Telugu Global
Sports

మహిళా ఆసియాకప్ సెమీఫైనల్లో భారత్

2022 ఆసియా మహిళా టీ-20 సెమీఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ చేరుకొంది. 7 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో 10 పాయింట్లతో టాపర్ గా నిలవడం ద్వారా భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

మహిళా ఆసియాకప్ సెమీఫైనల్లో భారత్
X

2022 ఆసియా మహిళా టీ-20 సెమీఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ చేరుకొంది. 7 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో 10 పాయింట్లతో టాపర్ గా నిలవడం ద్వారా భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న 2022 మహిళల ఆసియాకప్ నాకౌట్ రౌండ్ కు హాట్ ఫేవరెట్ భారత్ చేరుకొంది. మొత్తం 7 ( భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్ లాండ్, మలేసియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ) జట్ల...తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆరుమ్యాచ్ లు ఆడిన భారత్ ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించడం ద్వారా పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో నిలిచింది.

సిల్హౌట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ ఆరవ రౌండ్లో భారత్ 9 వికెట్లతో పసికూన థాయ్ లాండ్ ను చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

భారత స్పిన్ మ్యాజిక్ లో థాయ్ గల్లంతు..

లీగ్ పోటీలో పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించిన థాయ్ లాండ్ జట్టు...పవర్ ఫుల్ భారత్ తో ఈరోజు జరిగిన పోరులో తేలిపోయింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన థాయ్ జట్టు 20 ఓవర్లలో 37 పరుగులకే కుప్పకూలింది.

భారత స్పిన్ త్రయం స్నేహ రాణా 3 వికెట్లు, రాజేశ్వరీ గయక్వాడ్, దీప్తి శర్మ, చెరో 2 వికెట్లు పడగొట్టారు.

థాయ్ బ్యాటర్లలో చాయ్ వాయ్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగింది. థాయ్ లాండ్ ఆఖరి 8 వికెట్లను భారత్ కేవలం 17 పరుగుల వ్యవధిలో పడగొట్టడం విశేషం.

అలవోక విజయం..

38 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ షెఫాలీ వికెట్ నష్టానికే విజయం సొంతం చేసుకోగలిగింది. షెఫాలీ 8 పరుగులకు అవుట్ కాగా...మేఘ్నా రెడ్డి 20 పరుగులు, పూజా వస్త్రకర్ 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

తన కెరియర్ లో వందో టీ-20 మ్యాచ్ ఆడిన స్మృతి మంధానా ఈమ్యాచ్ లో స్టాండిన్ కెప్టెన్ గా వ్యవహరించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయంతో అందుబాటులో లేకపోడంతో జట్టు పగ్గాలను స్మృతి చేపట్టాల్సి వచ్చింది.

రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన ఆరురౌండ్లలో భారత్ 5 విజయాలు, ఓ ఓటమి రికార్డుతో 10 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా,ఎమిరేట్స్, థాయ్ లాండ్ జట్లను ఓడించిన భారత్ కు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మాత్రం పరాజయం తప్పలేదు.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగు స్థానాలలో నిలిచినజట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడనున్నాయి. అక్టోబర్ 16న టైటిల్ సమరం జరుగనుంది.

First Published:  10 Oct 2022 11:09 AM GMT
Next Story