Telugu Global
Sports

భారత బ్రాండ్‌ మార్కెట్ 'యువరాణి' మను బాకర్!

భారత బ్రాండ్ మార్కెట్లో ఇప్పుడు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పేరే వినిపిస్తోంది.

భారత బ్రాండ్‌ మార్కెట్ యువరాణి మను బాకర్!
X

భారత బ్రాండ్ మార్కెట్లో ఇప్పుడు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పేరే వినిపిస్తోంది. పలు బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం 22 ఏళ్ల మనును ఉపయోగించుకోడానికి ఆసక్తి చూపుతున్నాయి.

140కోట్ల కు పైగా జనాభాతో, ప్రపంచ ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ లో వ్యాపారం ఎంత లాభసాటిగా ఉంటుందో మరి చెప్పాల్సిన పనిలేదు.

ప్రపంచీకరణ పుణ్యమా అంటూ విశ్వవిఖ్యాత బహుళజాతి సంస్థలన్నీ ఇప్పుడు భారత మార్కెట్లో పాగా వేసి తమ ఉత్పత్తుల విక్రయం ద్వారా కోట్ల డాలర్లు లాభాలుగా సంపాదిస్తున్నాయి.

బ్రాండ్ మార్కెట్లో మహిళాస్టార్లు తక్కువే...

భారత్ లో బహుళజాతి సంస్థల ఉత్పత్తి ప్రచారం కోసం పేరు ప్రఖ్యాతులు కలిగిన క్రీడాకారులు, స్టార్ క్రికెటర్లను మాత్రమే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకొంటూ వస్తున్నాయి.

విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, స్మృతి మంధన, పీవీ సింధు, నీరజ్ చోప్రా లాంటి స్టార్లు మాత్రమే మనకు ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్లుగా దర్శనమిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

అలనాటి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, ధోనీ, విరాట్ కొహ్లీ వరకూ భారత బ్రాండ్ మార్కెట్లో రాజ్యమేలుతూ వచ్చారు. పురుషులతో పోల్చుకొంటే..మహిళలు చాలా తక్కువే అని చెప్పాలి.

బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మాత్రమే పలు కంపెనీల ఎండార్స్ మెంట్లతో బ్రాండ్ అంబాసిడర్లుగా సందడి సందడి చేశారు.

అయితే..గత కొద్ది సంవత్సరాలుగా సింధు జోరు తగ్గడంతో ఆ స్థానాన్ని స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన ఆక్రమించింది. అయితే..ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో జంట పతకాలు సాధించిన భారత యువషూటర్ మను బాకర్ ..సరికొత్త బ్రాండ్ అబాసిడర్ గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

22 ఏళ్ల వయసులోనే కోటి 50 లక్షల ఎండార్స్ మెంట్..

పారిస్ ఒలింపిక్స్ మహిళల ఏర్ పిస్టల్ 10మీటర్ల వ్యక్తిగత, మిక్సిడ్ టీమ్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించడం ద్వారా మను బాకర్ భారత సరికొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వెలుగులోకి వచ్చింది.

పిస్టల్ షూటర్ గా అసాధారణ ప్రతిభతో పాటు..కేవలం 22 సంవత్సరాల వయసుతో ఆకర్షణీయంగా ఉండటం మను బాకర్ కు కలసి వచ్చింది. భారత జనాభాలో ఎక్కువ శాతం యువజనులే కావడంతో నవతరానికి ప్రతినిధిగా మను బాకర్ ను పరిగణిస్తున్నారు. దీనికితోడు మను బాకర్ పేరు ప్రఖ్యాతుల్ని, అందచందాల్ని సొమ్ము చేసుకోడం ద్వారా తమ సంస్థల ఉత్పత్తుల ప్రచారం పెంచుకోడానికి బహుళజాతి సంస్థలు ఎక్కడలేని ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పెప్సీ కో కోటీ 50 లక్షల రూపాయల ఎండార్స్ మెంట్ తో తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా మనును నియమించుకొంది.

మను బాకర్ ముంగిట 40 బ్రాండ్లు...

మను బాకర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోడానికి మొత్తం 40 సంస్థలు పోటీపడుతున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్ తోనే అరంగేట్రం చేసిన మను తన తొలిగే్మ్స్ లో విఫలమైనా..2024 పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుకోగలిగింది. రికార్డుస్థాయిలో రెండు పతకాలతో చరిత్ర సృష్టించింది.

మను కోసం 150 నుంచి 200 బ్రాండ్లు ఆసక్తి చూపుతున్నట్లు ఐవోఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టెయిన్మెంట్ సీఈవో నీరవ్ తోమర్ చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా మను ఫోటోలను తమ ఉత్పత్తుల ప్రచారం కోసం వాడుకొంటున్న సంస్థలకు 50కి పైగా లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు.

ఇప్పటికే 40 సంస్థలు తమకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాలని మను బాకర్ ను ఆహ్వానించాయి. పారిస్ ఒలింపిక్స్ కు ముందు 20 లక్షల రూపాయలు ధర మాత్రమే ఉన్న మను బ్రాండ్ విలువ ఒలింపిక్స్ ముగిసిన తరువాత కోటి రూపాయల నుంచి కోటిన్నరకు చేరినట్లు చెబుతున్నారు.

ఏడాది పొడుగునా ప్రకటనల కోసం కోటిన్నర రూపాయలు, నెల నుంచి 3 నెలల కాలానికి 50 లక్షల రూపాయలు మనుకి చెల్లించే అవకాశం ఉంది. ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించనున్న భారత తొలి, ఏకైక షూటర్ మను బాకర్ మాత్రమే.

First Published:  29 Aug 2024 4:18 AM GMT
Next Story