Telugu Global
Sports

ఐపీఎల్ -16 లీగ్ లో ఇక అసలు పోరాటం!

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ఆఖరి మూడురౌండ్ల పోరు ఆసక్తికరంగా మారింది.ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగుస్థానాల కోసం మొత్తం 10 జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

ఐపీఎల్ -16 లీగ్ లో ఇక అసలు పోరాటం!
X

ఐపీఎల్ -16 లీగ్ లో ఇక అసలు పోరాటం!

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ఆఖరి మూడురౌండ్ల పోరు ఆసక్తికరంగా మారింది.ప్లే-ఆఫ్ రౌండ్లోని నాలుగుస్థానాల కోసం మొత్తం 10 జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి..

ఐపీఎల్ -16వ సీజన్ 70 మ్యాచ్ ల లీగ్ పోరు క్లైయ్ మాక్స్ దశకు చేరింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని మొదటి 10 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టిక మొదటి ఐదుస్థానాలలో నిలిస్తే..బెంగళూరు రాయల్ చాలెంజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ చివరి ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి.

ఆఖరి మూడురౌండ్లో కీలకం...

మొత్తం 10 జట్ల నుంచి ప్లే- ఆఫ్ రౌండ్ చేరే ఆఖరి నాలుగుజట్లేవో ..చివరి మూడురౌండ్ల ఫలితాలతో తేలిపోనుంది. మొత్తం 10 జట్లకూ ప్రతిమ్యాచ్ చావోబతుకో సమరం కానుంది.

గత సీజన్ విజేత గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకూ జరిగిన 10 రౌండ్ల మ్యాచ్ ల్లో 8 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా నిలిచింది.

మిగిలిన మూడురౌండ్ల పోటీలలో గుజరాత్ టైటాన్స్ ఓడినా..ప్లే ఆఫ్ రౌండ్ చేరాలంటే నెట్ రన్ రేట్ కీలకం కానుంది. అయితే..చివరి మూడురౌండ్లలో ఒక్క విజయం సాధించినా గుజరాత్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోడం ఏమంతకష్టం కాబోదు. 12వ రౌండ్ పోరులో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో గుజరాత్ తలపడనుంది.

ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరువగా చెన్నై..

ఐపీఎల్ లో నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ ఆడిన 12 రౌండ్లలో 7 విజయాలు, వర్షంతో ఓ మ్యాచ్ రద్దు కావడంతో లభించిన మరో పాయింటుతో కలిసి మొత్తం 15 పాయింట్లతో ప్లే- ఆఫ్ రౌండ్ కు గెలుపు దూరంలో నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే రెండో అంచె పోరులో విజయం సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోనుంది.

ముంబైని ఊరిస్తున్న ప్లే-ఆఫ్ బెర్త్...

గత సీజన్లో లీగ్ టేబుల్ అట్టడుగుస్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పవర్ తో ప్రస్తుత సీజన్లో నెట్టుకొస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండుమ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసినా..ఆ తర్వాతి రౌండ్లలో పుంజుకొని ఆడి 11 రౌండ్లలో 7 విజయాలు, 4 పరాజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా మూడోస్థానంలో కొనసాగుతోంది.

10వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి లీగ్ టేబుల్ 8వ స్థానానికి పడిపోయిన ముంబై..11వ రౌండ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేయడం ద్వారా..8వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాక గలిగింది.

చివరి మూడు రౌండ్లలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లతో జరిగే పోరులో రెండుమ్యాచ్ లు నెగ్గినా ముంబై ప్లే-ఆఫ్ రౌండ్ చేరడం ఏమాత్రం కష్టంకాబోదు.

తన విజయాల అడ్డా ,హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగానే చివరి మూడురౌండ్లలో రెండురౌండ్లు ఆడనుండడం ముంబైకి కలసి వచ్చే అంశంగా ఉంది.

చివరి మూడురౌండ్లలోనూ విజేతగా నిలిస్తే లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచే అవకాశం సైతం ముంబైకి ఉంది.

నెట్ రన్ రేట్ తో 4వ స్థానంలో లక్నో...

కెఎల్ రాహుల్ స్థానంలోని లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్థానం ప్రస్తుత సీజన్లో పడుతూ లేస్తూ సాగుతోంది. గాయంతో కెప్టెన్ రాహుల్ తప్పుకోడంతో ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా నాయకత్వంలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. ప్రస్తుత ఐపీఎల్ లో అత్యధిక టీమ్ స్కోరు సాధించిన జట్టుగా లక్నో ప్లస్ 0.294 నెట్ రన్ రేట్ తో లీగ్ టేబుల్ నాలుగో స్థానంలో నిలిచింది. 11 రౌండ్లలో 11 పాయింట్లు మాత్రమే సాధించిన లక్నో చివరి మూడురౌండ్లలోనూ నెగ్గితేనే ప్లే- ఆఫ్ రౌండ్ చేరుకొనే అవకాశం ఉంది.

గత రెండుమ్యాచ్ ల్లోనూ వరుస పరాజయాలు చవిచూసిన లక్నో ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగి తీరాలి.

అయోమయంలో రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ మొదటి ఐదురౌండ్లలో అత్యధిక విజయాలు నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్..ఆ తర్వాత వరుస పరాజయాలతో పడిపోతూ వచ్చింది.

11 రౌండ్లలో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లు మాత్రమే సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే చివరి మూడురౌండ్ల మ్యాచ్ ల్లోనూ ఆరునూరైనా నెగ్గితీరక తప్పదు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే 12వ రౌండ్ పోరు రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.

నెట్ రన్ రేట్ లో కోల్ కతా డౌన్...

రెండుసార్లు విన్నర్ కోల్ కతా నైట్ రైడర్స్ పరిస్థితి ఓ గెలుపు, రెండు పరాజయాలు అన్నట్లుగా సాగుతోంది. మొదటి 11 రౌండ్లలో 10 పాయింట్లతో లీగ్ టేబుల్ 6వ స్థానంలో నిలిచిన కోల్ కతా ..ప్లే ఆఫ్ రౌండ్ చేరాలంటే ..చివరి మూడు రౌండ్లలోనూ నెగ్గి తీరాల్సి ఉంది. ఇప్పటికే నెట్ రన్ రేట్ లో బాగా వెనుకబడిన కోల్ కతా..రానున్న మ్యాచ్ ల్లో ఒక్క ఓటమి పొందినా..ప్లే-ఆఫ్ రేస్ నుంచి వైదొలగక తప్పదు. 12వ రౌండ్ మ్యాచ్ లో పవర్ ఫుల్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కోల్ కతాకు అసలుసిసలు పరీక్ష ఎదురుకానుంది.

గెలిస్తేనే బెంగళూరు నిలిచేది...

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అసలు తక్కువ, హడావిడి ఎక్కువ అన్నట్లుగా మారింది. డూప్లెసిస్, విరాట్ కొహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, హేజిల్ వుడ్, మహ్మద్ సిరాజ్, వనిందు హసరంగ లాంటి ప్రపంచ మేటి టీ-20 స్టార్లున్నా...కీలక మ్యాచ్ ల్లో తడబడుతూ వస్తోంది. మొదటి 11 మ్యాచ్ ల్లో 10 పాయింట్లు మాత్రమే సాధించిన బెంగళూరు..ప్లే- ఆఫ్ రౌండ్ చేరాలంటే మిగిలిన మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ నెగ్గితీరక తప్పదు. ఒక్కమ్యాచ్ లో ఓడినా..ప్లే -ఆఫ్ రౌండ్ నుంచి నిష్క్ర్రమించక తప్పదు.తన చివరి మూడు రౌండ్ల మ్యాచ్ లోనూ ప్రత్యర్థి గ్రౌండ్లలో ఆడనుండడం బెంగళూరుకు ప్రతికూలంగా మారింది.

చివరి మూడు నెగ్గితేనే పంజాబ్ కు చాన్స్...

శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు లీగ్ రెండదశ పోటీలలో దారి తప్పింది. 11 రౌండ్లలో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో కొట్టిమిట్టాడుతోంది. -0.441 నెట్ రన్ రేట్ సైతం పంజాబ్ కు ప్రతిబంధకంగా ఉంది. చివరి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో నెగ్గితేనే..పంజాబ్ ప్లే-ఆఫ్ బెర్త్ ఆశలు సజీవంగా ఉంటాయి.

సన్ రైజర్స్ ఆశలు సజీవం..

మిగిలిన జట్లతో పోల్చిచూస్తే..హైదరాబాద్ సన్ రైజర్స్ లీగ్ దశలో చివరి నాలుగురౌండ్ల మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్లలో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆఖరి నుంచి రెండోస్థానంలో కొనసాగుతోంది. మిగిలిన నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గితే మొత్తం 16 పాయింట్లతో ప్లే- ఆఫ్ రౌండ్ చేరే అవకాశం హైదరాబాద్ కు ఉంది. అయితే..అదేమంత తేలికగా కనిపించడం లేదు.

ఆటలో అరటిపండులా ఢిల్లీ క్యాపిటల్స్...

గత సీజన్ వరకూ అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..కెప్టెన్ రిషభ్ పంత్ అందుబాటులో లేకపోడంతో తీవ్రంగా బలహీన పడింది. దీనికితోడు పృథ్వీ షా లాంటి కీలక ఆటగాళ్ల వైఫల్యం కూడా ఢిల్లీ అవకాశాలను బాగా దెబ్బతీసింది.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్లలో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో కొనసాగుతోంది. చివరి మూడు రౌండ్లలో ఢిల్లీ వరుస విజయాలు సాధించినా..ప్లే-ఆఫ్ రౌండ్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.

ప్రస్తుత సీజన్ లీగ్ లో ఆటలో అరటిపండులా మిగిలిన జట్టు ఏదైనా ఉంటే..అది కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే.

లీగ్ చివరి దశ పోటీల ఫలితాలు ఏ జట్లను ముంచుతాయో..ఏ ఏ జట్లను తేల్చుతాయో వేచిచూడాల్సిందే.




First Published:  11 May 2023 12:20 PM GMT
Next Story