Telugu Global
Sports

భారత క్రికెటర్లకు రెక్కలు..వేల కిలోమీటర్ల ప్రయాణం!

భారత క్రికెటర్లు ఊపిరిసలుపని టూర్‌ల‌తో...ఎక్కే విమానం, దిగే విమానంతో కొద్దిరోజుల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ సతమతమైపోతున్నారు.

భారత క్రికెటర్లకు రెక్కలు..వేల కిలోమీటర్ల ప్రయాణం!
X

పెద్ద మనుషుల క్రీడ క్రికెట్ ఇప్పుడు ఫక్తు వ్యాపార క్రీడగా మారిపోయింది. వివిధ దేశాల క్రికెటర్లు.. ప్రధానంగా భారత క్రికెటర్లు ఊపిరిసలుపని టూర్‌ల‌తో...ఎక్కే విమానం, దిగే విమానంతో కొద్దిరోజుల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ సతమతమైపోతున్నారు. వెస్టిండీస్ పర్యటనతో పాటు..ఫ్లారిడా వేదికగా పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ముగిసిందో లేదో...జింబాబ్వే పర్యటన కోసం రాహుల్ నాయకత్వంలో భారత జట్టు హరారేలో అడుగుపెట్టింది.

14 రోజులు.. ఆరు మ్యాచ్‌లు.. 8,800 కిలోమీటర్లు..

ఇంగ్లండ్ వేదికగా సింగిల్ టెస్టు, తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లు ముగించిన భారత్...అక్కడి నుంచే వెస్టిండీస్ పర్యటన కోసం కరీబియన్ ద్వీపాలకు పయనమైంది. ట్రినిడాడ్, సెయింట్ కిట్స్ లో సిరీస్ లోని మొదటి మూడు టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత జట్టు...అక్కడి నుంచి అమెరికా గడ్డ ఫ్లారిడాకు చేరుకుంది. సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్ లూ ఫ్లారిడాలో ఆడిన భారత క్రికెటర్లు.. సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లారు.

గత 14 రోజుల వ్యవధిలోనే ఆరు మ్యాచ్ లు ఆడటం కోసం భారత క్రికెటర్లు ఏకంగా 8,800 కిలోమీటర్లు ప్రయాణం చేశారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. ఎంత చార్టర్డ్ ఫ్లయిట్ లు ఉన్నా, స్టార్ హోటెళ్లలో బసచేసినా, బిజినెస్ క్లాస్ లో ప్రయాణాలు చేసినా..క్రికెటర్లూ మనుషులే అన్నది వాస్తవం. విమాన ప్రయాణాలలోనే సేదతీరుతూ, భారత క్రికెటర్లు విశ్రాంతి తీసుకుంటున్నారన్నా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితిని నివారించడానికే...స్టార్ క్రికెటర్లు అలసిపోకుండా..తగిన విశ్రాంతి ఇవ్వడం కోసం...బీసీసీఐ ఎంపిక సంఘం, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్..రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లకు తగిన విశ్రాంతి ఇస్తూ...రిజర్వ్, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పిస్తూ..సత్తా చాటుకొనే అవకాశం కల్పిస్తున్నారు.

జింబాబ్వే టు యూఏఈ...

ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు ..సిరీస్ ముగిసిన వెంటనే అక్కడి నుంచి...గల్ఫ్ దేశాలు వేదికగా ఈ నెల ఆఖరి వారంలో ప్రారంభమయ్యే ఆసియాకప్ టోర్నీలో పాల్గొనటానికి...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకోనుంది.సెప్టెంబర్ 11న ఆసియాకప్ ముగిసిన వెంటనే .. భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో తీన్మార్ టీ-20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ, నాగ్‌పూర్, హైదరాబాద్‌ వేదికలుగా మూడు టీ-20లు నిర్వహిస్తారు. మొహాలీ నుంచి నాగ్‌పూర్‌కు 1,330 కిలోమీటర్లు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు 500 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంది. సెప్టెంబర్‌ 25‌న సిరీస్ ముగుస్తుంది.

సఫారీ జట్టుతో మరో సిరీస్...

ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ ముగిసిన వెంటనే భారతజట్టు.. సెప్టెంబర్ 28న దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ఆడాల్సి ఉంది. తిరువనంతపురం, గువాహతి, ఇండోర్‌లు వేదికలుగా ఈ సిరీస్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కంగారూలతో మూడో టీ-20 ముగిసిన వెంటనే భారత జట్టు తిరునంతపురం చేరుకుంటుంది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 1,300 కి.మీ. తిరువనంతపురం నుంచి గువహతికి 2,200 కి.మీ. ఈ రెండు పట్టణాల మధ్య నేరుగా ఫైట్స్ లేవు. అంటే తిరువనంతపురం నుంచి చెన్నై(775 కిలోమీటర్లు) చేరుకుని.. అక్కడి నుంచి అసోం వెళ్లాల్సి ఉంది. ఇక గువహతి నుంచి ఇండోర్‌కు 2,200 కి.మీ.

డబ్బుకు లోకం..క్రికెట్ దాసోహం...!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్రేలియాతో, దక్షిణాఫ్రికా జట్లతో రెండు సిరీస్‌లుగా ఆరు మ్యాచ్ లు ఆడటం కోసం భారత క్రికెటర్లు ఏకంగా 8,800 కి.మీ. ప్రయాణించాల్సి రావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది..లాభమా?, నష్టమా? అంటూ విశ్లేషణలు చేసేవారూ లేకపోలేదు. సఫారీలతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు టీ- 20 ప్రపంచకప్ లో పాల్గొనడం కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఈ కీలక టోర్నీ ముందు బిజీ షెడ్యూల్స్, తీరిక లేని ప్రయాణాల వల్ల ఆ ప్రభావం ఆటగాళ్ల మీద పడితే అది మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి..ప్రపంచకప్ టోర్నీకి ముందే ఎవరైనా సీనియర్ ఆటగాడు (రోహిత్, కోహ్లీ, కెఎల్ రాహుల్, బుమ్రా, పంత్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్) గాయపడితే మాత్రం అది భారత్ కు కోలుకోలేని దెబ్బే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  12 Aug 2022 9:37 AM GMT
Next Story