Telugu Global
Sports

గుజరాత్ కు ముంబై గండం, నేడే క్వాలిఫైయర్-2 పోరు!

అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి జరిగే క్వాలిఫైయర్ -2 పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2023 Qualifier 2: గుజరాత్ కు ముంబై గండం, నేడే క్వాలిఫైయర్-2 పోరు!
X

IPL 2023 Qualifier 2: గుజరాత్ కు ముంబై గండం, నేడే క్వాలిఫైయర్-2 పోరు!

ఐపీఎల్-16 ఫైనల్స్ కు చేరే రెండోజట్టు ఏదో ఈరోజు తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి జరిగే క్వాలిఫైయర్ -2 పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత కొద్దివారాలుగా అలరిస్తూ వచ్చిన ఐపీఎల్ -16 సమరం క్లయ్ మాక్స్ దశకు చేరింది. నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకోగా...ఫైనల్ రెండో బెర్త్ కోసం డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7-30కి ఈ సూపర్ డూపర్ ఫైట్ ప్రారంభంకానుంది.

హాట్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్...

లేటుగా అయినా లేటెస్టుగా అన్నమాట..ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ కి అతికినట్లు సరిపోతుంది. సీజన్ ప్రారంభంలో పరాజయాలు, ఆ తర్వాత జైత్రయాత్ర చేయటం రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ కు ఓ అలవాటుగా మారింది.

ప్రస్తుత 16వ సీజన్ లీగ్ మొదటి రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు పొందిన ముంబై..ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో గాడిలో పడింది. లీగ్ మధ్యలో తడబడినా..చివరి దశలో కళ్లు చెదిరే చేజింగ్ విజయాలకు తోడు కాస్త అదృష్టం కలసి రావడంతో ప్లే-ఆఫ్ రౌండ్ బెర్త్ సంపాదించగలిగింది.

చెన్నై వేదికగా జరిగిన ఎలిమినేటర్ రౌండ్లో లక్నో సూపర్ జెయింట్స్ ను 81 పరుగులతో చిత్తు చేయడం ద్వారా...ఫైనల్స్ కు అర్హతగా జరిగే క్వాలిఫైయర్స్ -2లో ప్రస్తుత చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది.

టైటాన్స్ కు టెన్షన్ టెన్షన్..!

14 రౌండ్లో లీగ్ దశలో 10 విజయాలతో 20 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కు తొలి క్వాలిఫైయర్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం తప్పలేదు.

దీనికితోడు హోంగ్రౌండ్లో కంటే..ప్రత్యర్థిజట్ల వేదికల్లోనే ఎక్కువ విజయాలు సాధించిన రికార్డు గుజరాత్ కు ఉంది. లీగ్ దశలో భాగంగా హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఆడిన 7 మ్యాచ్ ల్లో గుజరాత్ టైటాన్స్ నాలుగు విజయాలు మాత్రమే సాధించగలిగింది. అదే..ప్రత్యర్థిజట్ల గ్రౌండ్లలో ఆడిన 7 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించడం విశేషం.

ఇక ..ముంబై ప్రత్యర్థిగా 2-1 రికార్డుతో వెనుకబడిన గుజరాత్ కు క్వాలిఫైయర్ -2లో గండం పొంచి ఉంది. పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై చేతిలో లీగ్ దశలో 1-1 రికార్డుతో ఉన్న గుజరాత్ బౌలర్లు అత్యుత్తమంగా రాణించకుంటే భారీమూల్యం చెల్లించుకోక తప్పదు.

ఓపెనర్లు రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్, వన్ డౌన్ కామెరూన్ గ్రీన్, టు డౌన్ సూర్యకుమార్ యాదవ్ లతో పాటు..యువజోడీ తిలక్ వర్మ, నేహాల్ వదేరాల నుంచి..గుజరాత్ బౌలర్లు మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్, అల్జారీ జోసెఫ్ లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.

పైగా..గత 15 సీజన్లలో ప్లే-ఆఫ్ లో 10 మ్యాచ్ లు ఆడి 9 విజయాలు, 1 ఓటమి రికార్డుతో ఉన్న ముంబైజట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

ముంబై బ్యాటింగ్ తో గుజరాత్ బౌలింగ్ ఢీ...

పదునైన బౌలింగ్ ఎటాక్ కలిగిన గుజరాత్ టైటాన్స్ కు భీకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై నుంచి ముప్పు పొంచి ఉంది. లీగ్ దశ 14 మ్యాచ్ లు, ఎలిమినేటర్ రౌండ్ పోరుతో కలుపుకొని మొత్తం 15 మ్యాచ్ ల్లో ముంబై..రికార్డుస్థాయిలో 248 బౌండ్రీలు, 133 సిక్సర్లు బాదిన ఏకైకజట్టుగా నిలిచింది.

అదే గుజరాత్ టైటాన్స్ మాత్రం 15 మ్యాచ్ ల్లో 220 బౌండ్రీలు, 102 సిక్సర్లు మాత్రమే సాధించగలిగింది.

ప్రస్తుత సీజన్లో ఆరుసార్లు 200కు పైగా పరుగులు సాధించడం తో పాటు నాలుగుసార్లు 200 పరుగుల లక్ష్యాలను చేధించిన ఏకైకజట్టుగా కూడా ముంబైకి రికార్డు ఉంది.

ముగ్గురిపైనే గుజరాత్ భారం...

క్వాలిఫైయర్స్ -2కు ఆతిథ్యమిస్తున్న గుజరాత్ టైటాన్స్ బలమంతా ఓపెనర్ శుభ్ మన్ గిల్, బౌలింగ్ జోడీ షమీ, రషీద్ ఖాన్ ల పైనే ఆధారపడి ఉంది.

ప్రస్తుత ఐపీఎల్ లో గిల్ రెండు శతకాలతో సహా 722 పరుగులతో రెండో అత్య్తుత్తమ బ్యాటర్ గా నిలిచాడు.

పేస్ జోడీ మహ్మద్ షమీ 26 వికెట్లు, సీమర్ మోహిత్ శర్మ 17 వికట్లు, స్పిన్ జోడీ రషీద్ ఖాన్ 25 వికెట్లు, నూర్ మహ్మద్ 13 వికెట్ల పడగొట్టారు.

15 మ్యాచ్ ల్లో 111 వికెట్లు పడగొట్టిన ఏకైకజట్టు ఘనతను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకోగలిగింది.

ముంబై బౌలర్లు 15 మ్యాచ్ ల్లో 91 వికెట్లు మాత్రమే సాధించగలిగారు.

అహ్మదాబాద్ లో చేజింగ్ కష్టమే....

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రస్తుత సీజన్లో జరిగిన మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే అత్యధిక విజయాలు నమోదు చేయగలిగాయి. చేజింగ్ కు దిగిన జట్లే ఎక్కువగా పరాజయాలు చవిచూశాయి.

ఈ రికార్డులను బట్టి చూస్తే..ఈ రోజు జరిగే పోరులో టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

లీగ్ దశ వరకూ ముంబై బౌలింగ్ సాదాసీదాగా కనిపించినా..ఎమిలినేటర్ రౌండ్లో మాత్రం పదును తేలింది. యువపేసర్ ఆకాశ్ మధ్వాల్..లక్నో పైన 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

పవర్ ప్లే ఓవర్లలో 7.25, డెత్ ఓవర్లలో 7.26 ఎకానమీ సాధించిన ఆకాశ్..గుజరాత్ బ్యాటర్లపైన ఏమాత్రం ప్రభావం చూపగలడన్నదీ కీలకం కానుంది.

ఈమ్యాచ్ లో నెగ్గినజట్టుకే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడే అవకాశం ఉండడంతో ..రెండుజట్లకూ ఇది డూ ఆర్ డై కానుంది. ముంబై దూకుడును గుజరాత్ ఎంతవరకూ అడ్డుకోగలదన్నది తెలుసుకోవాలంటే..ఈరోజు రాత్రి మ్యాచ్ ముగిసే వరకూ సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  26 May 2023 7:35 AM GMT
Next Story