Telugu Global
Sports

నేడే భారత్- వెస్ట్టిండీస్ వందో టెస్ట్!

భారత్- వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డుకు ఈరోజు తెరలేవనుంది.

నేడే భారత్- వెస్ట్టిండీస్ వందో టెస్ట్!
X

నేడే భారత్- వెస్ట్టిండీస్ వందో టెస్ట్!

క్రికెట్ దిగ్గజాలు భారత్, వెస్టిండీస్ వందో టెస్టుమ్యాచ్ కు సై అంటున్నాయి. ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఈరోజు నుంచి జరిగే ఆఖరిటెస్టులో తలపడబోతున్నాయి.

భారత్- వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డుకు ఈరోజు తెరలేవనుంది. 1970 దశకంలో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్, ప్రస్తుత అగ్రశ్రేణిజట్లలో ఒకటైన

వెస్టిండీస్ జట్ల టెస్టు క్రికెట్ ప్రయాణం వందోటెస్టు మైలురాయిని చేరింది.

1948 నుంచి 2023 టెస్ట్ లీగ్ సిరీస్ లోని డోమనికా మ్యాచ్ వరకూ ఈ రెండుజట్లూ 99 టెస్టుల్లో తలపడ్డాయి.

అప్పుడు విండీస్, ఇప్పుడు భారత్...

సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, వెస్లీ హాల్, చార్లీ గ్రిఫిత్స్, డెస్మండ్ హేన్స్, లాన్స్ గిబ్స్, గార్డన్ గ్రీనిడ్జ్, సర్ వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, యాండీ రాబర్ట్స్ , బ్రియాన్ లారా,

మైకేల్ హోల్డింగ్ , కోట్నీ వాల్ష్ , క్రిస్ గేల్ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన ఘనత వెస్టిండీస్ కు ఉంది. నలుగురు ఫాస్ట్ బౌలర్ల దళంతో ప్రత్యర్థిజట్లను కేవలం మూడురోజుల ఆటలోనే చిత్తు చేస్తూ టెస్టు క్రికెట్లో రారాజుగా ఓ వెలుగువెలిగిన కరీబియన్ క్రికెట్ ప్రభ గత దశాబ్దకాలంగా మసకబారిపోయింది.

ప్రస్తుతం వెస్టిండీస్ టెస్టు ర్యాంక్ 8వస్థానానికి పడిపోయింది.

మరోవైపు..1990 దశకం నుంచి వెస్టిండీస్ ప్రత్యర్థిగా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత్ ప్రస్తుతం టాప్ ర్యాంకర్ గా ఉంది. ఐసీసీ టెస్టులీగ్ మొదటి రెండుటోర్నీలలో భారత్ రన్నరప్ గా నిలుస్తూ వచ్చింది.

75 ఏళ్లు...99 టెస్టులు..

1948 సిరీస్ లో భారత్, వెస్టిండీస్ జట్లు తొలిసారిగా తలపడ్డాయి. గత 75 సంవత్సరాల కాలంగా ఈ రెండుజట్లూ క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతూ వస్తున్నాయి.

అయితే..వెస్టిండీస్ ప్రత్యర్థిగా తన తొలిటెస్టు, సిరీస్ విజయం సాధించడానికి భారత్ 23 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 2023 టెస్టు లీగ్ రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు వరకూ భారత్, విండీస్ 99 టెస్టుల్లో తలపడితే కరీబియన్ జట్టు 30 విజయాలు, భారత్ 23 విజయాల రికార్డుతో ఉన్నాయి. మరో 46 టెస్టులు డ్రాగా ముగిశాయి.

డోమనికా వేదికగా జరిగిన ఐదురోజులటెస్టు మూడోరోజు ఆటలోనే ఆతిథ్య వెస్టిండీస్ ను భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 1-0తో పైచేయి సాధించింది.

సిరీస్ స్వీపే లక్ష్యంగా.....

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. తొలిటెస్టు జోరునే ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ వేదికగా జరిగే రెండోటెస్టులోనూ కొనసాగించగలమన్న ధీమాతో ఉంది.

100వ టెస్టుగా జరుగనున్న ఈమ్యాచ్ తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు జరిగే అవకాశం లేకపోలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా తెలిపాడు.

వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని వాతావరణంలో ట్రినిడాడ్ టెస్టు జరుగనుందని, మ్యాచ్ రోజున వాతావరణాన్ని బట్టి తుదిజట్టు లో మార్పులు చేర్పులు ఉంటాయని రోహిత్ వివరించాడు.

మరోవైపు..వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాత్రం బ్రాత్ వైయిట్ నాయకత్వంలో 13 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆఖరిమ్యాచ్ లో భారత్ ను నిలువరించాలన్న పట్టుదలతో ఉంది.

భారత ఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డుల కోసం తహతహలాడుతున్నారు.

మ్యాచ్ వేదిక ట్రినిడాడ్ క్వీన్స్ పార్క్ వేదికగా భారత్ కు పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన రికార్డు ఉంది. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టులోనూ భారీవిజయం సాధించగలమన్న ధీమా భారతజట్టులో కనిపిస్తోంది.

వందటెస్టుల మూడో ప్రత్యర్థి వెస్టిండీస్..

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో వందవటెస్టులో తలపడబోతున్న భారత మూడో ప్రత్యర్థిగా వెస్టిండీస్ రికార్డుల్లో చేరనుంది. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 131 టెస్టులు, ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా 107 టెస్టులు ఆడిన భారత్...వెస్టిండీస్ తో వందో టెస్టు ఆడటానికి సిద్ధమయ్యింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ 59 టెస్టుల్లో మాత్రమే తలపడటం విశేషం.

First Published:  20 July 2023 5:39 AM GMT
Next Story