Telugu Global
Sports

భారత మహిళా అంపైర్ వృందా అరుదైన ఘనత!

మహిళా టెస్టు క్రికెట్లో భారత తొలి అంపైర్ గా ముంబై యువతి వృందా ఘనశ్యామ్ రాఠీ చరిత్ర సృష్టించింది. భారత్- ఇంగ్లండ్ జట్ల టెస్టుమ్యాచ్ లో అంపైర్ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకోగలిగింది.

భారత మహిళా అంపైర్ వృందా అరుదైన ఘనత!
X

మహిళా టెస్టు క్రికెట్లో భారత తొలి అంపైర్ గా ముంబై యువతి వృందా ఘనశ్యామ్ రాఠీ చరిత్ర సృష్టించింది. భారత్- ఇంగ్లండ్ జట్ల టెస్టుమ్యాచ్ లో అంపైర్ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకోగలిగింది.

భారత మహిళలు రంగం ఏదైనా పురుషులతో సమానంగా రాణిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నారు. పురుషాధిక్య క్రికెట్లో సైతం మహిళలు పలు రకాలుగా సత్తా చాటుకొంటూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారు.

ముంబై నుంచి అంతర్జాతీయ స్థాయికి...

2010 సీజన్ నుంచి ముంబై క్రికెట్ సంఘానికి స్కోరర్ గా సేవలు అందిస్తున్న 29 ఏళ్ల వృందా రాఠీ...క్రమక్రమంగా అంపైరింగ్ బాధ్యతల పట్లు మొగ్గు చూపింది.

నీడపట్టున ఉండి స్కోరర్ గా పని చేయటం కన్నా..ఆరుబయట, ఉక్కబోత, ఎండవేడిమి వాతావరణంలో సాగే అంపైరింగే తనకు మక్కువని నిర్ణయించుకొని..

బీసీసీఐ నిర్వహించిన క్రికెట్ అంపైరింగ్ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణురాలయ్యింది.

దీంతో ..ముంబై క్రికెట్ సంఘం నిర్వహించే స్ధానిక లీగ్ మ్యాచ్ లతో పాటు.. బాలుర సబ్-జూనియర్, జూనియర్, జాతీయ క్రికెట్ జూనియర్ మ్యాచ్ ల్లో అంపైర్ గా విధులు నిర్వర్తించి తన ప్రతిభను నిరూపించుకోడం ద్వారా, అంకితభావాన్ని చాటుకొంది.

ఆ తర్వాత ఐసీసీ నిర్వహించిన అంపైర్ పరీక్షల్లో సైతం ఉత్తీర్ణత సాధించి...ఏకంగా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లోనే చోటు సంపాదించింది. 2013 మహిళా ప్రపంచకప్ క్రికెట్లో అంపైర్ గా వ్యవహరించిన న్యూజిలాండ్ కు చెందిన కాథీ క్రాస్ తనకు ఆదర్శమని వృంధా ప్రకటించింది. భారత అంపైర్లు వృందా, జననీ నారాయణన్ లను అంతర్జాతీయ అంపైరింగ్ ప్యానెల్ లో చేర్చినట్లు ఐసీసీ ప్రకటించడంతో...మహిళా అంపైర్ల సంఖ్య 12కు చేరుకొంది.

మహిళాటెస్టులోనూ అంపైరింగ్...

20 ఓవర్లలో టీ-20, 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లలో అంపైరింగ్ చేయడం ఓ రకమైన అనుభవం కాగా..నాలుగు లేదా ఐదురోజులపాటు నాలుగు ఇన్నింగ్స్ గా సాగే టెస్టు ఫార్మాట్లో అంపైరింగ్ చేయడం ఎవరికైనా సవాలే.

కొద్దిమాసాల క్రితం వరకూ సీనియర్ స్థాయి మ్యాచ్ ల్లో అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తించిన వృందా కు..నవీ ముంబై వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల టెస్టు మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ గా బాధ్యతలు నిర్వహించే అరుదైన అవకాశం దక్కింది.

పైగా తాను పుట్టి పెరిగిన నవీముంబైలోనే మహిళా టెస్టు అంపైర్ గా అరంగేట్రం చేయటం వృందాను గాల్లో తేలిపోయేలా చేసింది.

2014లో ముంబై క్రికెట్ సంఘం, 2018లో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలలో విజయవంతంగా నిలిచిన 34 ఏళ్ల వృందా కు 13 మహిళా వన్డేలు, 43 మహిళా టీ-20 మ్యాచ్ ల్లో అంపైరింగ్ చేసిన రికార్డు ఉంది.

2020 సీజన్లో ఐసీసీ డెవలెప్ మెంట్ ప్యానెల్ అంపైర్ గా ప్రమోషన్ పొందిన వృందా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ లో సైతం అంపైర్ గా వ్యవహరించారు.

పురుషుల మ్యాచ్ కు సైతం అంపైర్ గా..

2023 జనవరి 10న నారాయణన్ జననితో కలసి గోవా- పాండిచ్చేరీ జట్ల నడుమ జరిగిన పురుషుల రంజీమ్యాచ్ లో వృందా అంపైర్ గా విధులు నిర్వర్తించారు.

ఆ తర్వాత దక్షిణాఫ్రికా వేదికగాజరిగిన టీ-20 మహిళా ప్రపంచకప్, హాంగ్జు వేదికగా జరిగిన ఆసియాక్రీడల క్రికెట్లోనూ, వాంఖడే స్టేడియం వేదికగా ఇటీవలే ముగిసిన భారత్- ఇంగ్లండ్ జట్ల టీ-20 సిరీస్ లోనూ అంపైర్ గా వృందా వ్యవహరించింది.

నవీముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్- భారతజట్ల నడుమ జరుగుతున్న మహిళా టెస్టుమ్యాచ్ లో కెఎన్ అనంతపద్మనాభన్ తో కలసి ఫీల్డ్ అంపైర్ గా వృందా వ్యవహరించింది. థర్డ్ అంపైర్ గా వీరేంద్ర శర్మ, మ్యాచ్ రిఫరీగా జీఎస్ లక్ష్మి బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో టెస్టు అంపైర్ గా వ్యవహరించిన భారత తొలిమహిళగా వృందా రాఠీ చరిత్రలో నిలిచిపోతుంది.

First Published:  16 Dec 2023 3:31 AM GMT
Next Story