Telugu Global
Sports

రసపట్టుగా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రేస్!

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ గతంలో ఎన్నడూలేనంత పట్టుగా, రసపట్టుగా సాగుతోంది. ప్లే-ఆఫ్ రౌండ్లో మూడు బెర్త్ ల కోసం ఏడుజట్లు చావో..రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి.

రసపట్టుగా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రేస్!
X

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ గతంలో ఎన్నడూలేనంత పట్టుగా, రసపట్టుగా సాగుతోంది. ప్లే-ఆఫ్ రౌండ్లో మూడు బెర్త్ ల కోసం ఏడుజట్లు చావో..రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి...

సమానబలం కలిగిన ప్రత్యర్థులు తలపడతే వచ్చే మజాయే వేరు. చూడటానికి రెండుకళ్లూ చాలవన్నా అతిశయోక్తి కాదు. ప్రస్తుత ఐపీఎల్ -16 వ సీజన్ లీగ్ కొదమసింహాల సమరంలా సాగుతోంది.

మొత్తం 70 మ్యాచ్ లు..10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ఇక చివరి 7 మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. దూకుడుమీదున్న ముంబై ఇండియన్స్ సైతం 13వ రౌండ్ మ్యాచ్ లో లక్నో టైటాన్స్ చేతిలో 5 పరుగుల ఓటమి చవిచూడటంతో ప్లే-ఆఫ్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.

లీగ్ టేబుల్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్...

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్ల మ్యాచ్ ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

అయితే..ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ 12 రౌండ్లలో చెరో 8 పరాజయాలతో లీగ్ టేబుల్ ఆఖరి రెండుస్థానాలలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రేస్ నుంచి వైదొలిగాయి.

నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ తో సహా మిగిలిన ఏడుజట్లూ ప్లే-ఆఫ్ లోని మిగిలిన మూడు బెర్త్ ల కోసం పోరాడుతున్నాయి.

చివరి ఏడుమ్యాచ్ ల ఫలితాలే ఈ ఏడుజట్ల తలరాతను ఖరారు చేయనున్నాయి.

7 మ్యాచ్ లు..128 రకాల ఫలితాలు...

రౌండ్ రాబిన్ లీగ్ చివరి ఏడుమ్యాచ్ ల్లో వివిధజట్ల ఆటతీరు, ఫలితాలను బట్టి అంచనావేస్తే 128 రకాలుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గణాంకవేత్తలు చెబుతున్నారు.

రెండుజట్లు తలపడితే..ఓ జట్టు విజేతగా, మరో జట్టు పరాజితగా నిలవడంతో మిగిలిన జట్ల అవకాశాలు తగ్గిపోడం,పెరిగిపోడం జరుగుతాయని , ఒక జట్టు విజయం మరో జట్టు అవకాశాలను పెంచితే..మరో జట్టు ఓటమి వేరే అవకాశాలను దెబ్బకొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇప్పటికే..గుజరాత్ టైటాన్స్ ,చెన్నై సూపర్ కింగ్స్ ప్లే -ఆఫ్ రౌండ్ చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతా జట్లు రేస్ నుంచి నిష్క్ర్రమించాయి. ఈ మూడుజట్లకూ ఏవిధంగానూ ప్లే- ఆఫ్ రౌండ్ చేరే అవకాశం లేకుండా పోయింది.

మిగిలిన ఐదుజట్లు ( లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్) మాత్రమే ..ప్లే-ఆఫ్ రౌండ్లోని మిగిలిన రెండుస్థానాల కోసం దింపుడుకల్లం ఆశలతో బరిలో మిగిలాయి.

చివరి ఏడురౌండ్ల మ్యాచ్ ల్లో ఏజట్టు నెగ్గినా పాయింట్ల సంఖ్య 18కు పెంచుకొనే అవకాశం లేనేలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ తిరుగులేని ఆధిక్యంతో లీగ్ టేబుల్ టాపర్ గా ప్లే-ఆఫ్ రౌండ్లో అడుగుపెట్టింది.

ఇక..చెన్నై సూపర్ కింగ్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరటానికి అవకాశాలు 93 శాతం వరకూ ఉన్నాయి. 13 రౌండ్లలో 7 విజయాలతో 15 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో కొనసాగుతోంది.

ముంబైకి 78.1 శాతం అవకాశాలు..

కీలక 13వ రౌండ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పొందినా..ముంబై ఇండియన్స్ కు ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగో బెర్త్ దక్కించుకొనే అవకాశాలు 78.1 శాతం వరకూ ఉన్నాయని గణాంకవేత్తలు చెబుతున్నారు.

లక్నో చేతిలో ఓటమితో ముంబై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 14పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ తో హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్ లో ముంబై భారీఆధిక్యంతో విజయం సాధించడంతో పాటు రన్ రేట్ ను సైతం గణనీయంగా మెరుగు పరచుకోవాల్సి ఉంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో సైతం ముంబై ఓడినా... రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్ల ఫలితాల పైన ఆధారపడక తప్పదు. మిగిలిన జట్ల మ్యాచ్ ల ఫలితాలను బట్టి కూడా ముంబై అవకాశాలు ప్రభావితం కానున్నాయి.

చెన్నైకి సూపర్ చాన్స్...

లీగ్ టేబుల్ లో ప్రస్తుతం 15పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినట్లే. మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న చెన్నై తన చివరి మ్యాచ్‌ను ఢిల్లీతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 17పాయింట్లతో రెండో స్థానంతో తన లీగ్‌ స్టేజ్‌ను ముగించే అవకాశం ఉంది.

ముంబై పై గెలుపుతో లక్నోకి అవకాశం..

ముంబైపై 5 పరుగుల సంచలన విజయం నమోదు చేసిన లక్నో 15పాయింట్లతో మూడో స్థానంలో నిలవడం ద్వారా ముంబైని నాలుగోస్థానానికి నెట్టగలిగింది. లక్నో జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడాల్సి ఉంది.ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మొదటి నాలుగుజట్లలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. అంతేకాకుండా చెన్నై తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీపై ఓడి, లక్నో కోల్‌కతాపై మెరుగైన రన్‌రేట్‌తో గెలుపొందితే టేబుల్‌లో రెండవ స్థానానికి చేరుకునే అవకాశం సైతం లేకపోలేదు.

రాజస్థాన్ రాయల్స్ కు కష్టమే...

మొదటి 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ లీగ్ టేబుల్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది. అయితే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే పంజాబ్‌తో మ్యాచ్‌లో గెలవడంతో పాటు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుజట్లు..తమ ఆఖరి రౌండ్ మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది.

రాయల్ చాలెంజర్స్ కు గెలుపే శరణ్యం..

10 జట్ల లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు 12 రౌండ్లలో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించిన రికార్డు ఉంది. బెంగళూరుజట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే రెండుకు రెండు నెగ్గటం మినహా వేరే దారి లేదు. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడి మరో మ్యాచ్‌లో గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పంజాబ్ కింగ్స్ దీ అదేదారి...

పంజాబ్ కింగ్స్ 12 రౌండ్లలో 12 పాయింట్లతో లీగ్ టేబుల్ 8వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ సైతం మరో రెండురౌండ్ల మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ప్లే-ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే..రెండుకు రెండుమ్యాచ్ లనూ మెరుగైన రన్ రేట్ తో నెగ్గి తీరాల్సి ఉంది.

మొత్తం మీద..లీగ్ దశలోని చివరి 7 మ్యాచ్ ల్లో సంచలనాలు, అనూహ్య ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. గత 15 సీజన్లకు భిన్నంగా ప్రస్తుత 16వ సీజన్ పోటీలు..పట్టుగా, రసపట్టుగా సాగుతూ అభిమానులకు అసలు సిసలు టీ-20 వినోదాన్ని అందిస్తున్నాయి.

First Published:  17 May 2023 11:12 AM GMT
Next Story