Telugu Global
Sports

ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ళ 'సూపర్ విన్'!

2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ళ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-6 రౌండ్ తొలిమ్యాచ్ లో సూపర్ విన్ నమోదు చేసింది...

ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ళ సూపర్ విన్!
X

2024-ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ళ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-6 రౌండ్ తొలిమ్యాచ్ లో సూపర్ విన్ నమోదు చేసింది...

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 16 జట్ల ఐసీసీ అండర్ -19 వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్, హాట్ ఫేవరెట్ భారత్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది.

గ్రూప్ లీగ్ టాపర్ గా సూపర్ -6 రౌండ్ చేరిన భారత్ ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ ను సైతం 214 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

ముషీర్ ఖాన్ మరో సెంచరీ....

బ్లూమ్ ఫాంటీన్ వేదికగా ప్రారంభమైన సూపర్ -6 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ పై ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగుల భారీస్కోరు సాధించింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 52 పరుగులు, వన్ డౌన్ ముషీర్ ఖాన్ 131 పరుగులతో భారత్ ప్రత్యర్థి ఎదుట 296 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ముంబై యువబ్యాటర్ ముషీర్ ఖాన్..కివీ బౌలర్లను ఓ ఆటాడుకొన్నాడు. ప్రస్తుత టోర్నీ లీగ్ దశలో తొలిశతకం బాదిన ముషీర్..సూపర్ సిక్స్ రౌండ్ తొలి మ్యాచ్ లోనే

మరో శతకం నమోదు చేయగలిగాడు.

ఒకే ఒక్కడు ముషీర్ ఖాన్...

ముషీర్ ఖాన్ మొత్తం 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు సాధించడం ద్వారా ప్రస్తుత ప్రపంచకప్ లో రెండు సెంచరీలతో సహా 300కు పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

భారత కెప్టెన్ ఉదయ్ సహ్రాన్ 57 బంతుల్లో 2 బౌండ్రీలతో 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

81 పరుగులకే కివీస్ ఆలౌట్...

మ్యాచ్ నెగ్గాలంట 296 పరుగుల భారీస్కోరు చేయాల్సిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు 28.1 ఓవర్లలోనే 81 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా తమజట్టుకు భారీవిజయం అందించారు.

న్యూజిలాండ్ పవర్ ప్లే ఓవర్ల లోనే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయి మరి తేరుకోలేకపోయింది. భారత బౌలర్లలో పేసర్ రాజ్ లింబానీ 17 పరుగులిచ్చి 2 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ సౌమ్య కుమార్ పాండే 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.

214 పరుగుల ఓటమితో న్యూజిలాండ్ మూడో అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకోగలిగింది. కాగా ప్రత్యర్థిజట్లను 200కు పైగా పరుగుల తేడాతో చిత్తు చేయడం భారత్ కు ప్రస్తుత ప్రపంచకప్ లో ఇది మూడోసారి.

సూపర్ - 6 దశ రెండోరౌండ్లో ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడాల్సి ఉంది.

First Published:  31 Jan 2024 5:58 AM GMT
Next Story