Telugu Global
Sports

ప్రపంచకప్ సెమీస్ లోనే చెదిరిన భారత్ ప్రపంచకప్ కల!

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ గెలుచుకోవాలన్న భారత్ కల సెమీస్ లోనే చెదిరిపోయింది. ఫైనల్లో చోటు కోసం ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన తొలిసెమీస్ పోరులో భారత్ తుదివరకూ పోరాడి 5 పరుగుల ఓటమితో నిష్క్ర్రమించింది.

ప్రపంచకప్ సెమీస్ లోనే చెదిరిన భారత్ ప్రపంచకప్ కల!
X

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ గెలుచుకోవాలన్న భారత్ కల సెమీస్ లోనే చెదిరిపోయింది. ఫైనల్లో చోటు కోసం ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన తొలిసెమీస్ పోరులో భారత్ తుదివరకూ పోరాడి 5 పరుగుల ఓటమితో నిష్క్ర్రమించింది...

ప్రపంచ క్రికెట్ ఖజానా భారత్ కు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలు ఏమాత్రం కలసిరావడం లేదు. పురుషుల విభాగంలో మాత్రమే కాదు..మహిళలను సైతం దురదృష్టం వెంటాడుతూనే ఉంది.

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గితీరాలన్న హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ ఆశలు సెమీస్ ఫైనల్ దశలోనే అడియాసలుగా మారిపోయాయి.

కేప్ టౌన్ న్యూలాండ్ స్టేడియం వేదికగా నువ్వానేనా అన్నట్లుగా సాగిన తొలిసెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా కు భారత్ ముచ్చెమటలు పట్టించింది. అయితే అలవోకగా నెగ్గితీరాల్సిన పోరులో భారత్ అనవసరపు తప్పిదాలతో చేజేతులా ఓటమి కొని తెచ్చుకొంది.

పసలేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్....

మహిళాప్రపంచకప్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ నెగ్గటమే కాదు..వరుసగా ఏడుసార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టుగా పేరుపొందిన ఆస్ట్ర్రేలియా కేవలం అదృష్టం కలసిరావటం, భారత బౌలర్ల పసలేని బౌలింగ్, చెత్త ఫీల్డింగ్, కీలకసమయాలలో అనవసర తప్పిదాల కారణంగానే 172 పరుగుల స్కోరు సాధించడం తోపాటు..5 పరుగుల విజయంతో టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగింది.

ఈ కీలక సమరంలో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియా 172 పరుగుల స్కోరు సాధించడానికి ఫీల్డ్ లో భారత్ చేసిన పొరపాట్లే కారణం. చురుకుదనం లేని ఫీల్డింగ్, పేలవమైన వికెట్ కీపింగ్, గమ్యం లేని బౌలింగ్ ప్రత్యర్థికి భారీస్కోరు చేసే అవకాశం కల్పించింది.

డెత్ ఓవర్లలో రేణుక విఫలం..

ఆస్ట్ర్రేలియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారత పేసర్ రేణుక ఠాకూర్ గతిలేని బౌలింగ్ తో రెండు సిక్సర్లు సమర్పించుకొంది. తన కోటా 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యింది.

కంగారూ ఓపెనర్ బెత్ మూనీ స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించగా కెప్టెన్ లానింగ్ 34 బాల్స్ లో 49 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆల్ రౌండర్ గార్డ్నర్ 18 బంతుల్లో 31 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల స్కోరు సాధించగలిగింది.

భారత బౌలర్లలో స్పిన్నర్ దీప్తి శర్మ 2 వికెట్లు, రేణుక, స్నేహ రాణా చెరో వికెట్ పడగొట్టారు.

జెమీమా- హర్మన్ రివర్స్ ఎటాక్...

172 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు షెఫాలీవర్మ, స్మృతి మందన, యాష్టికా భాటియా వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలుపెట్టింది. 28 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. అయితే..నాలుగో వికెట్ కు జెమీమా- హర్మన్ జోడీ ఎదురుదాడితో పరుగుల మోత మోగించారు. కీలక భాగస్వామ్యంతో ఆస్ట్ర్రేలియాను కంగారెత్తించారు.

జెమీమా బౌండ్రీ వెంట బౌండ్రీ బాదుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించింది. మరోవైపు..మంటల జ్వరంతోనే క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సైతం చెలరేగిపోయింది.

జెమీమా 24 బాల్స్ లో 43 పరుగులు, హర్మన్ ప్రీత్ 34 బాల్స్ లో 52 పరుగులతో నాలుగో వికెట్ కు 69 పరుగుల మెరుపు భాగస్వామ్యంతో ఆశలు చిగురింప చేశారు.

తన టీ-20 కెరియర్ లో పదో హాఫ్ సెంచరీ సాధించిన హర్మన్ ప్రీత్ దారుణంగా రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రెండో పరుగు కోసం వెళ్లిన హర్మన్..క్రీజులో బ్యాట్ పెట్టడంలో సెకనపాటు విఫలమై వికెట్ నష్టపోవడమే కాదు..తనజట్టు ఓటమికీ కారణంగా నిలిచింది.

ఆఖరి 30 బాల్స్ లో 39 పరుగులు చేయాల్సిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి..5 పరుగుల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కంగారూ ఆల్ రౌండర్ గార్డ్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆస్ట్ర్రేలియా ప్రపంచ రికార్డు ఫైనల్..

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో వరుగా ఏడుసార్లు ఫైనల్స్ చేరిన తొలి, ఏకైకజట్టుగా ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా తన ప్రపంచ రికార్డును తానే తిరగరాసింది.

ఇంగ్లండ్- దక్షిణాఫ్రికాజట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గినజట్టుతో ఆదివారం జరిగే టైటిల్ సమరంలో ఆస్ట్రేలియా పోటీపడనుంది.

గత ప్రపంచకప్ ఫైనల్లో, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలోనే పరాజయాలు పొందిన భారతజట్టు ఆఖరి మెట్టుపై జారిపడటం ఓ అలవాటుగా మారింది.

మహిళా క్రికెట్ బాగుకోసం బీసీసీఐ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా..ప్రమాణాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నాయి.

క్రికెట్ ప్రాథమిక అంశాలను వంటపట్టించుకోని భారత మహిళాజట్టు ప్రపంచకప్ నెగ్గాలని కోరుకోవటం అత్యాశకాక మరొకటి కాదు.

First Published:  24 Feb 2023 5:11 AM GMT
Next Story