Telugu Global
Sports

భారత ఫుట్ బాల్ జట్లకు ఏషియాడ్ యోగం!

త్వరలో జరిగే ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనటానికి భారత ఫుట్ బాల్ జట్లకు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది.

భారత ఫుట్ బాల్ జట్లకు ఏషియాడ్ యోగం!
X

త్వరలో జరిగే ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనటానికి భారత ఫుట్ బాల్ జట్లకు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత ఫుట్ బాల్ జట్టు ఆసియాడ్ బరిలో నిలువబోతోంది....

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత అస్థిత్వపోరాటం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 204 దేశాల జట్లు ఫుట్ బాల్ ఆడుతుంటే..జనాభాపరంగా ఈ భూఖండంలోని రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్ లో 98వ స్థానంలో కొనసాగుతోంది.

45కు పైగా దేశాలు కలిగిన ఆసియా ఫుట్ బాల్ సమాఖ్యలో భారత ర్యాంక్ 18గా ఉంది.

పుంజుకొంటున్న భారత ఫుట్ బాల్...

ఆసియా ఫుట్ బాల్ చిన్నజట్లలో పెద్దన్నగా పేరున్న భారత ప్రమాణాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటూ వస్తున్నాయి. ప్రపంచ మేటి శిక్షకులను రప్పించి జట్లను తీర్చిదిద్దుతున్నా ముందుకు అడుగుపడటంలేదు.

క్రొయేషియాకు చెందిన ఇగోర్ స్టిమాక్ ప్రధాన శిక్షకుడుగా గత రెండేళ్లుగా భారత జట్టు గణనీయమైన పురోగతే సాధించింది. వెటరన్ ఫార్వర్డ్ సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత జట్టు నిలకడగా రాణించడం ద్వారా 104 నుంచి 98వ ర్యాంక్ కు చేరుకోగలిగింది. నాలుగు దేశాల ఇంటర్ కాంటినెంటల్ కప్, ఎనిమిది దేశాల శాఫ్ ఫుట్ బాల్ టోర్నీలలో విజేతగా నిలవడం ద్వారా భారత్ పుంజుకోగలిగింది.

ఎట్టకేలకు అనుమతి....

అయితే...భారత ఒలింపిక్ సంఘం నిబంధనల ప్రకారం గత రెండు ఆసియా క్రీడల నుంచి భారత ఫుట్ బాల్ జట్లు అర్హత సాధించలేకపోతున్నాయి. పురుషుల, మహిళల విభాగాలలో భారత జట్లు ఆసియా క్రీడల్లో పాల్గొనాలంటే మొదటి ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఉండితీరాలి. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియా ఫుట్ బాల్ పురుషుల విభాగంలో భారత్ 18వ ర్యాంక్ లో నిలిస్తే, మహిళల విభాగంలో 11వ ర్యాంక్ లో కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారం భారత ఫుట్ బాల్ జట్లకు ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమే లేకుండా పోతోంది.

ప్రధానికి భారత ఫుట్ బాల్ కోచ్ మెుర!

భారత ఫుట్ బాల్ జట్టు గత కొద్ది సంవత్సరాలుగా అత్యంత నిలకడగా రాణిస్తూ వస్తోందని, ర్యాంక్ ను సైతం 104 నుంచి 98కి మెరుగు పరచుకోగలిగిందని, ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ భారత ప్రధానికి జట్టు ప్రధాన శిక్షకుడు స్టిమాక్ మొర పెట్టుకొన్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొనగలిగితే జపాన్, ఇరాన్ లాంటి పలు మెరుగైన జట్లతో తలపడే అవకాశం భారత జట్టుకు దక్కుతుందని, ప్రత్యేక అనుమతిని ఇవ్వాలంటూ అభ్యర్థిస్తూ ఓ లేఖను పంపారు.

ప్రధాని సానుకూలంగా స్పందించడంతో...జాతీయ సాకర్ జట్లకు ఆసియా క్రీడల్లో పాల్గొనటానికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

చైనా ప్రధాన ప్రత్యర్థిగా భారత్ పోరు...

మొత్తం 24 జట్ల ఆసియా క్రీడల ఫుట్ బాల్‌లో భారత్ గ్రూప్- ఏలో తన అదృష్టం పరీక్షించుకోనుంది. నిర్వాహక సంఘం విడుదల చేసిన డ్రా ప్రకారం..గ్రూప్ - ఏ లీగ్ లో ఆతిథ్య చైనా, బంగ్లాదేశ్, మియన్మార్ జట్లతో భారత పురుషుల జట్టు తలపడనుంది మహిళల గ్రూప్ - బీ లీగ్ లో థాయ్ లాండ్, చైనీస్ తైపీ జట్లతో భారత జట్టు పోటీపడనుంది.

మొత్తం 24 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాలు సాధించిన జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉంది. మొత్తం ఆరు జట్లలోని నాలుగు అత్యుత్తమ మూడో స్థానం సాధించిన జట్లకు సైతం క్వార్టర్స్ లో చోటు కల్పిస్తారు.

పురుషుల గ్రూపు-ఏ నుంచి చైనా, భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమ గ్రూపులో భారత్ కు చైనాతో మాత్రమే పోటీ అని, మిగిలిన జట్లను ఓడించడం ఏమంత కష్టంకాబోదని భారత కోచ్ స్టిమాక్ ధీమాగా చెబుతున్నారు.

రెండుసార్లు ఏషియాడ్ విజేత భారత్....

భారత ఫుట్ బాల్ జట్టుకు ఆసియా క్రీడల్లో రెండు సార్లు బంగారు పతకం సాధించిన ఘనత సైతం ఉంది. 1951లో తొలిసారిగా నిర్వహించిన ఆసియా క్రీడల తొలి పోటీలో ఫుట్ బాల్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు తిరిగి 1962 గేమ్స్ లో సైతం బంగారు పతకం సంపాదించింది.

2002 ఆసియా క్రీడల నుంచి 23 సంవత్సరాల లోపు వయసున్న వారికి మాత్రమే ఫుట్ బాల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అయితే..గతేడాది జరగాల్సిన 2022 ఆసియా క్రీడలు కరోన దెబ్బతో ఏడాది వాయిదా పడటంతో..ప్రస్తుత ఆసియా క్రీడల్లో 23 సంవత్సరాలు పైబడిన ముగ్గురు ఆటగాళ్లకు ఆడే అవకాశం ఇచ్చారు.

దీంతో సునీల్ ఛెత్రీ, గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ జింగాన్ లకు ఆసియా క్రీడల్లో పాల్గోనే అవకాశం దక్కింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగిలిన వారంతా 23 సంవత్సరాలలోపు వారై మాత్రమే ఉండాలి.

ఆసియా క్రీడలు సెప్టెంబర్ మూడో వారం నుంచి అక్టోబర్ 8 వరకూ చైనా నగరం హాంగ్జు వేదికగా జరుగనున్నాయి. ఆసియా క్రీడల ఫుట్ బాల్ పోటీలు మాత్రం సెప్టెంబర్ 19న ప్రారంభంకానున్నాయి.

అక్టోబర్ 7న ఫుట్ బాల్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ను నిర్వహిస్తారు. ఆసియా క్రీడల ఫుట్ బాల్ లో జపాన్, కొరియా, ఇరాన్ అగ్రశ్రేణి జట్లుగా కొనసాగుతున్నాయి.

First Published:  31 July 2023 11:33 AM GMT
Next Story