Telugu Global
Sports

ఐపీఎల్ -16లో రికార్డుల మోత!

ఐపీఎల్ 16వ సీజన్ తొలిరౌండ్ పోటీలలోనే పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. విరాట్, రోహిత్, చహాల్ సీజన్ తొలిమ్యాచ్ లను రికార్డులతో మొదలు పెట్టారు.

ఐపీఎల్ -16లో రికార్డుల మోత!
X

ఐపీఎల్ 16వ సీజన్ తొలిరౌండ్ పోటీలలోనే పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. విరాట్, రోహిత్, చహాల్ సీజన్ తొలిమ్యాచ్ లను రికార్డులతో మొదలు పెట్టారు...

దేశవ్యాప్తంగా పలు నగరాల వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ తొలిరౌండ్ మ్యాచ్ ల్లోనే పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్- రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన

రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్ పోటీలలో ఈ రికార్డులు వచ్చి చేరాయి.

50 హాఫ్ సెంచరీల విరాట్ కొహ్లీ....

ముంబై ఇండియన్స్ తో హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన తొలిరౌండ్ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ మెరుపు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలవడం ద్వారా ఓ సరికొత్త రికార్డు సాధించాడు.

ఐపీఎల్ లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పిన విరాట్ ..సరికొత్తగా 50 హాఫ్ సెంచరీలు సాధించిన భారత తొలి బ్యాటర్ గా నిలిచాడు. సహఓపెనర్ డూప్లెసీతో కలసి మొదటి వికెట్ కు 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా ముంబై బౌలర్లను ఓ ఆటాడుకొన్నాడు.

విరాట్ కేవలం 49 బాల్స్ లోనే 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

డేవిడ్ వార్నర్ తర్వాతిస్థానంలో విరాట్..

ఐపీఎల్ 16వ సీజన్ మొదటి రౌండ్ మ్యాచ్ లు ముగిసే వరకూ అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరుతో ఉంది.

వార్నర్ మొత్తం 60 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాలలో 50 హాఫ్ సెంచరీలతో విరాట్ కొహ్లీ, 49 హాఫ్ సెంచరీలతో శిఖర్ ధావన్ ఉన్నారు.

విరాట్ కొహ్లీకి ఐపీఎల్ లో ఐదుసార్లు శతకాలు బాదిన ఘనత సైతం ఉంది.

300 వికెట్ల మొనగాడు యజువేంద్ర చాహల్...

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ జట్టుతో జరిగిన తొలిరౌండ్ పోరులో 17 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ-20ల్లో 300 వికెట్లు పడగొట్టిన భారత తొలి లెగ్ స్పిన్నర్ గా యజువేంద్ర చాహల్ నిలిచాడు.

సన్ రైజర్స్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ను పడ్డగొట్టడం ద్వారా చాహల్ తన టీ-20 వికెట్ల సంఖ్యను 300కు పెంచుకోగలిగాడు. మ‌యాంక్‌ అగర్వాల్ , అదిల్ ర‌షీద్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ వికెట్ల‌ను సైతం చాహ‌ల్ పడగొట్టాడు.

అత్యధిక టీ-20 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ ( 303 ), అశ్విన్‌(287), పీయూష్ చావ్లా(276), అమిత్ మిశ్రా(272), బుమ్రా(256) ఉన్నారు.

కేవలం ఐపీఎల్‌లోనే చాహ‌ల్ 170 వికెట్లు సాధించాడు. 200 వికెట్ల రికార్డుకు 30 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగతో క‌లిసి చాహల్ 170 వికెట్లతో సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా డ్వయన్ బ్రావో 183 వికెట్లతో టాపర్ గా నిలిచాడు.

200 టీ-20ల్లో కెప్టెన్ గా రోహిత్...

ఇక..భారత్ కమ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఓ చెత్త రికార్డుతో పాటు ఘనమైన రికార్డును సైతం దక్కించుకోగలిగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ జట్టుతో జరిగిన ప్రస్తుత సీజన్ తొలిరౌండ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించడం ద్వారా రోహిత్ 200 టీ-20 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన మూడో క్రికెటర్ గా, రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

భారతజట్టుతో పాటు ఐపీఎల్ టీ-20ల్లో ముంబైకి నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు కెప్టెన్ గా ఇది 200 వ మ్యాచ్ కావడం విశేషం. భారత ఆల్ టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ 307 మ్యాచ్ ల రికార్డుతో నంబర్ వన్ గా ఉంటే..వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ 207 మ్యాచ్ లతో రెండోస్థానంలో నిలిచాడు. 200 మ్యాచ్ లతో రోహిత్ శర్మ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

కేవలం ఐపీఎల్ పరంగా చూస్తే..రోహిత్ 143 మ్యాచ్ ల్లోనే కెప్టెన్ గా వ్యవహరించాడు. 57 టీ-20 మ్యాచ్ ల్లో మాత్రమే భారతజట్టుకు రోహిత్ నాయకత్వం వహించాడు.

ముంబై..బ్యాడ్, బ్యాడ్.....

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబై. గత 15 సీజన్లలో ఐదుసార్లు ట్రోఫీ అందుకొన్న తొలి, ఏకైకజట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. ఇంత గొప్పరికార్డు సాధించిన ముంబై పేరుతోనే మరో చెత్త రికార్డు సైతం వచ్చి చేరింది.

ఐపీఎల్ ప్రారంభరౌండ్లను తడబడుతూ ప్రారంభించడం ముంబైకి ప్రధాన బలహీనతగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత సీజన్ తో కలసి మొత్తం 16 సీజన్ల ప్రారంభమ్యాచ్ ల్లో..11 సీజన్లలో తొలి విజయం నమోదు చేయలేకపోయింది.

ప్రస్తుత సీజన్ తొలిరౌండ్ పోరులో బెంగళూరు చేతిలో ముంబై 8 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది.

ముంబై ఇండియన్స్ 2012 సీజన్లోనే చివరిసారిగా తన తొలిరౌండ్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి వరుసగా గత 11 సీజన్లుగా తొలిరౌండ్ ను ఓటమితోనే మొదలు పెట్టడం ముంబై పాలిట శాపంగా మారింది.

మొత్తం 70 మ్యాచ్ ల లీగ్ మొదటి ఐదుమ్యాచ్ ల్లోనే నాలుగు అరుదైన రికార్డులు నమోదైతే...మిగిలిన 65 మ్యాచ్ ల్లో మరెన్ని రికార్డులు నమోదవుతాయో మరి.!

First Published:  3 April 2023 11:29 AM GMT
Next Story