Telugu Global
Sports

భారత హాకీ మహిళాజట్టుకు అత్యుత్తమ ర్యాంకు!

ప్రపంచ మహిళా హాకీలో భారతజట్టు అత్యుత్తమ ర్యాంకు సాధించింది.

భారత హాకీ మహిళాజట్టుకు అత్యుత్తమ ర్యాంకు!
X

ప్రపంచ మహిళా హాకీలో భారతజట్టు అత్యుత్తమ ర్యాంకు సాధించింది. రాంచీ వేదికగా ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడం ద్వారా ఈ ఘనత సంపాదించింది.

ప్రపంచ హాకీలో భారత పురుషుల, మహిళలజట్ల జోరు కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు అత్యుత్తమ ర్యాంక్ లు సాధించాయి.

హాంగ్జు వేదికగా ముగిసిన ఆసియాక్రీడల పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించడం ద్వారా భారతజట్టు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సాధించడంతో పాటు 3వ ర్యాంక్ లో నిలవడం ద్వారా సంచలనం సృష్టించింది. సవితా పూనియా నాయకత్వంలోని భారత మహిళాజట్టు సైతం నిలకడగా రాణించడం ద్వారా తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకొంది.

6వ ర్యాంకులో భారత్....

రాంచీ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ ఆల్ విన్ రికార్డుతో విజేతగా నిలవడంతో 6వ ర్యాంక్ కు చేరుకోగలిగింది. హాకీలో ర్యాంకింగ్స్ విధానం ప్రవేశపెట్టిన తరువాత భారత మహిళాజట్టు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం.

గత జూన్ లో జరిగిన ప్రో-హాకీ లీగ్ తో పాటు ఆసియాక్రీడల్లో కాంస్య పతకం గెలుచుకొన్న భారత్..చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తాచాటుకోగలిగింది.

భారతజట్టు మొత్తం 2368. 83 రేటింగ్ పాయింట్లతో ఇంగ్ల్డండ్ ను అధిగమించడం ద్వారా 6వ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగింది. నెదర్లాండ్స్ 3422. 40 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిస్తే..ఆస్ట్ర్రేలియా రెండు, అర్జెంటీనా మూడు, బెల్జియం నాలుగు, జర్మనీ ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

ఒలింపిక్ క్వాలిఫైయర్స్ లో భారత్ పోటీ...

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత కోసం త్వరలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య రెండు క్వాలిఫైయింగ్ టోర్నీలు నిర్వహిస్తోంది. ఇందులో ఒక టోర్నీకి రాంచీ ఆతిథ్యమిస్తోంది.

2024 జనవరి 13 నుంచి 19 వరకూ రాంచీ వేదికగా జరిగే టోర్నీలో జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, చిలీ, అమెరికా, ఇటలీ, చెక్ రిపబ్లిక్ జట్లతో 6వ ర్యాంకర్ భారత్ తలపడనుంది.

రాంచీ టోర్నీలో తలపడే జట్లలో జర్మనీ 5వ ర్యాంక్ లో ఉంటే..భారత్ 6, న్యూజిలాండ్ 9, జపాన్ 11, చిలీ 14, అమెరికా 15, ఇటలీ 19, చెక్ రిపబ్లిక్ 25 ర్యాంక్ జట్లుగా ఉన్నాయి.

మొత్తం ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ కమ్ నాకౌట్ తరహాలో టోర్నీ నిర్వహిస్తారు. ఒక్కో గ్రూపులో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడతాయి.

ఒలింపిక్స్ పురుషుల, మహిళల విభాగాలలో 16 జట్లు చొప్పున పాల్గోనున్నాయి. ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ తో పాటు పురుషుల, మహిళల విభాగాలలో ఐదేసి జట్లు నేరుగా ఒలింపిక్స్ కు అర్హత సంపాదించాయి.

మిగిలిన 11 బెర్త్ ల కోసం క్వాలిఫైయింగ్ టోర్నీలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహించనుంది. ఒలింపిక్స్ పురుషుల విభాగంలో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన భారత్ నాటికి నేటికీ అత్యధిక ఒలింపిక్స్ టైటిల్స్ నెగ్గిన జట్టుగా కొనసాగుతోంది.

First Published:  8 Nov 2023 10:47 AM GMT
Next Story