Telugu Global
Sports

జింబాబ్వే క్రికెట్ కు భారత కోచ్ కొత్తఊపిరి!

అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్దిసంవత్సరాలు వెనుకబడిపోయిన జింబాబ్వే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. టీ-20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి సూపర్ -12 రౌండ్ వరకూ తన సత్తా చాటుకోడం ద్వారా తన ఉనికిని చాటుకోగలిగింది.

జింబాబ్వే క్రికెట్ కు భారత కోచ్ కొత్తఊపిరి!
X

అంతర్జాతీయ క్రికెట్లో గత కొద్దిసంవత్సరాలు వెనుకబడిపోయిన జింబాబ్వే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. టీ-20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి సూపర్ -12 రౌండ్ వరకూ తన సత్తా చాటుకోడం ద్వారా తన ఉనికిని చాటుకోగలిగింది.

1970-80 కాలంలో ప్రధాన అంతర్జాతీయ క్రికెట్ జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన జింబాబ్వే ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో పలు సంచలనాలతో తన ఉనికిని చాటుకోగలిగింది.

దేశంలోని రాజకీయ అస్థిరత్వం, పాలకుడు ముగాబే నియంతృత్వపోకడలతో జింబాబ్వే ఆర్థికవ్యవస్థ మాత్రమే కాదు...క్రికెట్ వ్యవస్థ సైతం పతనావస్థకు చేరుకొంది. అయితే..సకాలంలో ఐసీసీతో పాటు భారత మాజీ ఓపెనర్, ప్రముఖ శిక్షకుడు లాల్ చంద్ రాజ్ పుత్ పుణ్యమా అంటూ జింబాబ్వే క్రికెట్ కొత్తఊపిరి పోసుకోగలిగింది.

చిన్నజట్లలో పెద్దజట్టు ....

జింబాబ్వే అనగానే...యాండీ పైక్రాఫ్ట్, హీత్ స్ట్ర్రీక్, జాన్ ట్రైకోస్, హెన్రీ ఒలాంగ, గ్రాంట్ ఫ్లవర్, యాండీ ఫ్లవర్, నీల్ జాన్సన్, కాంప్ బెల్, బ్రెండన్ టేలర్, టెటిండా టైబు, డేవిడ్ హాటన్, ముర్రే గుడ్విన్, పాల్ స్ట్రాంగ్, యాండీ వాలర్ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లు గుర్తుకు వస్తారు. అయితే..జింబాబ్వేలో చోటు చేసుకొన్న పరిణామాలు, క్రికెట్ సంఘంలో అవినీతి, ఆటగాళ్లకు అరకొర వేతనాలు, జాతివివక్ష లాంటి కారణాలతో పరిస్థితులు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. గతంలోనే టెస్టుహోదా పొందిన జింబాబ్వే రానురాను తీసికట్టుగా తయారయ్యింది. అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా లాంటి జట్ల ముందు ఎందుకూ పనికిరాకుండా పోయింది.

ఇలాంటి స్థితిలో నాలుగేళ్ల క్రితం జింబాబ్వే క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా భారత మాజీ ఓపెనర్ లాల్ చంద్ రాజ్ పుత్ పగ్గాలు చేతపట్టారు.


ఆపద్భాంధవుడు లాల్ చంద్ రాజ్ పుత్...

2018లో అఫ్ఘనిస్థాన్ జట్టుకు శిక్షకుడుగా ఉన్న భారత ఏజట్టు కోచ్ లాల్ చంద్ రాజ్ పుట్ ను జింబాబ్వే క్రికెట్ సంఘం సంప్రదించింది. దారితప్పిన తమ క్రికెట్ ను తిరిగి గాడిలో పెట్టాలంటూ అభ్యర్థించింది. పూర్తిఅధికారాలు కట్టబెట్టింది.

దీంతో భారత్ నుంచి హరారే చేరుకొన్న రాజ్ పుత్...జింబాబ్వే క్రికెట్ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి ఓ సమగ్రమైన కార్యాచరణను చేపట్టారు. అపారఅనుభవం ఉన్న సీన్ విలియమ్స్ లాంటి పలువురు సీనియర్ క్రికెటర్లతో సంప్రదింపులు జరపడమే కాదు..సాయం కూడా అర్థించారు. జింబాబ్వేలో విస్త్త్రుతంగా పర్యటించి ప్రతిభావంతులైన యువక్రికెటర్లను గుర్తించి జాతీయజట్టులో తగిన అవకాశాలు కల్పించారు.

8 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సూపర్ -12 అర్హత...

గతంలో వన్డే ప్రపంచకప్ లో పలుమార్లు పాల్గొన్న జింబాబ్వే ఎనిమిదేళ్ల విరామం తర్వాత టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు అర్హత సంపాదించగలిగింది.ఇర్విన్ నాయకత్వంలోని జింబాబ్వేజట్టులో సికిందర్ రజా, మురబానీ, చకోవా, సీన్ విలియమ్స్, చతారా, బుర్ల్ లాంటి క్రికెటర్లు గత ఏడాది కాలంగా నిలకడగా రాణించడంతో అంతర్జాతీయ టీ-20 ర్యాంకింగ్స్ లో 11వ స్థానంలో నిలువగలిగంది. ర్యాంకింగ్ ప్రాతిపదికన ప్రపంచకప్ అర్హత రౌండ్లో పాల్గొనగలిగింది. ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన ఎనిమిదిజట్ల క్వాలిఫైయింగ్ రౌండ్ మొదటి నాలుగు అత్యుత్తమజట్లలో నిలవడం ద్వారా సూపర్ -12 రౌండ్లో అడుగుపెట్టింది.

పాకిస్థాన్ పై సంచలన విజయం...

భారత్, పాకిస్థాన్,దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ జట్లతో కూడిన సూపర్ -12 గ్రూప్ -2 రౌండ్లో జింబాబ్వే 5 మ్యాచ్ లు ఆడి ఓ గెలుపుతో మూడు పాయింట్లు నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్ పై ఒక్కపరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.

సూపర్ -12 రౌండ్లో విజయం ద్వారా మరోసారి తన ఉనికిని చాటుకొన్న జింబాబ్వే రానున్నకాలంలో మరెంతగానో మెరుగుపడాల్సి ఉంది. రాజ్ పుత్ నేతృత్వంలో పునరుజ్జీవన దశగా సాగుతున్న జింబాబ్వే జట్టు అవసరం అంతర్జాతీయ క్రికెట్ కు ఎంతగానో ఉంది.

First Published:  8 Nov 2022 6:18 AM GMT
Next Story