Telugu Global
Sports

ఆఖరి టీ-20లో భారత్ స్పిన్ మ్యాజిక్.. 4-1తో సిరీస్ విజయం

భారత స్పిన్ త్రయం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్ ల స్పిన్ మాయలో కరీబియన్ జట్టు గల్లంతయ్యింది. అంతగా ప్రాధాన్యం లేని ఈ ఆఖరాటలో భారత కెప్టెన్ గా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వ్యవహరించాడు.

ఆఖరి టీ-20లో భారత్ స్పిన్ మ్యాజిక్.. 4-1తో సిరీస్ విజయం
X

టీ-20 ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో ముగిసిన పాంచ్ పటాకా సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. కరీబియన్ గడ్డపై మూడు, అమెరికాలోని ఫ్లారిడా వేదికగా రెండు మ్యాచ్ లుగా నిర్వహించిన ఈ సిరీస్‌లో భారత్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. ఫ్లారిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరి మ్యాచ్ లో సైతం భారత్ జోరే కొనసాగింది. భారత స్పిన్ త్రయం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్ ల స్పిన్ మాయలో కరీబియన్ జట్టు గల్లంతయ్యింది. అంతగా ప్రాధాన్యం లేని ఈ ఆఖరాటలో భారత కెప్టెన్ గా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వ్యవహరించాడు. దీనికి తోడు రెండు జట్లూ పలు మార్పులతో బరిలోకి దిగాయి.

శ్రేయస్ అయ్యర్ ధూమ్ ధామ్...

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగుల స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ 40 బంతుల్లో 8 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీపక్ హుడా 38, కెప్టెన్ పాండ్యా 28 పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు పడగగొట్టాడు.

కుల్దీప్, బిష్నోయ్ దూకుడు...

189 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కరీబియన్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. మిడిలార్డర్ ఆటగాడు హెట్ మేయర్ ఒంటరి పోరాటం చేసి 36 బాల్స్ లో 5 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్ 16 పరుగులిచ్చి 4 వికెట్లు, లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 12 పరుగులిచ్చి 3 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టారు. దీంతో 88 పరుగుల భారీ విజయంతో భారత్ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువపేసర్ అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

రోహిత్ రికార్డుల మోత...

సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ ల్లో భారత్ కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ సారథిగా పలు అరుదైన రికార్డులు సాధించాడు. గత ఏడాది టీ -20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశీ సిరీస్ ద్వారా భారత కెప్టెన్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన రోహిత్ ప్రస్తుత కరీబియన్ సిరీస్ విజయంతో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరల్డ్‌కప్‌ రన్నరప్‌ కివీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్‌ విజయం తో బోణీ కొట్టాడు. ఆ తర్వాత నుంచి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విజయ పరంపర కొనసాగింది. న్యూజిలాండ్‌ సిరీస్ తర్వాత స్వదేశంలో రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను వన్డే, టీ-20 సిరీస్‌లలో 3-0తో చిత్తు చేసింది. అదే జోష్‌లో సొంతగడ్డపై.. శ్రీలంకను సైతం అలవోకగా ఓడించడం ద్వారా టీ20 సిరీస్‌ను 3-0తో, వన్డే సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

విదేశీ గడ్డ పైనా అదే జోరు...

విదేశీ సిరీస్ ల్లో సైతం కెప్టెన్ గా రోహిత్ కు ఎదురేలేకపోయింది. ఇంగ్లండ్‌ పర్యటనలో రోహిత్‌ సేన.. బట్లర్ టీమ్‌కు చుక్కలు చూపింది. టీ- 20 సిరీస్‌, వన్డే సిరీస్‌లను 2-1తో గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుత వెస్టిండీస్‌ సిరీస్ ను సైతం 4-1 తో కైవసం చేసుకొంది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ కు ఇది వరుసగా ఐదో సిరీస్ విజయం కావడం మరో రికార్డు.

First Published:  8 Aug 2022 6:56 AM GMT
Next Story