Telugu Global
Sports

గెలుపే లక్ష్యంగా నేడు భారత రెండో టీ-20

వెస్టిండీస్ తో పాంచా పటాకా టీ-20 సిరీస్ లో తొలిగెలుపు కోసం టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. గయానా వేదికగా ఈ రోజు జరిగే రెండో పోరులో విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతోంది.

గెలుపే లక్ష్యంగా నేడు భారత రెండో టీ-20
X

వెస్టిండీస్ తో పాంచా పటాకా టీ-20 సిరీస్ లో తొలిగెలుపు కోసం టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. గయానా వేదికగా ఈ రోజు జరిగే రెండో పోరులో విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతోంది....

కరీబియన్ గడ్డపై ప్రస్తుత 2023 సిరీస్ లో తొలి టీ-20 విజయానికి భారత్ ఎదురుచూస్తోంది. స్పిన్ బౌలర్ల అడ్డా గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో టీ-20లో వెస్టిండీస్ తో అమీతుమీకి సిద్ధమయ్యింది.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తారుబా బ్రయన్ లారా స్టేడియం వేదికగా ముగిసిన తొలి పోరులో 4 పరుగుల తేడాతో ఓడిన భారత్ దెబ్బతిన్న బెబ్బులిలా రెండోపోరుకు సై అంటోంది.

యశస్వి జైశ్వాల్ కు చోటు దక్కేనా?

తొలిపోరులో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలం కావడంతో...శుభ్ మన్ గిల్ కు జంటగా మరో యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను భారత్ బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదు. అయితే..మిడిలార్డర్లో ఎవరిని తుదిజట్టు నుంచి తప్పిస్తారన్నది అనుమానంగా మారింది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లలో ఒకరిని పక్కన పెడితే కానీ..యశస్వీకి తుదిజట్టులో చేరే అవకాశం లేదు.

తొలి టీ-20లో 150 పరుగుల స్కోరును సాధించడంలో తడబడిన భారత్ ఈ రోజు జరిగే రెండోమ్యాచ్ లో మెరుగైన బ్యాటింగ్ తో గెలుపు సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభంతో పాటు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్థిక్ పాండ్యా, సూపర్ హిట్టర్ సంజు శాంసన్ లలో ఏ ఇద్దరు రాణించినా కరీబియన్ బౌలింగ్ ఎటాక్ కు పరీక్ష తప్పదు.

భారత బ్యాటింగ్ ఆర్డర్లో మొదటి ఏడుగురు మాత్రమే పరుగులు చేయగల సత్తా ఉన్నవారు కాగా..ఆఖరి నలుగురు టెయిల్ ఎండర్లు కావడం చర్చనీయాంశంగా మారింది.లోవర్ ఆర్డర్ నుంచి పరుగులు ఆశించడం చేజింగ్ సమయంలో జట్టు అవకాశాలను దెబ్బతీస్తోంది.

కరీబియన్ తురుపుముక్క పూరన్...

మరోవైపు..కెప్టెన్ రోవమన్ పావెల్, వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఓపెనర్ బ్రెండన్ కింగ్, హేట్ మేయర్ పూర్తిస్థాయి ఫామ్ లో ఉండడంతో కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా కనిపిస్తోంది. ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ ను తుదిజట్టులోకి తీసుకోడం ద్వారా స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ ను పటిష్టం చేసుకోవాలని వెస్టిండీస్ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

గయానా వేదికగా ఆడిన వన్డే మ్యాచ్ లో 73 పరుగులు, టీ-20 మ్యాచ్ లో 74 నాటౌట్ స్కోర్లు సాధించిన నికోలస్ పూరన్ భారత్ తో జరిగే ఈ కీలకమ్యాచ్ లో అదేజోరు కొనసాగించాలన్నలక్ష్యంతో ఉన్నాడు.

స్పిన్ బౌలర్లకు చేతినిండా పనే!

మ్యాచ్ కు వేదికగా ఉన్న గయానా ప్రావిడెన్స్ స్టేడియం పిచ్..స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండడంతో రెండుజట్లూ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పోరుకు సిద్ధం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

గయానా స్లో పిచ్ పైన మీడియం పేసర్ల ప్రభావం నామమాత్రమే కానుంది. మ్యాచ్ మొదటి భాగం ప్రారంభఓవర్ల సమయంలో వర్షంతో అంతరాయం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ కీలక సమరం ప్రారంభంకానుంది. భారత్ మ్యాచ్ నెగ్గి సిరీస్ లో 1-1తో సమఉజ్జీగా నిలువగలుగుతుందా? లేక ఆతిథ్య కరీబియన్ జట్టు వరుసగా రెండో విజయంతో సిరీస్ పై 2-0తో పట్టు బిగిస్తుందా? తెలుసుకోవాలంటే..కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  6 Aug 2023 5:00 AM GMT
Next Story