Telugu Global
Sports

టీ-20 మ్యాచ్ ల్లో భారత్ డబుల్ సెంచరీ!

ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో 200 మ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ రికార్డుల్లో చేరింది.

టీ-20 మ్యాచ్ ల్లో భారత్ డబుల్ సెంచరీ!
X

ధూమ్ ధామ్ టీ-20 చరిత్రలో 200 మ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ రికార్డుల్లో చేరింది.

20ఓవర్లు, 60 థ్రిల్సుగా సాగే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో మాజీ చాంపియన్ భారత్ తనకంటూ ఓ ప్రత్యేక ఘనతను సంపాదించింది. 2007లో ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలవడం ద్వారా చరిత్ర సృష్టించిన భారత్ 200 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

కరీబియన్ గడ్డపై ద్విశతక మ్యాచ్....

వెస్టిండీస్ తో ఐదుమ్యాచ్ ల 2023 టీ-20 సిరీస్ లో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని బ్రయన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా భారత్ 200 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన రెండోజట్టుగా నిలిచింది.

భారత్ కంటే ముందే ఈ ఘనత సాధించిన పాకిస్థాన్ కు 223 టీ-20 మ్యాచ్ లు ఆడిన ప్రపంచ రికార్డు ఉంది. ఆ తర్వాత 200 మ్యాచ్ ల క్లబ్ లో చేరినజట్టు భారత్ మాత్రమే.

మొత్తం 200 మ్యాచ్ ల్లో భారత్ 130 విజయాలు, 63 పరాజయాల రికార్డుతో ఉంది. మరో ఐదుమ్యాచ్ లు వర్షం దెబ్బతో ఫలితం తేలకుండానే ముగిశాయి.

విండీస్ పై భారత్ దే పైచేయి..

రెండుసార్లు టీ-20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ కు మెరుగైన రికార్డే ఉంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో ఉంటే..వెస్టిండీస్ 7వ ర్యాంక్ లో కొనసాగుతోంది.

2018 నవంబర్ 4 నుంచి 2022 ఆగస్టు 7 వరకూ ఈ రెండుజట్ల నడుమ జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత్ ఐదు వరుస సిరీస్ లతో సహా మొత్తం ఆరుసార్లు సిరీస్ విజేతగా నిలిచింది.

కరీబియన్ గడ్డపై భారత్ ఇప్పటి వరకూ ఆడిన 7 టీ-20 మ్యాచ్ ల్లో 4 విజయాలు, 3 పరాజయాల రికార్డుతో ఉంది.

అమెరికా వేదికగా చివరి రెండు టీ-20 మ్యాచ్ లు..

ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడు టీ-20 మ్యాచ్ లను కరీబియన్ గడ్డపైన, చివరి రెండు టీ-20 మ్యాచ్ లను అమెరికా వేదికల్లోనూ నిర్వహించనున్నారు.

ఫ్లారిడాలోని లాడర్ హిల్ స్టేడియం మరోసారి భారత్- విండీస్ టీ-20 సిరీస్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది.

2023 సిరీస్ తొలిమ్యాచ్ ను టారుబాలోని బ్రయన్ లారా స్టేడియం వేదికగా నిర్వహిస్తే..ఆగస్టు 6న జరిగే రెండో టీ-20 మ్యాచ్ కు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత ఓపెనర్ రోహిత్ శర్మకు 22 మ్యాచ్ ల్లో 693 పరుగులతో 38.50 సగటు నమోదు చేసిన రికార్డు ఉంది. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

First Published:  4 Aug 2023 9:35 AM GMT
Next Story