Telugu Global
Sports

ఐర్లాండ్ చేరిన భారతజట్టు, పాండ్యా పోయే..బుమ్రా వచ్చే!

ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ కోసం జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారతజట్టు ఐర్లాండ్ చేరుకొంది.

ఐర్లాండ్ చేరిన భారతజట్టు, పాండ్యా పోయే..బుమ్రా వచ్చే!
X

ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ కోసం జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారతజట్టు ఐర్లాండ్ చేరుకొంది. డబ్లిన్ వేదికగా ఆగస్టు 18 నుంచి ఈ పోరు ప్రారంభంకానుంది...

వెస్టిండీస్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో 3-2 ఓటమితో కంగు తిన్న భారత్..ఐర్లాండ్ తో తీన్మార్ సిరీస్ కోసం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ చేరుకొంది.

కరీబియన్ సిరీస్ లో పాల్గొన్న ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి విశ్రాంతి ఇచ్చారు.

కెప్టెన్ గా వ్యవహరించిన హార్థిక్ పాండ్యాతో పాటు శుభ్ మన్ గిల్, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ ల స్థానంలో యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, వీరబాదుడు రింకు సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మలకు ఐర్లాండ్ తో సిరీస్ లో చోటు కల్పించారు.

నంబర్ వన్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్....

జట్టు నుంచి ఇషాన్ కిషన్ కు విశ్రాంతి నివ్వడంతో సంజు శాంసన్ కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా బాధ్యతలు అప్పజెప్పారు. కరీబియన్ సిరీస్ లో పాల్గొన్న రవి బిష్నోయ్, తిలక్ వర్మ, ముకేశ్ కుమార్, యశస్వి జైశ్వాల్ ఐర్లాండ్ సిరీస్ కు సైతం ఎంపిక కాగలిగారు.

యువఆటగాడు జితేశ్ శర్మ అదనపు వికెట్ కీపర్ బ్యాటర్ గా జట్టులో చేరాడు. డాషింగ్ ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఐర్లాండ్ తో సిరీస్ కు జట్టులో మార్పులు చేర్పులు చేసింది.

గత ఎనిమిదిమాసాలుగా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో తిరిగి అందుబాటులోకి వచ్చాడు.

18 నుంచి 23 వరకూ సిరీస్ ....

ఐర్లాండ్ తో తీన్మార్ సిరీస్ డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఆగస్టు 18న ప్రారంభంకానుంది. ఆగస్టు 20న రెండు, ఆగస్టు 23న సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ నిర్వహిస్తారు.

కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రాతో పాటు యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, స్పిన్నర్ షాబాజ్ అహ్మద్,సూపర్ హిట్టర్ రింకూ సింగ్ సత్తా చాటుకోడానికి ఎదురుచూస్తున్నారు.

బుమ్రా నాయకత్వంలోని భారతజట్టు ఇతర సభ్యుల్లో రితురాజ్ గయక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేశ్ శర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్నోయ్, ప్రసిద్ధ కృష్ణ, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు.

ఐసీసీ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉంటే...ఐర్లాండ్ 12వ ర్యాంక్ జట్టుగా కొనసాగుతోంది.

First Published:  15 Aug 2023 9:08 AM GMT
Next Story