Telugu Global
Sports

మహిళా క్రికెట్ కు రోడ్ మ్యాప్..భారత్ కు 65 మ్యాచ్ లు!

మహిళా క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ), దాని అనుబంధ క్రికెట్ సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి.

మహిళా క్రికెట్ కు రోడ్ మ్యాప్..భారత్ కు 65 మ్యాచ్ లు!
X

మహిళా క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. పురుషులతో సమానంగా మహిళా క్రికెట్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ), దాని అనుబంధ క్రికెట్ సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. మహిళా క్రికెట్ ను మరింతగాబలోపేతం చేయటానికి రానున్న మూడేళ్లకాలానికి కార్యాచరణ కార్యక్రమాన్ని ఐసీసీ విడుదల చేసింది.

మహిళలకు ఇక వద్దంటే క్రికెట్!

గతకొద్ది సంవత్సరాలుగా తగిన మ్యాచ్ లు, సిరీస్ లు లేక తీవ్రనిరాశకు గురైన ప్రపంచ మహిళా క్రికెటర్లు, ప్రధానంగా భారత మహిళా క్రికెటర్లు రానున్న మూడేళ్ల కాలంలో ఊపిరి సలుపని రీతిలో టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ లు, సిరీస్ లు ఆడనున్నారు.

ఇప్పటి వరకూ పురుషులజట్లకు మాత్రమే ఐసీసీ అమలు చేస్తూ వచ్చిన ఎఫ్ టీపీ ( ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ )ని ఇక మహిళలకు సైతం అమలు చేయాలని నిర్ణయించింది.

మహిళాక్రికెట్లోని ప్రధాన ( ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా) 2022 మే నుంచి 2025 ఏప్రిల్ మధ్యకాలంలో ఆడాల్సిన మ్యాచ్ లు, వన్డే, టెస్టు, టీ-20 సిరీస్ ల కార్యక్రమాన్ని ఐసీసీ ఖరారు చేసింది.

మూడేళ్లలో 301 మ్యాచ్ లు...

మహిళా క్రికెట్ కోసం ఐసీసీ ఖాయం చేసిన ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రకారం రానున్న మూడేళ్లకాలంలో వివిధజట్లు కలసి మూడు ఫార్మాట్లలో భాగంగా మొత్తం

301 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో భారత మహిళాజట్టు ఏడాదికి సగటున 21 మ్యాచ్ ల చొప్పున ఆడనుంది.

వివిధజట్లు 7 టెస్టు మ్యాచ్ లు, 135 వన్డేలు, 159 టీ-20 మ్యాచ్ ల్లో తలపడనున్నాయి. మొత్తం 7 టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టే అత్యధికంగా ఐదుటెస్టులు ఆడనుంది.

ఆస్ట్ర్రేలియా 4, దక్షిణాఫ్రికా 3, భారత్ 2 టెస్టులతో ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి.

ఇక..భారత మహిళా క్రికెట్ జట్లు రెండు టెస్టులు, 27 వన్డేలు, 36 టీ-20 మ్యాచ్ ల్లో పాల్గోనుంది. ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియాజట్లు ప్రత్యర్థులుగా ఒక్కో టెస్ట్ మ్యాచ్ సైతం ఆడనుంది.

ఎఫ్టీపీ ప్రకారం భారత్ ఇప్పటికే శ్రీలంక ప్రత్యర్థిగా మూడేసి వన్డేలు, టీ-20 మ్యాచ్ లు పూర్తిచేసింది. మరో 59మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది.

మహిళా క్రికెట్ కు సునిశ్చితమైన భవిష్యత్ కోసమే ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఎక్కువ మ్యాచ్ లు , సిరీస్ లు అంటే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఆదాయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఏదిఏమైనా మహిళా క్రికెట్ చరిత్రలోనే ఇదో గొప్ప ఆరంభంగా నిలిచిపోతుంది.

First Published:  17 Aug 2022 3:45 AM GMT
Next Story