Telugu Global
Sports

ఐపీఎల్ లో 'చేజింగ్ కింగ్'ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ దిగ్గజం, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తనకు తానే సాటిగా నిలిచే ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్ లో చేజింగ్ కింగ్ముంబై ఇండియన్స్!
X

ఐపీఎల్ దిగ్గజం, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తనకు తానే సాటిగా నిలిచే ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలో అతిగొప్ప రికార్డులు, లేదా అత్యంత చెత్త రికార్డులు నెలకొల్పడంలో ముంబై ఇండియన్స్ కి ముంబై ఇండియన్స్ మాత్రమే సాటి.

2022 ( ఐపీఎల్ -15 ) సీజన్లో లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయినా...ప్రస్తుత 16వ సీజన్ మొదటి 10 రౌండ్లలో పడుతూ లేస్తూ తన ప్రస్థానం కొనసాగించినా..11వ రౌండ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను 6 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానానికి చేరుకోగలిగింది. 10వ రౌండ్ పోటీలు ముగిసే నాటికి లీగ్ టేబుల్ 8వ స్థానంలో కొనసాగుతూ వచ్చిన ముంబై..ఆ తర్వాత ఒక్క గెలుపుతో ఏకంగా ఐదుస్థానాల మేర ఎగబాక గలిగింది.

చేజింగ్ లో సూపర్ ముంబై...

ప్రస్తుత ఐపీఎల్ 10 జట్ల లీగ్ లో నిలకడలేమికి మరో పేరుగా ముంబై నిలిచింది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్, అత్యంత బలహీనమైన బౌలింగ్ ఎటాక్ తో ముంబై ప్లే-ఆఫ్ రౌండ్ దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోంది.

ఓ వైపు బలహీనమైన బౌలింగ్, మరోవైపు కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు ముంబైని సాదాసీదా జట్టుగా నిలబెట్టాయి. యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయాలతో అందుబాటులో లేకపోడంతో పేస్ బౌలింగ్ విభాగం బలహీన పడిపోయింది. ఇక..కీలక స్పిన్ బౌలింగ్ విభాగంలో

వెటరన్ పియూష్ చావ్లా జట్టు భారాన్ని తన భుజాలపైన వేసుకొని పర్వాలేదని పిస్తున్నాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నా..మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు సూపర్ హిట్టర్లు కామెరూన్ గ్రీన్,

టిమ్ డేవిడ్ తో పాటు మేడిన్ ఇండియా కుర్రబ్యాటర్లు తిలక్ వర్మ, నెహాల్ వడేరా జట్టును ఆదుకొంటూ రావడమే కాదు..కీలక విజయాలు అందిస్తూ వచ్చారు.

200కు పైగా స్కోర్ల చేధనలో టాప్..

ప్రస్తుత సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో ఆడిన 11వ రౌండ్ మ్యాచ్ వరకూ ముంబై జట్టు మూడుసార్లు 200కు పైగా స్కోర్లను విజయవంతంగా చేధించగలిగింది. ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ముంబై 213 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు.

అంతేకాదు..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై అలవోకగా చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 75 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 66 పరుగులతో తమజట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించారు. అంతేకాదు..హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన కీలక 11వ రౌండ్ పోరులో ముంబై 200 పరుగుల విజయలక్ష్యాన్ని..కేవలం 16.3 ఓవర్లలోనే చేరుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.

సూర్యకుమార్ యాదవ్ కేవలం 35 బంతుల్లో 7 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 83 పరుగులు, ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 45 పరుగులు, నెహాల్ వడేరా 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 52 పరుగులు సాధించారు. మరో 21 బంతులు మిగిలి ఉండగానే తమజట్టుకు 6 వికెట్ల విజయం అందించారు.

పంజాబ్,చెన్నైలను మించిన ముంబై..

2014 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, 2018లో పంజాబ్ కింగ్స్ రెండేసి సార్లు 200కు పైగా స్కోర్లను చేధించగలిగాయి. ప్రస్తుత సీజన్లో ముంబై ఇప్పటికే మూడుసార్లు 200కు పైగా స్కోర్లను చేజ్ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

200కు పైగా విజయలక్ష్యాన్ని చేధించే సమయంలో అత్యధికంగా 21 బంతుల తేడాతో నెగ్గిన తొలిజట్టుగా ముంబై మరో రికార్డు నమోదు చేసింది. బెంగళూరుపై మరో 21 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది.

2017లో గుజరాత్ లయన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 15 బంతులు మిగిలి ఉండగానే 208, , 2010 సీజన్లో కోల్ కతా పై పంజాబ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 201పరుగుల లక్ష్యాలను విజయవంతంగా చేధించగలిగాయి.

రోహిత్ శర్మ చెత్త రికార్డు....

టీ-20 ఫార్మాట్లో ఎన్నో సంచలన రికార్డులు నెలకొల్పిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ..అదే స్థాయిలో చెత్తరికార్డులను సైతం మూటగట్టుకొన్నాడు. అత్యధిక డకౌట్లు ( 16 )

సాధించిన తొలి బ్యాటర్ రోహిత్ మాత్రమే. అంతేకాదు. ప్రస్తుత సీజన్లో రోహిత్ ఆడిన గత ఐదు ఇన్నింగ్స్ లో 2, 3, 0, 0, 7 స్కోర్లకే అవుటయ్యాడు. అత్యధిక సింగిల్ డిజిట్ స్కోర్లు సాధించిన ఓపెనర్ గా నిలిచాడు.

36 సంవత్సరాల రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరియర్ లో ముంబైని ఐదుసార్లు చాంపియన్ గా నిలిపిన మొనగాడు. అయితే..ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్ల మ్యాచ్ ల్లో 180కి పైగా పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

మిగిలిన మూడురౌండ్లలో కనీసం రెండు విజయాలు సాధించగలిగితేనే ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

First Published:  10 May 2023 11:21 AM GMT
Next Story