Telugu Global
Sports

'సూర్య సునామీ'లో బెంగళూరు గల్లంతు!

ఐపీఎల్ -16వ సీజన్ లో సూర్య ప్రతాపం తారాస్థాయికి చేరింది. 10 జట్ల లీగ్ టేబుల్ లో ముంబై 8వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది.

సూర్య సునామీలో బెంగళూరు గల్లంతు!
X

'సూర్య సునామీ'లో బెంగళూరు గల్లంతు!

ఐపీఎల్ -16వ సీజన్ లో సూర్య ప్రతాపం తారాస్థాయికి చేరింది. 10 జట్ల లీగ్ టేబుల్ లో ముంబై 8వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరింది.

ఐపీఎల్ -16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ సమరం అంచనాలకు అందనిరీతిలో సాగుతోంది. 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ ముగియటానికి మరో మూడురౌండ్ల మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉండడంతో పోరు పతాకస్థాయికి చేరింది. నాలుగుజట్ల ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు కోసం మొత్తం 10 జట్లూ భీకరంగా తలపడుతున్నాయి.

హోంగ్రౌండ్లో ముంబై టాప్ గేర్....

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ రెండో అంచెపోరులో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పై కీలక విజయంతో ముంబై అనూహ్యంగా పుంజుకొంది.

బెంగళూరు అంచె పోటీలో ముంబైని రాయల్ చాలెంజర్స్ కంగు తినిపిస్తే..ముంబై అంచె పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల విజయంతో బదులు తీర్చుకొంది.

10వ రౌండ్ మ్యాచ్ లు ముగిసే సమయానికి లీగ్ టేబుల్ 8వస్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్ తన 11వ రౌండ్ మ్యాచ్ లో భారీవిజయం సాధించడం ద్వారా..ఏకంగా మూడోస్థానానికి ఎగబాక గలిగింది.

బెంగళూరుకు ముంబై పగ్గాలు...

ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన 11వ రౌండ్ పోరులో మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపమే ప్రదర్శించాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులతో బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. 200 పరుగుల భారీవిజయలక్ష్యం చేధించడంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఈ కీలకపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 199 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థి ఎదుట 200 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

డాషింగ్ ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ- డూప్లెసిస్ లతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరుకు తొలి ఓవ‌ర్లోనే గట్టి దెబ్బ త‌గిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న‌ విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే దొరికిపోయాడు. వన్ డౌన్ అనుజ్ రావ‌త్(6) సైతం సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. దాంతో, 16 ప‌రుగుల‌కే రెండు వికెట్లు నష్టపోయిన బెంగళూరును కెప్టెన్ డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆదుకున్నారు. మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో గట్టిపునాది వేశారు. మ్యాక్స్‌వెల్‌(33 బంతుల్లో 68, 8ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌(41 బంతుల్లో 65, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ శ‌త‌కాలతో చెల‌రేగారు.ఈ జోడీ వెంట వెంటనే అవుట్ కావడంతో బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. మ‌హిపాల్ లోమ్‌రోర్ ఒకే ఒక్క పరుగుకు అవుటయ్యాడు.

డెత్ ఓవర్లలో దినేశ్ కార్తిక్(30), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ కేదార్ జాదవ్(12 నాటౌట్), హ‌స‌రంగ‌(12 నాటౌట్) బ్యాటు ఝళిపించడంతో బెంగళూరు 6 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు సాధించింది.

కీలకపోరులో సూర్య.. ప్రతాపం!

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 200 పరుగులు చేయాల్సిన ముంబైకి..డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. పవర్ ప్లే ఓవర్లలో భారీషాట్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ ఇషాన్ కిషన్ వెంట వెంటనే అవుట్ కావడంతో..అసలు సిసలు పోరాటం ప్రారంభమయ్యింది. ఇషాన్‌కిషన్‌(42) , కెప్టెన్‌ రోహిత్‌శర్మ(7) పరుగుల స్కోర్లు సాధించారు.

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, యువబ్యాటర్ వడేరా నాలుగో వికెట్ కు మెరుపు వేగంతో సెంచరీ భాగస్వామ్యం నమోదు చ్వారా మ్యాచ్ ను వన్ సైడ్ షాగా మార్చారు.

బ్యాటర్ల స్వర్గం, తమ హోంగ్రౌండ్లో సూర్య- నెహాల్ వడేరా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 83, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), నేహాల్‌ వదెరా(52 నాటౌట్‌) అర్ధసెంచరీలతో విజృంభించారు.

చివరకు ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే సాధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో లెగ్ స్పిన్నర్ హసరంగ, విజయ్‌కుమార్‌ విశాక్‌ చెరో 2 వికెట్లు తీశారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబైకి అలవోక విజయం అందించిన సూర్యకుమార్‌ యాదవ్ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు 200 పరుగులకు పైగా లక్ష్యాలను చేధించిన తొలి, ఏకైకజట్టుగా ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ నిలిచింది.ఈరోజు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే పోరులో..ఢిల్లీ క్యాపిటల్స్- చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరు రాత్రి 7-30కి ప్రారంభంకానుంది.

Next Story