Telugu Global
Sports

డిసెంబర్ 23న.. ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్‌లోని 10 జట్లలోని ఆటగాళ్లను మార్చురోవడం, కొత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మినీ వేలంలో అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 23న.. ఐపీఎల్ మినీ వేలం
X

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ మినీ వేలం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లేదా బెంగళూరులో నిర్వహిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ తాజాగా ఈ వేలం కోసం కేరళలని కోచిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

ఐపీఎల్‌లోని 10 జట్లలోని ఆటగాళ్లను మార్చురోవడం, కొత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఇందులో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రతీ ఫ్రాంచైజీకి 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో కచ్చితంగా 10 మందిని వేలం కోసం విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం ప్రతీ ఫ్రాంచైజీకి రూ. 90 కోట్ల విలువైన పర్స్ అందుబాటులో ఉన్నది. గత వేలంలో మిగిలిన డబ్బుతో పాటు.. అదనంగా రూ. 5 కోట్లను అన్ని ఫ్రాంచైజీలు ఉపయోగించుకునే వీలున్నది.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ. 3.45 కోట్ల మిగులు పర్స్ ఉన్నది. మిగిలిన జట్లతో పోలిస్తే ఇదే అత్యధికం. లక్నో జెయింట్ వద్ద అసలు ఒక్క రూపాయి కూడా మిగులు లేదు. అయితే బీసీసీఐ అదనంగా రూ. 5 కోట్లు పెంచడంతో.. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ ఆ మేరకు వినియోగించుకునే వీలున్నది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 2.95 కోట్లు, ఆర్సీబీ వద్ద రూ. 1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 95 లక్షలు, కోల్‌కతా వద్ద రూ. 45 లక్షలు, గుజరాత్ వద్ద రూ. 15 లక్షలు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వద్ద తలా రూ. 10 లక్షల మిగులు పర్స్ ఉన్నది.

ఈ నెల 15 లోపు ప్రతీ ఫ్రాంచైజీ విడుదల చేయబోయే ఆటగాళ్ల వివరాలను ఇవ్వాల్సి ఉన్నది. గత ఏడాది వేలానికి అందుబాటులో లేని బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్ ఈ సారి వేలానికి వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ల కోసం ఫ్రాంచైజీలు కూడా తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉన్నది.



First Published:  9 Nov 2022 2:04 PM GMT
Next Story