Telugu Global
Sports

మహిళా టెస్టు క్రికెట్లో భారత్ అరుదైన విజయం!

మహిళా టెస్టు క్రికెట్లో భారత్ ఓ అరుదైన ఘనత సాధించింది. గత 10రోజుల్లో రెండో విజయంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

మహిళా టెస్టు క్రికెట్లో భారత్ అరుదైన విజయం!
X

మహిళా టెస్టు క్రికెట్లో భారత్ ఓ అరుదైన ఘనత సాధించింది. గత 10రోజుల్లో రెండో విజయంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది....

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రకు తెరతీసింది. సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ మేటిజట్లను చిత్తుచేసిన తొలిజట్టుగా నిలిచింది.

ఆస్ట్ర్రేలియాపై అపురూప విజయం...

నవీ ముంబై వేదికగా ఇంగ్లండ్ తో గతవారం జరిగిన సింగిల్ టెస్టుమ్యాచ్ లో 347 పరుగుల భారీవిజయం సాధించిన భారత్...ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టెస్టులో సైతం దిగ్గజ జట్టు ఆస్ట్ర్రేలియాపై 8 వికెట్ల సంచలన విజయం సాధించింది.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఆడిన గత 10 టెస్టుల్లో కనీసం ఒక్క గెలుపులేని భారత్ ఎట్టకేలకు తొలివిజయం నమోదు చేయగలిగింది.

ఆఖరిరోజున కంగారూల చిత్తు...

పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాను తొలిఇన్నింగ్స్ లో 219 పరుగులకే కుప్పకూల్చడంతో పాటు..తన తొలిఇన్నింగ్స్ లో 406 పరుగులతో భారీ ఆధిక్యం సంపాదించిన భారత్..రెండో ఇన్నింగ్స్ లో సైతం కంగారూజట్టును 261 పరుగులకే కట్టడి చేసింది.

భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా 4 వికెట్లు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్పిన్నర్ రాజేశ్వరీ గయక్వాడ్, సీమర్ పూజా వస్త్ర్రకర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

దీంతో మ్యాచ్ నెగ్గాలంటే రెండో ఇన్నింగ్‌ లో 75 పరుగులు మాత్రమే చేయాల్సిన భారత్ ఓపెనర్ షెఫాలీవర్మ, వన్ డౌన్ రిచా వికెట్ల నష్టానికే చరిత్రాత్మక విజయం సాధించగలిగింది.

ఓపెనర్ స్మృతి మందన, వన్ డౌన్ రిచా ఘోశ్ రెండో డౌన్ జెమీమా ఆత్మవిశ్వాసంతో ఆడి తమజట్టుకు అపురూప విజయం అందించారు.

కొత్త కోచ్ నేతృత్వంలో సరికొత్తగా...

ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ కోచ్ గా బాధ్యతలు చేపట్టడంతోనే భారత మహిళా క్రికెట్ తలరాత మారిపోయింది. ఇంగ్లండ్ జట్టుపై 347 పరుగుల భారీవిజయం సాధించడం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టింది. చివరకు ప్రపంచ మేటిజట్టు ఆస్ట్రేలియాను సైతం భారతజట్టు ఓడించగలిగింది.

కేవలం పదిరోజుల వ్యవధిలో రెండు ప్రపంచ మేటిజట్లను చిత్తు చేసినజట్టుగా భారత్ నిలిచింది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో భారత్ గతంలో ఎన్నడూలేని విధంగా రాణించడం ద్వారా వారేవ్వా అనిపించుకొంది. ఓపెనింగ్ జోడీ షెఫాలీ వర్మ, స్మృతి మందనతో పాటు టాపార్డర్ బ్యాటర్లు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగేజ్, ఆల్ రౌండర్ దీపా శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పేస్ ఆల్ రౌండర్ పూజా వస్త్రకర్ అసాధారణంగా రాణించిన కారణంగానే..ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా లాంటి దిగ్గజ జట్లపైన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400కు పైగా భారీస్కోర్లు నమోదు చేయగలిగింది.

బౌలింగ్ లో పేసర్లు పూజా వస్త్రకర్, రేణుకా సింగ్, స్పిన్ బౌలర్లు దీపా శర్మ, స్నేహ రాణా, రాజేశ్వరీ గయక్వాడ్ తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ హర్మన్ ప్రీత్ కౌర్ అత్యుత్తమంగా రాణించగలిగారు.

మొత్తం మీద ఆస్ట్ర్రేలియాను టెస్టు క్రికెట్లో ఓడించాలన్న భారత చిరకాల లక్ష్యం ఎట్టకేలకు ముంబై వాంఖడే స్టేడియంలో సాకరమయ్యింది. 2023 క్రికెట్ సీజన్ ను భారత మహిళాజట్టు...టెస్టు ఫార్మాట్లో అత్యంత విజయవంతంగా ముగించగలిగింది.

First Published:  24 Dec 2023 6:45 AM GMT
Next Story