Telugu Global
Sports

ఐపీఎల్ లో ..హలో! బ్రదర్స్!

ఐపీఎల్ లో గత 16 సీజన్లుగా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతూ వస్తోంది. దక్షిణాఫ్రికా కవల సోదరులు మార్కో జాన్సన్- డువాన్ జాన్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు..

ఐపీఎల్ లో ..హలో! బ్రదర్స్!
X

ఐపీఎల్ లో గత 16 సీజన్లుగా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతూ వస్తోంది. దక్షిణాఫ్రికా కవల సోదరులు మార్కో జాన్సన్- డువాన్ జాన్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ అంటేనే చిత్రవిచిత్రాల నిలయం. 2008 లో ప్రారంభమైన ఈ లీగ్ గత 16 సీజన్లుగా అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ వస్తోంది. పలు అంశాలలో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ వేలకోట్ల రూపాయల వ్యాపారంగా , క్రికెట్ లీగ్ లకే తలమానికంగా నిలుస్తోంది.

కొత్తనీరు రాకడ..పాతనీరు పోకడ అన్నమాట ఐపీఎల్ లో ప్రముఖంగా కనిపిస్తుంది.

2008 ప్రారంభ లీగ్ నుంచి ప్రస్తుత 2023 16వ సీజన్ వరకూ వివిధ దేశాలకు చెందిన ఎందరో ఆటగాళ్లు వచ్చారు, వెళ్ళారు. కొందరు మాత్రమే కాలపరీక్షకు నిలబడి, లీగ్ ఒత్తిడిని తట్టుకొని ఇప్పటికీ తమ ప్రస్థానం కొనసాగించగలుగుతున్నారు.

పఠాన్ బ్రదర్స్ నుంచి జాన్సన్ బ్రదర్స్ వరకూ...

టెస్టు హోదా పొందిన వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన యువ, సీనియర్ క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకోడానికి ఐపీఎల్ ఓ గొప్పవేదికగా నిలిచింది. ఐపీఎల్ లో పాల్గొనటం, రాణించటం, ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఇపుడు యువక్రికెటర్ల అంతిమలక్ష్యంగా మారిపోయాయి.

ఇక..ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు..అదీ సోదరులు పాల్గొనటం ఐపీఎల్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది.

తొలి ఐపీఎల్ లో పఠాన్ బ్రదర్స్ ( ఇర్ఫాన్, యూసుఫ్ ), మోర్కెల్ బ్రదర్స్ ( మోర్నీ, అల్బీ ), హస్సీ బ్రదర్స్ ( మైక్, డేవిడ్ ) తమ ఆటతీరుతో లీగ్ ను కొత్తపుంతలు తొక్కించారు.

పాండ్యా బ్రదర్స్ హవా...

ఆ తర్వాతి కాలంలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యులుగా పాండ్యా బ్రదర్స్ హార్థిక్ , కృణాల్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ముంబైని చాంపియన్ గా నిలబెట్టడంలో తమవంతు పాత్ర నిర్వర్తించడం ద్వారా పాండ్యా సోదరులు సూపర్ స్టార్ బ్రదర్స్ జోడీగా గుర్తింపు పొందారు.

ఆస్ట్ర్రేలియన్ జోడీ షాన్ మార్ష్- మిషెల్ మార్ష్, కరీబియన్ బ్రదర్స్ డ్వయన్ బ్రావో- డారెన్ బ్రావో, కివీ బ్రదర్స్ బ్రెండన్ మెకల్లమ్-నాథన్ మెకల్లమ్ తమదైన శైలిలో రాణిస్తూ వచ్చినా తమదైన ముద్రను వేయలేకపోయారు.

ఇంగ్లండ్ కు చెందిన సామ్ కరెన్- టామ్ కరెన్ వివిధ ఫ్రాంచైజీలకు ఆడినా సామ్ మాత్రమే సూపర్ ఆల్ రౌండర్ గా నిలదొక్కుకోగలిగాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో చెన్నై ఫ్రాంచైజీకి ఆడిన సామ్ ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులో సామ్ కరెన్ కీలక సభ్యుడిగా ఉన్నాడు.

2023 సీజన్ వేలంలో ఐదు బ్రదర్స్ జంటలు..

ఐపీఎల్ -16వ సీజన్ మెగా వేలంలో ఐదుగురు బ్రదర్స్ జంటలు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన అపరాజిత బ్రదర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన జాన్సన్ బ్రదర్స్, చహార్ బ్రదర్స్ , అగర్ బ్రదర్స్, బ్రావో బ్రదర్స్ వేలం బరిలో నిలిచినా చహార్, జాన్సన్ బ్రదర్స్ వివిధ ఫ్రాంచైజీలలో చోటు దక్కించుకోగలిగారు.

ఐపీఎల్ లో పాల్గొన్న పదవ సోదరుల జంటగా మార్కో జాన్సన్- డువాన్ జాన్సన్ రికార్డుల్లో చేరారు.

తొలి కవలసోదరుల జంట జెన్సన్ బ్రదర్స్...

ఐపీఎల్ చరిత్రలోనే వివిధ జట్లకు ఆడిన తొలి కవల సోదరుల జంటగా మార్కో జెన్సన్- డువాన్ జెన్సన్ చరిత్ర సృష్టించారు. ఎడమచేతి వాటం పేస్ ఆల్ రౌండర్లుగా మార్కో, డువాన్ గుర్తింపు పొందారు.

ఆరడుగుల జెయింట్ పేసర్ మార్కో జెన్సన్ ను వేలం ద్వారా హైదరాబాద్ సన్ రైజర్స్ సొంతం చేసుకొంటే..డువాన్ జెన్సన్ ను 20 లక్షల రూపాయల కనీస ధరకు ముంబై ఫ్రాంచైజీ తనజట్టులో చేర్చుకొంది.

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన నాలుగోరౌండ్ మ్యాచ్ లో అర్జున్ టెండుల్కర్ తో కలసి డువాన్ జెన్సన్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్ ఆడాడు. డువాన్ తన కోటా 4 ఓవర్లల 53 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగలిగాడు.

ఇక..సన్ రైజర్స్ కు ఆడుతున్న మార్కో జెన్సన్ మాత్రం తనజట్టు విజయాలలో ప్రధానపాత్ర వహిస్తున్నాడు. మ్యాచ్ కు రెండు వికెట్ల చొప్పున పడగొడుతూ నమ్మదగిన మీడియం పేసర్ గా నిలిచాడు.

రానున్న మ్యాచ్ ల్లో ఈ కవల సోదరులు తమ జట్ల తరపున ఏ రేంజ్ లో రాణిస్తారన్నదే ఇక్కడి అసలు పాయింట్.

ఐపీఎల్ లో ఆడిన తొలి తండ్రికొడుకుల జంటగా సచిన్ టెండుల్కర్- అర్జున్ టెండుల్కర్ నిలిస్తే..తొలి కవలలుగా మార్కో జెన్సన్- డువాన్ జెన్సన్ గుర్తింపు సంపాదించడం..2023 ఐపీఎల్ కే హైలైట్ గా మిగిలిపోతుంది.

First Published:  19 April 2023 12:08 PM GMT
Next Story