Telugu Global
Sports

విండీస్ తో లోస్కోరింగ్ పోరులో భారత్ బోణీ!

వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను 3వ ర్యాంకర్ భారత్ గెలుపుతో మొదలు పెట్టింది. బార్బడోస్ వేదికగా జరిగిన తొలిపోరులో 5 వికెట్లతో నెగ్గి 1-0తో పైచేయి సాధించింది.

విండీస్ తో లోస్కోరింగ్ పోరులో భారత్ బోణీ!
X

వెస్టిండీస్ తో తీన్మార్ వన్డే సిరీస్ ను 3వ ర్యాంకర్ భారత్ గెలుపుతో మొదలు పెట్టింది. బార్బడోస్ వేదికగా జరిగిన తొలిపోరులో 5 వికెట్లతో నెగ్గి 1-0తో పైచేయి సాధించింది.

ప్రపంచ మాజీ చాంపియన్ వెస్టిండీస్ ప్రత్యర్థిగా వన్డేలలో భారత విజయపరంపర కొనసాగుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాకంగా రోహిత్ సేన ఈ తీన్మార్ సిరీస్ లో పాల్గొంటోంది.

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరును భారత టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాల వేదికగా చేసుకొంది. బ్యాటింగ్ ఆర్డర్లో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను మిడిలార్డర్లో ఉంచి..ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ లాంటి ప్లేయర్లకే అవకాశం ఇచ్చింది.

భారత స్పిన్ జోడీకి విండీస్ దాసోహం....

అంతకుముందు టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్..తుదిజట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లకు అవకాశమిచ్చింది. సంజు శాంసన్, యజువేంద్ర చాహల్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. యువపేసర్ ముకేశ్ కుమార్ కు వన్డే అరంగేట్రం అవకాశం దక్కింది.

స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉన్న పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ తేలిపోయింది. 50 ఓవర్ల ఈ మ్యాచ్ లో కేవలం 23 ఓవర్లకే విండీస్ 114 పరుగుల స్కోరుకే కుప్పకూలింది.

కెప్టెన్ షాయ్ హోప్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ 17, కీల్ మేయర్స్ 2, వన్ డౌన్ అత్నాజే 22, స్టార్ హిట్టర్ హెట్ మేయర్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

భారత స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లకు ఎదురే లేకపోయింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ కేవలం 4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు, జడేజా 6 ఓవర్లలో 37 పరుగులకు 3 వికెట్లు, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, హార్థిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

ఓపెనర్లుగా కొత్త జోడీ...

50 ఓవర్లలో 115 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ..బ్యాటింగ్ ఆర్డర్లో భారీగా మార్పులు చేసింది. మిడిలార్డర్ ను టాపార్డర్ గా మార్చి వేసింది.

ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్- ఇషాన్ కిషన్ జోడీ పరుగుల వేటకు దిగారు. గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 19, హార్థిక్ పాండ్యా 5, శార్దూల్ ఠాకూర్ 1 పరుగుకు అవుట్ కాగా..ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 52 పరుగుల స్కోరుకు చిక్కాడు.

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 21 బంతుల్లో 16, కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 12 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికే విజయం సొంతం చేసుకోగలిగింది.

కరీబియన్ బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్నర్ గుకేశ్ మోతీకి 2, యానిక్ కరిహా, సీల్స్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

విండీస్ పై వన్డేలలో వరుసగా 9వ గెలుపు

వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ కు వన్డేలలో ఇది వరుసగా 9వ గెలుపు కావడం విశేషం. అంతేకాదు 50 ఓవర్ల మ్యాచ్ లో అధిక బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన నాలుగోజట్టుగా భారత్ నిలిచింది.

2013లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా మరో 180 బంతులు మిగిలిఉండగానే శ్రీలంక రికార్డు విజయం సాధిస్తే..ప్రస్తుత తొలివన్డేలో భారత్ మరో 163 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలువగలిగింది.

2003లో కెనడాపై న్యూజిలాండ్ 162, 2015లో ఆస్ట్ర్రేలియాపై న్యూజిలాండ్ 161 బంతులు మిగిలిఉండగానే విజయాలు నమోదు చేశాయి.

140 వన్డేలలో 71వ విజయం..

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ తో భారత్ ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ ఆడిన 140 మ్యాచ్ ల్లో ఇది 71వ గెలుపు. భారత్ పై విండీస్ కు 63 విజయాలు మాత్రమే ఉన్నాయి. రెండుమ్యాచ్ లు టై కాగా..నాలుగుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 15 వన్డే సిరీస్ ల్లోనూ విజేతగా నిలుస్తూ వచ్చిన భారత్ వరుసగా 16వ సిరీస్ కు గురి పెట్టింది. 2006లో చివరిసారిగా భారత్ పై నెగ్గిన కరీబియన్ టీమ్ 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో దారుణంగా విఫలమయ్యింది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 3, వెస్టిండీస్ 10 స్థానాలలో కొనసాగుతున్నాయి. ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని రెండోవన్డే..కెన్సింగ్టన్ ఓవల్ వేదికగానే శనివారం జరుగనుంది.

First Published:  28 July 2023 2:57 AM GMT
Next Story