Telugu Global
Sports

18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఫైనల్లో భారత యువగ్రాండ్ మాస్టర్!

భారత కుర్రగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ 18 ఏళ్లకే ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ టోర్నీ ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించాడు.

18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఫైనల్లో భారత యువగ్రాండ్ మాస్టర్!
X

భారత కుర్రగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ 18 ఏళ్లకే ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ టోర్నీ ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నుస్ కార్ల్ సన్ తో తలపడనున్నాడు...

ప్రపంచ చదరంగంలో భారత కుర్రాడు, తమిళనాడు యువగ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. కేవలం 18 సంవత్సరాల చిరుప్రాయానికే ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ ఫైనల్స్ చేరడం ద్వారా సంచలనం సృష్టించాడు.

2024 ప్రపంచ పురుషుల చెస్ టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్, చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లీ రెన్ తో తలపడటానికి అర్హత కోసం క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహిస్తున్నారు.

అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విశ్వవిఖ్యాత గ్రాండ్ మాస్టర్లంతా తలపడితే..ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్, ప్రపంచ మాజీ చాంపియన్ మాగ్నుస్ కార్ల్ సన్, భారత నవయువ సంచలనం ప్రజ్జ్ఞానంద్ ఫైనల్స్ కు చేరుకోగలిగారు.

అమెరికా గ్రాండ్ మాస్టర్ కు ప్రఙ్జ్ఞానంద్ చెక్....

ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీస్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్, అమెరికన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కురునాపై ప్రజ్జ్ఞానంద్ సంచలన విజయం సాధించాడు.

లక్షల డాలర్ల ప్రైజ్ మనీతో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య గత రెండువారాలుగా నిర్వహిస్తున్న ఈటోర్నీలో తొలిసారిగా భారత్ కు చెందిన నలుగురు గ్రాండ్ మాస్టర్లు ( గుకేశ్, విధిత్ గుజరాతీ, ప్రఙ్జ్ఞానంద్, అర్జున్ ఇరగేసీ చేరుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు.

క్వార్టర్ ఫైనల్లో తనదేశానికే చెందిన అర్జున్ ఇరగేసీని టైబ్రేక్ లో ఓడించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించిన ప్రఙ్జ్ఞానంద్ సెమీస్ లోనూ అదేజోరు కొనసాగించాడు.

రెండు రౌండ్ల క్లాసికల్ గేమ్స్ నుంచి టైబ్ర్రేక్ రౌండ్ వరకూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌ పోరులో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కురునాపై అనూహ్యవిజయం సాధించగలిగాడు.

రెండు క్లాసిక్‌ గేముల్లో చెరోటి నెగ్గడంతో స్కోరు 1-1తో సమమయ్యింది. దీంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ అనివార్యమైంది. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఫాబియానోను కట్టడి చేయడంలో ప్రఙ్జ్ఞానంద్ తన ప్రఙ్జ్ఞనంతా ఉపయోగించడం ద్వారా సఫలమయ్యాడు. ప్రత్యర్థికి ఏ దశలోనూ పుంజుకునేందుకు అవకాశమివ్వకుండా ఎత్తుకు పైఎత్తు వేస్తూ అమెరికా జీఎం ఆట కట్టించాడు.

అప్పుడు ఆనంద్...ఇప్పుడు ప్రజ్జ్ఞానంద్..

ప్రపంచ చెస్ క్యాండిడే్ట్స్ టోర్నీ ఫైనల్స్ చేరిన రెండో భారత గ్రాండ్ మాస్టర్ గా ప్రఙ్జ్ఞానంద్ నిలిచాడు. గతంలో తమిళనాడుకే చెందిన సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అదే ఘనతను దక్కించుకోగా..ఆ తర్వాత ప్రఙ్జ్ఞానంద్ అదే గౌరవం దక్కించుకోగలిగాడు.

అంతేకాదు.. క్యాండిడేట్‌ టోర్నీ ఫైనల్స్ కి అర్హత సాధించిన మూడో అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ గా ప్రజ్ఞానంద (18 ఏండ్లు) నిలిచాడు. గతంలో అమెరికన్ గ్రాండ్ మాస్టర్ బాబీ ఫిషర్‌, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్‌సన్ మాత్రమే అత్యంత పిన్నవయసులో క్యాండిడేట్స్ చెస్ ఫైనల్స్ చేరిన ఆటగాళ్లుగా ఉన్నారు‌.

ప్రజ్జ్ఞానంద్ కు విశ్వనాథన్ ఆనంద్ హ్యాట్సాఫ్...

ప్రస్తుత ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ టోర్నీలో నలుగురు భారత గ్రాండ్ మాస్టర్లు క్వార్టర్ ఫైనల్స్ చేరడం..అందులో ప్రజ్జ్ఞానంద్ ఫైనల్స్ చేరడం పట్ల చెస్ దిగ్గజం, ఐదుసార్లు విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ సంతోషం వ్యక్తం చేశాడు.

సెమీఫైనల్లో ప్రజ్జ్ఞానంద్ వయసుకు మించిన ప్రతిభ కనబరచి తనకంటే బలమైన ప్రత్యర్థిని అధిగమించినతీరుకు హ్యాట్సాఫ్ చెప్పాడు. ప్రపంచ టాప్ ర్యాంకర్ కార్ల్ సన్ కు ఫైనల్లో ప్రజ్జ్ఞానంద్ గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని ఆనంద్ చెప్పాడు.

మరో సెమీఫైనల్లో అజర్ బైజాన్ గ్రాండ్ మాస్టర్ నిజత్ అబసోవ్ ను ప్రపంచ నంబర్ వన్ మాగ్నుస్ కార్ల్ సన్ 1.5-0.5తో చిత్తు చేశాడు. రెండుగేమ్ ల క్లాసికల్ రౌండ్లోనే పోరును కార్ల్ సన్ ముగించడం ద్వారా ఫైనల్స్ చేరుకోగలిగాడు.

కార్ల్ సన్ పై ప్రజ్జ్ఞానంద్ కు 3-0 రికార్డు..

ప్రపంచ మాజీ చాంపియన్, టాప్ ర్యాంకర్ మాగ్నుస్ కార్ల్ సన్ ప్రత్యర్థిగా గతంలో తలపడిన మూడుసార్లు ప్రజ్జ్ఞానందే విజేతగా నిలిచాడు. అదే ఆత్మవిశ్వాసంతో ప్రస్తుత టోర్నీ ఫైనల్లో సైతం కార్ల్ సన్ ఆటకట్టించాలన్న పట్టుదలతో ప్రజ్జ్ఞానంద్ సమాయత్తమయ్యాడు.

ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా లక్ష డాలర్ల ప్రైజ్ మనీ ఖాయం చేసుకొన్న ప్రజ్జ్ఞానంద్ విజేతగా నిలిస్తే ఏకంగా ప్రపంచ చెస్ టైటిల్ రౌండ్లో నిలువగలుగుతాడు.

First Published:  22 Aug 2023 5:30 AM GMT
Next Story