Telugu Global
Sports

క్రికెట్ ప్రపంచకప్ కు విలక్షణ మాస్కాట్లు!

భారత్ వేదికగా నాలుగోసారి జరుగనున్న 2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ మాస్కాట్లను నిర్వాహక సంఘం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా ఈ శుభసూచికలను ఎంపిక చేశారు.

క్రికెట్ ప్రపంచకప్ కు విలక్షణ మాస్కాట్లు!
X

భారత్ వేదికగా నాలుగోసారి జరుగనున్న 2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ మాస్కాట్లను నిర్వాహక సంఘం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా ఈ శుభసూచికలను ఎంపిక చేశారు.

ఐసీసీ నాలుగు సంవత్సరాలకు ఓసారి నిర్వహించే 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్ లో గత ఐదు దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి స్వస్తి పలికి..కాలానుగుణంగా మార్పులతో సరికొత్త సాంప్రదాయానికి నిర్వాహక సంఘం తెరతీసింది.

1970 దశాబ్దంలో ప్రారంభమైన 60 ఓవర్ల వన్డే ప్రపంచకప్ కాస్త 1980 దశకం నాటికి 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్ గా పరిణామం చెందింది. 1983 ప్రుడెన్షియల్ ప్రపంచకప్ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీతో నిర్వహిస్తూ వస్తున్న టోర్నీలకు ప్రకటించే శుభసూచికలను..ఆతిథ్యమిస్తున్న దేశాలలోని వన్యప్రాణుల కు ప్రతీకగా నిర్వాహక సంఘాలు ఎంపిక చేస్తూ రావటం ఆనవాయితీగా వస్తోంది.

2023 ప్రపంచకప్ నుంచి వినూత్న మార్పులు...

వన్డే ప్రపంచకప్ కు భారత్ గతంలో 1987 నుంచి 2011 వరకూ మూడుసార్లు ఆతిథ్యమిచ్చిన సమయంలో భారత్ లోని ప్రముఖ వన్యప్రాణులతో కూడిన మాస్కాట్లను ఎంపిక చేశారు.

అయితే..అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు మాత్రం..మాస్కాట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంపిక చేశారు. ఆన్ లైన్ ఓటింగ్ లో అత్యధికమంది అభిమానులు ఇష్టపడిన ' బ్లేజ్', ' టోంక్ ' లను శుభసూచికలుగా ఖరారు చేశారు.

ఆగస్టు నెలలో తుదిరూపం ఇచ్చిన ఈ రెండు మాస్కాట్ల కు బ్లేజ్, టోంక్ పేర్లను ఖాయం చేశారు.

ఏ మాత్రం ఒత్తిడి లేకుండా కూల్ కూల్ గా బ్యాటింగ్ చేస్తూ కనిపించే పురుష రూపమున్న మాస్క్టాట్ కు టోంక్ అన్నపేరును నిర్ణయించారు. క్రికెట్ పుస్తకంలోని షాట్లన్నీ టోంక్ అలవోకగా ఆడగలుగుతుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ బ్యాట్ ధరించిన టోంక్ అభిమానుల్లో సరికొత్త హుషారును పుట్టించగలదని నిర్వాహక సంఘం భావిస్తోంది.

2011 వన్డే ప్రపంచకప్ నిర్వహించిన సమయంలో ఏనుగును, 1996 ప్రపంచకప్ కు క్రికెట్ పరికరాలు, హెల్మెంట్ ధరించిన గూగ్లీ క్రికెట్ బంతిని మాస్కాట్లుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ...

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీస్టేడియం వేదికగా అక్టోబర్ 5న ప్రారంభమై 46 రోజులపాటు 48 మ్యాచ్ లుగా సాగే ఈ ప్రపంచకప్ టోర్నీ నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంతో ముగియనుంది. ప్రారంభమ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.

రెండుసార్లు విన్నర్ భారత్, ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియాలతో సహా మొత్తం 10 జట్లు..దేశంలోని పదినగరాలు వేదికలుగా జరిగే రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ రౌండ్ పోటీలలో తలపడనున్నాయి.

మాజీ చాంపియన్ వెస్టిండీస్ లేకుండా జరుగనున్న తొలి వన్డే ప్రపంచకప్ ఇదే కావడం మరో విశేషం. గతంలో ఎన్నడూలేని విధంగా 83 కోట్ల రూపాయల భారీప్రైజ్ మనీతో ఐసీసీ ఈ టోర్నీని నిర్వహించడానికి విస్త్ర్రుత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఆతిథ్య భారతజట్టు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా తన ప్రారంభమ్యాచ్ లో అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్ర్రేలియాతో తలపడనుంది.

First Published:  1 Oct 2023 11:05 AM GMT
Next Story