిన 60 బంతుల్లో 124 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును సైతం 60 బంతుల్లోనే 129 పరుగులు సాధించడం ద్వారా గిల్ అధిగమించగలిగాడు.

రైనా పేరుతో అత్యధిక పరుగుల రికార్డు...

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా పేరుతో ఉంది. రైనా తన కెరియర్ లో మొత్తం 24 ప్లే-ఆఫ్ ఇన్నింగ్స్ ఆడి 714 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అత్యధికంగా 21 ఇన్నింగ్స్‌ ఆడిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 522 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ ఇద్దరి తర్వాత షేన్‌ వాట్సన్‌ 12 ఇన్నింగ్స్‌లో 389 పరుగులు, మైఖేల్‌ హస్సీ 11 ఇన్నింగ్స్‌లో 388 పరుగులు, ఫాఫ్ డూప్లెసిస్‌ 14 ఇన్నింగ్స్‌లో 373 పరుగులతో వరుసగా 3, 4, 5వ స్థానాల్లో ఉన్నారు.

ప్లే-ఆఫ్ రౌండ్ల ' సూపర్ ' కింగ్ చెన్నై!

ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలో 14 టోర్నీలలో పాల్గొన్న చెన్నై సూపర్ కింగ్స్ 12సార్లు ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

10 ఫైనల్స్ ఆడి నాలుగుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది.

ఐదుసార్లు ( 2013, 15, 17, 2019, 2020 ) చాంపియన్ ముంబై ఇండియన్స్ 11సార్లు ప్లే-ఆఫ్ రౌండ్ చేరటంతో పాటు 10 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 8సార్లు ( 2009, 10, 11, 15, 16, 20, 21, 22 ), కోల్ కతా నైట్ రైడర్స్ 7సార్లు ( 2011, 12, 14, 16, 17, 18, 2021 ) హైదరాబాద్ సన్ రైజర్స్ 6సార్లు ( 2013, 16,17, 18 , 19, 20)2016 విన్నర్, 2018 రన్నరప్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన జట్లుగా నిలిచాయి. డకౌట్లలో బట్లర్, దినేశ్ కార్తీక్ రికార్డులు...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 17 డకౌట్లతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఓ చెత్త రికార్డును మూటగొట్టుకొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ప్రస్తుత సీజన్లో 5 డకౌట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

అయితే...ముంబై యువపేసర్ ఆకాశ్ మథ్వాల్ 3.3 ఓవర్లలో 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా..ప్లే-ఆఫ్ రౌండ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగలిగాడు.

First Published:  28 May 2023 6:45 AM GMT
Next Story