Telugu Global
Sports

భారత మహిళలకు నేటినుంచే ఇంగ్లండ్ ' టెస్ట్ '

భారత్- ఇంగ్లండ్ మహిళాజట్లు సింగిల్ టెస్ట్ మ్యాచ్ షోకి సిద్ధమయ్యాయి. ముంబై వేదికగా ఈరోజు నుంచి నాలుగురోజులపాటు ఈ పోరు జరుగనుంది.

భారత మహిళలకు నేటినుంచే ఇంగ్లండ్  టెస్ట్
X

భారత్- ఇంగ్లండ్ మహిళాజట్లు సింగిల్ టెస్ట్ మ్యాచ్ షోకి సిద్ధమయ్యాయి. ముంబై వేదికగా ఈరోజు నుంచి నాలుగురోజులపాటు ఈ పోరు జరుగనుంది.

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 సిరీస్ లకు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు..సింగిల్ టెస్ట్ మ్యాచ్ పోరుకు సై అంటున్నారు. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నేటినుంచి నాలుగురోజులపాటు జరిగే ఈమ్యాచ్ లో స్పిన్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లు కానున్నారు.

మహిళా క్రికెటర్లకు సాంప్రదాయ టెస్టుమ్యాచ్ ఆడే అవకాశం అతితక్కువగా దొరుకుతుంది. వన్డేలు, టీ-20 మ్యాచ్ లకే పరిమితమైన మహిళా క్రికెటర్లు ఏడాదికి రెండో , మూడో టెస్టులు మాత్రమే ఆడుతూ రావడం సాధారణ విషయంగా మారింది.

50 ఓవర్ల వన్డే, ధూమ్ ధామ్ టీ-20 మ్యాచ్ లు ఆడటమే మహిళా క్రికెటర్ల సత్తాకు పరీక్షగా నిలిచిన నేపథ్యంలో నాలుగురోజులపాటు జరిగే టెస్టు మ్యాచ్ లు ఆడటం నిజంగా కత్తిమీద సాములాంటిదే.

పురుషులతో పోల్చుకొంటే శారీరకంగా, మానసికంగా పలురకాల సమస్యలు ఎదుర్కొనే మహిళలకు వరుసగా నాలుగురోజులపాటు క్రికెట్ ఆడగలిగే ఫిట్ నెస్ సైతం లేని కారణంగానే సింగిల్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ లను మాత్రమే ఐసీసీ నిర్వహిస్తూ వస్తోంది.

భారత మహిళాజట్టుకు సీజన్లో ఆఖరి టెస్టు...

ప్రస్తుత 2023 క్రికెట్ సీజన్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళాజట్టు తన ఆఖరి టెస్టుమ్యాచ్ కు సిద్ధమయ్యింది. నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా నేటినుంచే జరిగే పోరులో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.

ఇటీవలే ముగిసిన టీ-20 సిరీస్ లో 2-1తో నెగ్గిన ఇంగ్లండ్ జట్టు..ఈ ఏకైక టెస్టు పోరులోనూ సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉంది.

1986 నుంచి టెస్టు సమరం..

భారత్- ఇంగ్లండ్ మహిళాజట్ల నడుమ 1986 నుంచి టెస్టుమ్యాచ్ లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ ఆడిన 14 టెస్టుల్లో ఒక్క ఓటమి మాత్రమే చవిచూసింది.

చివరిసారిగా ఈ రెండుజట్లూ 2021 లో బ్రిస్టల్ వేదికగా ఆడిన టెస్టు డ్రాగా ముగిసింది. భారత ఓపెనర్లు స్మృతి మందన 78, షెఫాలీ వర్మ 96, 63 పరుగుల స్కోర్లతో రాణించారు.

ప్రస్తుత ఈ టెస్టుమ్యాచ్ లో భారతజట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ తొలిసారిగా నాయకత్వం వహిస్తోంది. స్పిన్ బౌలింగే ప్రధాన బలంగా ఇంగ్లండ్ ను కంగుతినిపించాలన్న వ్యూహంతో భారత్ పోటీకి దిగుతోంది.

స్మృతి మందన పైనే భారత్ భారం...

ఆస్ట్ర్రేలియాతో 2021 సెప్టెంబర్ నెలలో చివరిసారిగా టెస్టుమ్యాచ్ ఆడిన భారత్ 36 నెలల విరామం తరువాత తిరిగి మరోసారి టెస్టు బరిలోకి దిగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మందన ఆ మ్యాచ్ లో 127 పరుగుల స్కోరుతో టాపర్ గా నిలిచింది.

ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా లాంటి మేటిజట్లపై భారీస్కోర్లు సాధించిన రికార్డును స్మృతి ప్రస్తుత టెస్టు మ్యాచ్ లోనూ కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.రోజుకు 100 ఓవర్లు చొప్పున నాలుగురోజులపాటు జరిగే ఈ టెస్టులో రెండుజట్లూ కలసి నాలుగు ఇన్నింగ్స్ లో 400 ఓవర్లు ఆడాల్సి ఉంది.

భారత్ తరపున లెఫ్టామ్ స్పిన్నర్ సైకా ఇష్క్ కీలకం కానుంది. కర్నాటక యువబ్యాటర్ సుభాష్ సతీశ్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేయనుంది. జైమీమా రోడ్రిగేజ్, హర్లన్ డియోల్, వికెట్ కీపర్ రిచా ఘోశ్ సైతం రాణించాలన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. స్పిన్ విభాగంలో స్నేహ రాణా, దీప్తి శర్మ, సైకా త్రయం నుంచి ఇంగ్లండ్ బ్యాటర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.

100వ టెస్టుకు ఇంగ్లండ్...

భారత్ తో పోల్చిచూస్తే ఇంగ్లండ్ జట్టుకే ఎక్కువ టెస్టుమ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్ ప్లేయర్లు నాట్ స్కీవర్ బ్రంట్, హీథర్ నైట్, డాని వెయిట్, కేటీ క్రాస్, సోఫీ ఈక్లెస్టెన్ లతో పాటు మియా బోషియర్, క్రిస్టీ గోర్డాన్ ఇంగ్లండ్ కు కీలకం కానున్నారు.

ఇంగ్లండ్ జట్టుకు ఇది 100వ టెస్టుమ్యాచ్ కానుండడంతో విజయమే లక్ష్యంగాపోటీకి దిగుతోంది. 1995 లో జంషెడ్ పూర్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ పై 2 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ కు 14 టెస్టుల్లో ఒకే ఒక్క గెలుపు మాత్రమే ఉంది. మహిళా క్రికెట్ చరిత్రలో వంద టెస్టులు ఆడిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డుల్లో చేరనుంది.

అమోల్ ముజుందార్ కోచ్ గా, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఆతిథ్య భారత్ వచ్చే నాలుగురోజులపాటు స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే..ఇంగ్లండ్ పై ఆధిపత్యం ప్రదర్శించడం ఏమంత కష్టం కాబోదు.

First Published:  14 Dec 2023 4:30 AM GMT
Next Story