Telugu Global
Sports

ఐపీఎల్ ఫైనల్లో పదోసారి చెన్నై సూపర్ కింగ్స్!

నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పదోసారి ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకొంది.

Chennai Super Kings
X

Chennai Super Kings

నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పదోసారి ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకొంది. తొలి క్వాలిఫైయర్ సమరంలో గుజరాత్ టైటాన్స్ ను 15 పరుగులతో అధిగమించింది.

ఐపీఎల్ -16వ సీజన్ ఫైనల్స్ కు నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్లింది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ను 15 పరుగులతో చిత్తు చేయడం ద్వారా ఐదో టైటిల్ కు గురి పెట్టింది.

దెబ్బకు దెబ్బతీసిన సూపర్ కింగ్స్

గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థిగా ప్రస్తుత క్వాలిపైయర్ సమరానికి ముందు వరకూ ఆడిన మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన చెన్నై ఎట్టకేలకు దెబ్బకు దెబ్బ తీయడం ద్వారా బదులు తీర్చుకోగలిగింది.

స్లో (స్పిన్ )బౌలర్లకు అనువుగా ఉన్న చెపాక్ పిచ్ పైన జరిగిన ఈ కీలక పోరులో ధోనీసేన స్థానబలంతో చెలరేగిపోయింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన

చెన్నై పటిష్టమైన గుజరాత్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేసింది.

రుతురాజ్ గయక్వాడ్ షో

బ్యాటింగ్ కు అంతగా అనువుగాలేని చెపాక్ పిచ్ పైన ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ కీలక ఇన్నింగ్స్ తో తనజట్టుకు చక్కటి స్కోరు అందించాడు. సహఓపెనర్ డేవన్ కాన్వేతో కలసి మొదటి వికెట్ కు కీలక భాగస్వామ్యం సాధించి పెట్టాడు.

రుతురాజ్‌ 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 60 పరుగుల టాప్ స్కోర్ సాధించాడు. మరో ఓపెనర్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) తనవంతుగా రాణించాడు.

ఈ జోడీ మొదటి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కాన్వే అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూపర్ హిట్టర్ శివమ్‌ దూబే ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. మిడిలార్డర్ బ్యాటర్లు అజింక్యా రహానే (17), అంబటి రాయుడు (17), రవీంద్ర జడేజా (22) కీలక పరుగులు సాధించినా..కెప్టెన్ ధోనీ ఒక్కపరుగుకే దొరికిపోయాడు. అయినా..చెన్నై 172 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.

గుజరాత్‌ బౌలర్లలో పేసర్లు మహమ్మద్‌ షమీ, మోహిత్‌ శర్మ చెరో రెండు వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ నూర్ , లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, మీడియం పేసర్ దర్షన్ నల్కండే తలో వికెట్ పడగొట్టారు.

చెన్నై స్పిన్ కి గుజరాత్ ఉక్కిరిబిక్కిరి

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 173 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ 157 పరుగులకే కుప్పకూలింది. లీగ్ దశ చివరి రెండుమ్యాచ్ ల్లో సెంచరీలు బాదిన యువఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (8), సాహా (12), దసున్‌ షనక (17), మిల్లర్‌ (4), విజయ్‌ శంకర్‌ (14), రాహుల్‌ తెవాటియా (3) వెంటవెంటనే అవుట్ కావడం గుజరాత్ ను దెబ్బతీసింది.

లోయర్ ఆర్డల్లో రషీద్‌ ఖాన్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ప్రయోజనం లేకపోయింది,

చెన్నై బౌలర్లలో పేసర్ దీపక్‌ చాహర్‌, జడేజా, తీక్షణ, పతిరణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ రుతురాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఓడినా ..గుజరాత్ కు మరో ఛాన్స్

ఈ మ్యాచ్ లో పరాజయం పొందినా..గుజరాత్ టైటాన్స్ కు ఫైనల్ చేరటానికి క్వాలిఫైయర్ -2 ద్వారా మరో అవకాశం మిగిలే ఉంది. ముంబై-లక్నోజట్ల ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గినజట్టుతో..ఫైనల్లో చోటు కోసం హోంగ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

చేజింగ్ కు దిగిన 18 మ్యాచ్ ల్లో గుజరాత్ టైటాన్స్ కు ఇది నాలుగో ఓటమి కావడం విశేషం. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో నాలుగు పరాజయాలు పొందిన గుజరాత్ ఖాతాలో ఐదో ఓటమి వచ్చి చేరింది.

ఐపీఎల్ గత 16 సీజన్లలో 14సార్లు పోటీకి దిగిన చెన్నై ఫైనల్స్ చేరడం ఇది 10వసారి. చెన్నై తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఫైనల్స్ చేరి ఐదు టైటిల్స్ నెగ్గిన రికార్డు ముంబైకి మాత్రమే ఉంది.

First Published:  24 May 2023 8:20 AM GMT
Next Story