Telugu Global
Sports

ఆసియా బ్యాడ్మింటన్లో భారతజోడీకి 58 ఏళ్ల తర్వాత స్వర్ణం!

ఆసియా బ్యాడ్మింటన్లో బంగారు పతకం సాధించాలన్న 58 సంవత్సరాల భారత కలను యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి సాకారం చేశారు.

ఆసియా బ్యాడ్మింటన్లో భారతజోడీకి 58 ఏళ్ల తర్వాత స్వర్ణం!
X

ఆసియా బ్యాడ్మింటన్లో బంగారు పతకం సాధించాలన్న 58 సంవత్సరాల భారత కలను యువజోడీ సాత్విక్ సాయిరాజ్- Chirag Shetty సాకారం చేశారు.

భారత బ్యాడ్మింటన్ చరిత్రలోకి సంచలన విజయాలు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. ఇప్పటి వరకూ మహిళల సింగిల్స్ లో భారత పతాకాన్ని సైనా, సింధు తమ అసాధారణ విజయాలతో రెపరెపలాడిస్తూ వస్తే..ఆ బాధ్యతను పురుషుల డబుల్స్ లో యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి తీసుకొన్నారు.

ఇప్పటికే థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో భారత్ కు అరుదైన పతకాలు అందించిన ఈ డబుల్స్ జోడీ...దుబాయ్ వేదికగా జరిగిన 2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో విశ్వరూపమే ప్రదర్శించారు.

58 ఏళ్ల తర్వాత బంగారు పతకం...

అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో భారత్ చివరిసారిగా 1971లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాతి ఐదుదశాబ్దాల కాలంలో కనీసం ఒక్క పతకానికీ నోచుకోలేకపోయింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ దిగ్గజాలు ఇండోనీషియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, థాయ్ లాండ్, చైనా దేశాలకు చెందిన క్రీడాకారులతో ఆసియా బ్యాడ్మింటన్ పోటీలు ఒలింపిక్స్ నే తలదన్నేలా ఉంటాయి. ప్రపంచ, ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం కంటే ఆసియా టోర్నీలలో పతకాలు నెగ్గటమే కష్టమని బ్యాడ్మింటన్ పండితులు చెబుతూ ఉంటారు.

1965లో దినేశ్ ఖన్నాకు స్వర్ణం...

లక్నో వేదికగా 1965లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో భారత దిగ్గజ ఆటగాడు దినేశ్ ఖన్నా బంగారు పతకం సాధించారు. ఫైనల్లో థాయ్ లాండ్ ప్లేయర్ సాంగోబ్ రత్తానుసోర్న్ ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచారు.

ఆ తర్వాత 1971 ఆసియాటోర్నీ పురుషుల డబుల్స్ లో భారత జోడీ దీపు ఘోష్- రామన్ ఘోష్ కాంస్య పతకం సాధించారు. 1971 నుంచి 2022 వరకూ ఆసియా బ్యాడ్మింటన్ పోటీలలో భారత్ కు మరే పతకమూ దక్కలేదు.

ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, సయ్యద్ మోడీ, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి హేమాహేమీలే ఆసియా బ్యాడ్మింటన్లో పతకాలు సాధించడంలో విఫలమయ్యారు.

భారత క్రీడాకారులు ప్రపంచ, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటి క్రీడల్లో పతకాలు సాధిస్తూ వచ్చినా..ఆసియా బ్యాడ్మింటన్ పోటీలలో మాత్రం విఫలమవుతూ వచ్చారు.

అయితే..ఆలోటును పూడ్చుకోడానికి 2023 దుబాయ్ -ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

సాత్విక్- చిరాగ్ సరికొత్త చరిత్ర...

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ గత రెండేళ్లుగా సంచలన విజయాలతో ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు.

ప్రపంచ పురుషుల టీమ్ చాంపియన్ల కోసం నిర్వహించే థామస్ కప్ (2022 ) ను భారత్ తొలిసారిగా గెలుచుకోడంలో డబుల్స్ జోడీ సాత్విక్- చిరాగ్ ప్రధానపాత్ర వహించారు.

ఆ తర్వాత జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్యపతకం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత పురుషుల తొలిజోడీగా చరిత్ర సృష్టించారు. ఇక..

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో సైతం అలవోకగా బంగారు పతకం గెలుచుకోడం ద్వారా ప్రపంచ 6వ ర్యాంక్ జోడీగా నిలిచారు.

దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ లోని షేక్ రషీద్ బిన్ హమ్ దాన్ ఇన్ డోర్ వేదికగా జరిగిన 2023 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో 6వ సీడ్ జోడీగా టైటిల్ వేటకు దిగారు. తొలిరౌండ్ నుంచి నిలకడగా రాణిస్తూ క్వార్టర్ ఫైనల్లో...తమకంటే అపారఅనుభవం ఉన్న ఇండోనీషియా జోడీ హెండ్రా- అహ్ సాన్ లను రెండు గేమ్ ల పోరులోనే చిత్తు చేశారు. .21-11, 21-12తో విజేతలుగా నిలవడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టారు.

ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీస్ పోరులో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్- వాంగ్ చీ- లిన్ ల నుంచి వాకోవర్ లభించడంతో బంగారు పతకం పోరులో నిలిచారు.

ఫైనల్లో పోరాడినెగ్గిన భారతజోడీ...

బంగారు పతకం కోసం మలేసియాకు చెందిన 8వ ర్యాంక్ జోడీ వన్ యూ సిన్- టే ఈ లతో నువ్వానేనా అన్నట్లుగా గంటా 7 నిముషాలపాటు సాగిన సమరంలో

సంచలన విజయం సాధించారు. తొలిగేమ్ ను 16-21తో చేజార్చుకొన్న సాత్విక్- చిరాగ్ జోడీ కీలక రెండోగేమ్ ను 21-17తో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీలుగా నిలిచారు. విజేతను నిర్ణయించే ఆఖరి గేమ్ నువ్వానేనా అన్నరీతిలో సాగింది. చివరకు భారతజోడీనే 21-19తో నెగ్గి బంగారు పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

పురుషుల డబుల్స్ లో ఓ భారతజోడీ సాధించిన అత్యుత్తమ, అతిపెద్ద విజయం ఇదే కావటం విశేషం.

2011 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ లో భారతజోడీ గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించిన తర్వాత..మరో భారత జోడీ సాధించిన అపూర్వ విజయం ఇదే.

ఆసియా బ్యాడ్మింటన్లో 58 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు బంగారు పతకం సాధించిన డబుల్స్ జోడీ సాత్విక్- చిరాగ్ లకు 20 లక్షల రూపాయలు నజరానాగా ఇస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది.

పారిస్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ తో పాటు రానున్న పలు అంతర్జాతీయ టోర్నీలలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి మరిన్ని పతకాలు, సంచలన విజయాలు సాధించినా ఆశ్చర్యంలేదు.

First Published:  1 May 2023 5:01 AM GMT
Next Story