Telugu Global
Sports

భారత క్రికెట్ 'యోధుడు' రవీంద్ర జడేజా!

క్రికెట్ కు వీరత్వాన్ని జోడించి ప్రపంచ క్రికెట్లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆల్ -ఇన్- వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరియర్ ను పూర్తి చేశాడు.

భారత క్రికెట్ యోధుడు రవీంద్ర జడేజా!
X

క్రికెట్ కు వీరత్వాన్ని జోడించి ప్రపంచ క్రికెట్లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆల్ -ఇన్- వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరియర్ ను పూర్తి చేశాడు.

రవీంద్ర జడేజా..భారత, ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్ కు తన ఆల్ రౌండ్ ప్రతిభతో దన్నుగా నిలుస్తూ వస్తున్న 35 సంవత్సరాల రవీంద్ర సిన్హ్ అనీరుధ్ సిన్హ్ జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 15 సంవత్సరాల తన ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు.

ఆల్ -ఇన్-వన్ క్రికెటర్....

సౌరాష్ట్ర్రలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి..కష్టాలలో పెరిగి..ఐపీఎల్ ద్వారా భారత, అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన జడేజాకు ప్రపంచ మేటి స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుంది.

సాంప్రదాయ టెస్టు క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ లేదా 50 ఓవర్ల వన్డే క్రికెట్...ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించడం, బౌలర్ గా, బ్యాటర్ గా, ఫీల్డర్ గా మ్యాజిక్ చేయటం, మెరుపులు మెరిపించడంలో జడేజాకు జడేజా మాత్రమే సాటి.

భారత క్రికెట్ కు నమ్మకమైన, నాణ్యమైన ఆల్ రౌండర్ గా జడేజా గత 15 సంవత్సరాలుగా అందించిన సేవలు నిరుపమానం.

మీసం మెలేసినా..బ్యాట్ ను కత్తిలా తిప్పినా...

పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కు వీరత్వాన్ని జోడించిన క్రికెటర్ ఎవరంటే రవీంద్ర జడేజా అని మాత్రమే చెప్పాలి. జట్టు కష్ట్లాలలో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజాకు కళ్లు చెదిరే క్యాచ్ లు పట్టిన తరుణంలో తొడలు చరచడం అలవాటు. అంతేకాదు..శతకం పూర్తి చేస్తే బ్యాట్ ను కరవాలంలా తిప్పడం బ్యాటుతో పెట్టిన విద్య. ఇక..ప్రత్యర్థి కీలక బ్యాటర్లను అవుట్ చేసిన సమయంలో మీసాలు మెలివేయటం జడేజాకు సాధారణ విషయమే.

2009 ఫిబ్రవరి 8న శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన జడేజా ఆ తరువాత నుంచి మరి వెనుదిరిగి చూసింది లేదు.

5000కు పైగా పరుగులు- 500కు పైగా వికెట్లు...

15 సంవత్సరాల తన వన్డే కెరియర్ లో 197 మ్యాచ్ లు ఆడి 2756 పరుగులు సాధించడంతో పాటు 220 వికెట్లు పడగొట్టిన రికార్డు జడేజాకు ఉంది. అంతేకాదు..

66 టీ-20 మ్యాచ్ ల్లో 22.86 సగటుతో 480 పరుగులు సాధించడంతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు.

ఇక..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 2018 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ పై తన తొలిటెస్టు మ్యాచ్ ఆడిన జడేజా ప్రస్తుత 2024 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టు వరకూ 2893 పరుగులతో 36.16 సగటు నమోదు చేశాడు. 101 ఇన్నింగ్స్ లో 280 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు క్రికెట్లో మూడు శతకాలు బాదిన ఘనత కూడా జడేజాకు ఉంది. 2022 సిరీస్ లో శ్రీలంక పై సాధించిన 175 పరుగుల స్కోరే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా ఉంది.

228 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ భారీశతకాన్ని జడేజా నమోదు చేయగలిగాడు.

అరుదైన రికార్డుల మొనగాడు...

రవీంద్ర జడేజా పేరుతో పలు అరుదైన రికార్డులు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ముగ్గురు భారత దిగ్గజ బౌలర్లలో జడేజా ఒకడిగా నిలిచాడు. అంతేకాదు... అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల పరుగులు సాధించిన 11వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. భారత ఆల్ టైమ్ గ్రేట్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన చోటు సంపాదించాడు.

గతేడాది ఆస్ట్ర్రేలియాతో ఇండోర్ వేదికగా ముగిసిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కంగారూ టాపార్డర్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ క్వాజా, మార్నుస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ లను జడేజా పడగొట్టాడు.

జడేజా క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి 298 ఇన్నింగ్స్ లో 500 వికెట్లు పడగొట్టడమే కాదు..5000కు పైగా పరుగులు సైతం సాధించగలిగాడు.

పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 356 ఇన్నింగ్స్ లో 687 వికెట్లు, 9031 పరుగులు నమోదు చేశాడు.

గతంలోనే అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల పరుగుల రికార్డు సాధించిన దిగ్గజ ఆల్ రౌండర్లలో వాసిం అక్రం, జాక్ కలిస్, ఇమ్రాన్ ఖాన్, షకీబుల్ హసన్, షాహీద్ అఫ్రిదీ, డేనియల్ వెట్టోరీ, చమిందా వాస్, షాన్ పోలాక్, ఇయన్ బోథమ్, కపిల్ దేవ్ ఉన్నారు. ప్రస్తుత 2023 సీజన్ లో రవీంద్ర జడేజా అదే డబుల్ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

అత్యంత వేగంగా 'డబుల్' రికార్డు!

టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు, 2500 పరుగుల మైలురాయి చేరిన రెండో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలిచాడు.

జడేజా తన 62వ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. భారత లెజండరీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ (65 మ్యాచ్‌లు) కంటే మూడు మ్యాచ్‌లు ముందుగా ఈ ఫీట్‌ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ (55 మ్యాచ్‌లు).. జడేజా కంటే ఏడు మ్యాచ్‌లు తక్కువలోనే ఈ ఫీట్‌ను అందుకుని అగ్రస్థానంలో ఉన్నాడు.

మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా చొప్పున మ్యాచ్ లు..

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా మ్యాచ్ లు చొప్పున ఆడిన అతికొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ఘనత సైతం జడేజాకు ఉంది.

టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరఫున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా దిగ్గజాల సరసన చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన జడ్డూ చోటు సంపాదించాడు.జడేజా ఇప్పటి వరకు 69 టెస్టులు,197వన్డేలు, 66 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న జడేజా 2008 నుంచి 2023 సీజన్ వరకూ 226 మ్యాచ్ లు ఆడటం విశేషం

అంతర్జాతీయ క్రికెట్లో 15 సంవత్సరాలపాటు తాను భారత్ కు సేవలు అందించడం వెనుక తన కుటుంబసభ్యులు, స్నేహితులు, కోచ్ లు, శ్రేయోభిలాషుల అండదండలు ఉన్నాయని, అందరికీ తాను రుణపడి ఉంటానని జడేజా సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

గాయంతో విశాఖ టెస్టుకు దూరమైన జడేజా..ఈ నెల 15నుంచి రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగే మూడోటెస్టు ద్వారా పునరాగమనం చేయనున్నాడు.

ప్రపంచ క్రికెట్ కు భారత్ అందించిన అత్యంత అరుదైన, అపురూపమైన ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా చరిత్రలో నిలిచిపోతాడు.

First Published:  9 Feb 2024 4:03 AM GMT
Next Story