Telugu Global
Sports

తుపాను వీడి స్వదేశానికి బయలుదేరిన క్రికెట్ హీరోలు!

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపాను చెర వీడి స్వదేశానికి బయలు దేరారు.

తుపాను వీడి స్వదేశానికి బయలుదేరిన క్రికెట్ హీరోలు!
X

టీ-20 ప్రపంచకప్ విజేత భారతజట్టు సభ్యులు కరీబియన్ తుపాను చెర వీడి స్వదేశానికి బయలు దేరారు.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ముగిసిన రోజు నుంచి కరీబియన్ తుపాను దెబ్బతో గత మూడురోజులుగా బార్బడోస్ రాజధాని బ్రిడ్జిటౌన్ లోనే చిక్కుకుపోయిన భారత క్రికెట్ బృందం అమెరికాలోని ఫ్లారిడా మీదుగా స్వదేశానికి తిరుగు పయనమయ్యింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు.

బీసీసీఐ కార్యదర్శితో సహా........

తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ 7 పరుగులతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. అయితే..ప్రపంచకప్ తో స్వదేశానికి అదేరోజున తిరిగిరావాలని భావించిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతబృందం ఆశలపై భీకర బెరీల్ తుపాను నీళ్ళు చల్లింది.

నాలుగోశ్రేణి తుపాను హెచ్చరికలతో బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ ( గ్రాంట్లే ఆడమ్స్) విమానాశ్రయాన్ని ముందు జాగ్రత్త చర్యగా మూసివేయడంతో విదేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జే షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్, వివిధ క్రికెటర్ల కుటుంబసభ్యులు మొత్తం 70 మంది బృందం హోటెల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. స్వదేశానికి ఎప్పుడు ఎప్పుడు వచ్చి వాలిపోదామా అన్న భారతజట్టు సభ్యుల సహనానికి కరీబియన్ తుపాను పరీక్ష పెట్టింది.

భారత బృందం కోసం ప్రత్యేక విమానం...

వాస్తవానికి..ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారతజట్టు సభ్యులు బార్బడోస్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ మీదుగా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే..అంతర్జాతీయ విమాన సర్వీసులు తుపాను దెబ్బతో రద్దు కావడంతో..70 మంది సభ్యుల భారత బృందం కోసం అక్కడే ఉన్న బీసీసీఐ కార్యదర్శి జే షా చొరవ తీసుకొని ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.

భారత క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు, జట్టు సహాయక సిబ్బంది, బీసీసీఐ కార్యవర్గ సభ్యులతో పాటు..భారత క్రీడాపాత్రికేయుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచారు. ఈ విమాన సర్వీసుకు ఎయిర్ ఇండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్ అన్న నామకరణం చేశారు.

అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం బ్రిడ్జ్ టౌన్ విమానాశ్రయాన్ని తిరిగి తెరవడంతో గత మూడురోజులుగా చిక్కుకుపోయిన భారత బృందం ఊపిరితీసుకోగలిగింది.

బ్రిడ్జ్ టౌన్ నుంచి అమెరికాలోని న్యూ జెర్సీ మీదుగా భారత ప్రత్యేక విమానం న్యూఢిల్లీకి తిరిగి రానుంది.

మొత్తం 16 గంటల ప్రయాణం తరువాత..భారత కాలమానం ప్రకారం ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులు గురువారం ఉదయం 6 గంటలకు న్యూఢిల్లీ చేరుకోవాల్సి ఉంది.

న్యూఢిల్లీలో క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందన..

బార్బడోస్ నుంచి న్యూఢిల్లీ చేరిన ప్రపంచకప్ చాంపియన్ భారతజట్టు సభ్యులను గురువారం జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించనున్నారు.

ఆ తరువాత భారతజట్టు సభ్యులు, సహాయక బృందం న్యూఢిల్లీ నుంచి తమతమ స్వస్థలాలకు చేరుకోనున్నారు.

ప్రపంచకప్ సాధించిన భారతజట్టుకు 125 కోట్ల రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతిగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులోని మొత్తం 15 మంది సభ్యులకు తలో 5 కోట్ల రూపాయలు, రిజర్వ్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ , సహాయక బృంద సభ్యులకు తలో కోటి రూపాయలు నజరానాగా ఇవ్వనున్నారు.

First Published:  3 July 2024 10:20 AM GMT
Next Story