Telugu Global
Sports

ప్రపంచ హాకీ రైజింగ్ స్టార్ ముంతాజ్..

ఉత్తరప్రదేశ్ లోని ఓ నిరుపేద కుటుంబం నుంచి భారత హాకీలోకి ఓ మెరుపుతీగలా ముంతాజ్ ఖాన్ దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీ టోర్నీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొంది.

ప్రపంచ హాకీ రైజింగ్ స్టార్ ముంతాజ్..
X

భారత మహిళా హాకీ సంచలనం ముంతాజ్ ఖాన్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య అవార్డుకు ఎంపికయ్యింది. తన అసాధారణ ఆటతీరుతో 'రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు గెలుచుకొంది. భారత హాకీ ఫార్వర్డ్‌ ముంతాజ్‌ ఖాన్‌ అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిభావంతులైన యువక్రీడాకారులకు ఇచ్చే..రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు భారత నవతరం క్రీడాకారిణి ముంతాజ్ ఖాన్ ఎంపికయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2022 జూనియర్‌ మహిళా ప్రపంచకప్‌లో ముంతాజ్‌ కనబరచిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఆ టోర్నీలో భాగంగా ముంతాజ్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓ హ్యాట్రిక్ తో సహా మొత్తం ఎనిమిది గోల్స్‌ సాధించింది. టాప్‌ స్కోరర్ల వరుసలో మూడో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌జట్టుతో జరిగిన మ్యాచ్‌ మినహా ముంతాజ్ ఆడిన మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గోల్స్‌ సాధించడం విశేషం. ముంతాజ్‌ మొత్తం 32.9 పాయింట్లతో అవార్డుల రేస్ అగ్రస్థానంలో నిలిచింది. బెల్జియం ప్లేయర్ చార్లొట్‌ ఎంగెల్బర్ట్‌ 29.9 పాయింట్లతో రెండో స్థానం, నెదర్లాండ్స్ కు చెందిన లూనా ఫోక్‌ 16.9 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు.

నిరుపేద కుటుంబం నుంచి..

ఉత్తరప్రదేశ్ లోని ఓ నిరుపేద కుటుంబం నుంచి భారత హాకీలోకి ఓ మెరుపుతీగలా ముంతాజ్ ఖాన్ దూసుకొచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీ టోర్నీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొంది. ప్రపంచ అత్య్తుత్తమ క్రీడాకారిణి అవార్డు గెలుచుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచదృష్టిని ఆకర్షించిన ముంతాజ్ అంతర్జాతీయస్థాయికి ఎదగటానికి పడరాని కష్టాలు పడింది. లక్నో నగరంలోని తోప్ కానా బజార్ ప్రాంతంలో నివసించే తొమ్మిదిమంది సభ్యుల ఓ నిరుపేద కుటుంబానికి చెందిన నాలుగో సంతానమే ముంతాజ్ ఖాన్. ఆమె తల్లిదండ్రులు హపీజ్ ఖాన్, కైజర్ జహాన్ తమ కుటుంబాన్ని పోషించడానికి కూరగాయల బండినే నమ్ముకొన్నారు. రెండుపూటలా కడుపునిండా భోజనం లేకున్నా తన ఆరుగురు తోబుట్టువులతో కలసి పెరిగిన ముంతాజ్ కు బాల్యం నుంచి ఆటలంటే చెప్పలేని ఇష్టం. వీధివీధి తిరుగుతూ కూరగాయలు అమ్మే తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే పదేళ్ల వయసులోనే హాకీస్టిక్ చేతబట్టింది.

ఇంట్లో తెలియకుండానే హాకీ సాధన..

హాకీ ఫీల్డ్ లో ముంతాజ్ మెరుపువేగంతో పరుగెడుతూ స్టిక్ తో బంతిని నియంత్రించిన తీరు చూసిన అక్కడి శిక్షకుడు ముచ్చటపడిపోయారు. అమ్మానాన్నలకు తెలియకుండా రహస్యంగా సాధన చేస్తూ వచ్చిన ముంతాజ్ కు లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్ లో చేరే అవకాశం వచ్చింది. అయితే అమ్మనాన్నలు తీవ్రంగా నిరుత్సాహపరచినా.. తన అక్క ప్రోద్భలంతో దరఖాస్తు పూర్తి చేసి.. హాస్టల్ లో ప్రవేశం సంపాదించింది. ఓవైపు చదువు, మరోవైపు హాకీలో సాధన చేయటంలో ముంతాజ్ సఫలమయ్యింది. స్పోర్ట్స్ హాస్టల్ జీవితం పదేళ్ల చిన్నారిలో పట్టుదలను పెంచింది. హాకీఆటలో రాణించాలన్న తపన ముందుకు తీసుకువెళ్లింది. కొద్దిమాసాల శిక్షణతోనే ఉత్తరప్రదేశ్ సబ్ జూనియర్ జట్టులో చోటు సంపాదించింది. సబ్ జూనియర్ స్థాయిలో సత్తా చాటుకోడం ద్వారా యూపీ జూనియర్ జట్టులో కీలక సభ్యురాలిగా మారిపోయింది. చత్తిస్ ఘడ్ వేదికగా జరిగిన 2014 జూనియర్ నేషనల్స్ లో పాల్గొనే అవకాశెం దక్కినా వయసు తక్కువంటూ ముంతాజ్ ను పక్కనపెట్టారు. అయినా నిరాశపడకుండా తన సాధన కొనసాగించింది. 2017లో నిర్వహించిన జాతీయ జూనియర్ శిక్షణ శిబిరంలో పాల్గొనడం ద్వారా ముంతాజ్ తన ఆటకు మరింత పదును పెట్టుకొంది.

బంగారుపతకంతో బోణీ..

2018 లో జరిగిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ లో భాగంగా నిర్వహించిన హాకీ (ఫైవ్- ఏ- సైడ్ )లో బంగారు పతకం సాధించడంతో ముంతాజ్ జీవితమే మారిపోయింది. తమ కూతురు సాధించిన ఘనతను చూసి కుటుంబసభ్యులు మురిసిపోయారు. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా జరిగిన 2022 ప్రపంచ జూనియర్ మహిళల హాకీ పోటీలలో పాల్గొనే అవకాశం ముంతాజ్ కు దక్కింది. సెమీఫైనల్లో చోటు కోసం జరిగిన పోటీలో దక్షిణ కొరియాను 3-0తో చిత్తు చేయడంలో ముంతాజ్ ప్రధానపాత్ర వహించింది. కాంస్య పతకం కోసం ఇంగ్లండ్ తో జరిగిన పోరులో ముంతాజ్ రెండుగోల్స్ సాధించినా భారత్ కు 2-5 తో ఓటమి తప్పలేదు. భారత్ నాలుగోస్థానంతో సరిపెట్టుకొన్నా ముంతాజ్ కు అత్యుత్తమ ప్లేయర్ అవార్డు దక్కింది. ఇండియన్ రైల్వేస్ లో.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడం ద్వారా తొమ్మిదిమంది సభ్యుల తమ కుటుంబానికి ఆలంబనగా నిలవాలని కోరుకొంటున్న ముంతాజ్ లక్ష్యం నెరవేరాలని కోరుకొందాం.

First Published:  9 Oct 2022 1:46 AM GMT
Next Story