Telugu Global
Sports

మహిళా ప్రపంచకప్ లో నేడు పాక్ తో భారత్ పోరు!

2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ తొలిసమరానికి చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కేప్ టౌన్ వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6-30 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

మహిళా ప్రపంచకప్ లో నేడు పాక్ తో భారత్ పోరు!
X

మహిళా ప్రపంచకప్ లో నేడు పాక్ తో భారత్ పోరు!

2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ తొలిసమరానికి చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కేప్ టౌన్ వేదికగా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6-30 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

మహిళా టీ-20 ప్రపంచకప్ టైటిల్ కు గత టోర్నీ రన్నరప్ భారత్ గురిపెట్టింది. దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభమైన 2023 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీ గ్రూపులీగ్ లో..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తొలిపోరులో భారత్ తలపడనుంది.

కీలక ప్లేయర్లకు గాయాల టెన్షన్...

ఆస్ట్ర్రేలియా వేదికగా గతేడాది ముగిసిన టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో ఓటమి పొందిన భారత్ ఈ ఏడాది టోర్నీ ప్రారంభానికి ముందే గాయాలతో సతమతమవుతోంది.

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు ( వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, భారత్ ) సిరీస్ సమరం ఫైనల్లో ఆతిథ్యజట్టు చేతిలో పరాజయం పొందిన భారతజట్టు..కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా, ఓపెనర్ జెమీమా రోడ్రిగేజ్ గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ ముగ్గురూ పాక్ తో ఈ రోజు జరిగే ప్రారంభమ్యాచ్ లో పాల్గొనటం అనుమానంగా మారింది.

ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి అగ్రశ్రేణిజట్ల ముందు కీలక మ్యాచ్ ల్లో తేలిపోతున్న భారత్ కు...పాకిస్థాన్ ప్రత్యర్థిగా మెరుగైన రికార్డే ఉంది. అయితే..పాక్ జట్టును తక్కువగా అంచనా వేస్తే మాత్రం భారత్ కు కష్టాలు తప్పవని గత రికార్డులే చెబుతున్నాయి.

మహిళా ఐపీఎల్ నేపథ్యంలో....

భారత క్రికెట్ బోర్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ఐపీఎల్ తొలివేలానికి కొద్దిగంటల ముందు జరుగుతున్న ఈ ప్రపంచకప్ మ్యాచ్ భారత జట్టు సభ్యుల ఆత్మవిశ్వాసానికి, సత్తాకు సవాలుగా నిలువనుంది.

భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వెన్ను నొప్పితో, ఓపెనర్ స్మతి మందానా వేలి గాయంతో బాధపడుతున్నారు. జెమీమాను సైతం ఫిట్ నెస్ సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వింగ్ బౌలర్ రేణుక సింగ్‌ మినహా మిగిలిన భారత బౌలర్లు, బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోడం లీగ్ తొలిమ్యాచ్ పై ప్రభావం చూపనుంది.

ఇదీ..భారత్ మహిళల రికార్డు...

గత ఏడు ప్రపంచకప్ టోర్నీలలో భారత్ మూడుసార్లు సెమీఫైనల్స్ ( 2009, 2010, 2016 ), ఓసారి (2020 ) ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది.

మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, వెస్టిండీస్ తో పాటు న్యూజిలాండ్ సైతం అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక ఐర్లాండ్ జట్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాయి.

గ్రూపు-బీలో భారత్ పోటీ..

టోర్నీలో తలపడుతున్న మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశ పోటీలు నిర్వహిస్తారు. గ్రూపు-ఏ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, ఆతిథ్య దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతుంటే..గ్రూప్ -బీలో భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఢీ కొంటున్నాయి.

దక్షిణాఫ్రికాలోని మూడు వేదికలకే ప్రపంచకప్ టోర్నీని పరిమితం చేశారు.

ఇప్పటి వరకూ అత్యధిక ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన ఘనత ఆస్ట్ర్లేలియాకు మాత్రమే ఉంది. వెస్టిండీస్ సైతం విశ్వవిజేతగా నిలువగలిగింది. ప్రస్తుత 2023 ప్రపంచకప్ లో సైతం ఆస్ట్ర్రేలియానే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.

భారతజట్టు తన గ్రూపులీగ్ లో పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లలో మూడింటిని ఓడించగలిగితేనే సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

First Published:  12 Feb 2023 7:40 AM GMT
Next Story