Telugu Global
Sports

బిగ్‌స్క్రీన్‌పై క్రికెట్ మ్యాచ్‌లు.. ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం

ఆస్ట్రేలియాలో జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న తమ మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఐనాక్స్ లీజర్స్ లిమిటెడ్ ప్రకటించింది.

బిగ్‌స్క్రీన్‌పై క్రికెట్ మ్యాచ్‌లు.. ఐసీసీతో ఐనాక్స్ ఒప్పందం
X

ఇండియాలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కొని పోతారు. ఇక సొంత ఊరిలో మ్యాచ్ జరిగితే టికెట్ల కోసం ఎలా ఎగబడతారో ఇటీవలే మనం చూశాం. గతంలో అంటే అడపాదడపా మ్యాచ్‌లు జరిగేవి. ఇప్పుడు మాత్రం టీమ్ ఇండియా ఫుల్ బిజీగా పర్యటనలు చేస్తోంది. దానికి తోడు ఐపీఎల్ కూడా ఉండటంతో ఏడాదంతా క్రికెట్ మ్యాచ్‌ల హడావిడి ఉంటోంది. అయితే ఎన్ని మ్యాచ్‌లు, సిరీస్‌లు జరిగినా వరల్డ్ కప్‌కు ఉండే క్రేజే వేరు. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. స్టార్ టీవీ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. అందరూ ఆస్ట్రేలియా వెళ్లలేరు. అక్కడి స్టేడియంలో కూర్చొని చూడలేరు. కానీ, అలాంటి అనుభవం కావాలని అనుకునే వారికి ఐనాక్స్ శుభవార్త చెప్పింది.

ఆస్ట్రేలియాలో జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న తమ మల్టీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఐనాక్స్ లీజర్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో ఉన్న తమ ఐనాక్స్ స్క్రీన్లలో ఇండియా ఆడే గ్రూప్ మ్యాచ్‌లతో పాటు, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వివరించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐనాక్స్ వెల్లడించింది.

ఐనాక్స్‌కు 74 నగరాల్లోని 165 మల్టీప్లెక్స్‌‌లలో 705 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో 1.57 లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయి. కాగా, క్రికెట్ మ్యాచ్‌లకు ఆదరణ ఉండే కేవలం 25 నగరాల్లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పింది. దీనికి ప్రత్యేకమైన ధర ఉంటుందని, ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపింది. డాల్బీ సౌండ్ సిస్టమ్ సహాయంతో పూర్తిగా స్టేడియం ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇంగ్లీష్ కామెంట్రీతో మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చని ఐనాక్స్ లీజర్ వెల్లడించింది.

ఈ నెల 23న ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌తో ఈ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కానున్నట్లు ఐనాక్స్ తెలిపింది. వెంటనే తమ టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని క్రికెట్ అభిమానులను కోరింది.

First Published:  13 Oct 2022 4:47 AM GMT
Next Story