Telugu Global
Sports

నేటినుంచే భారత్- శ్రీలంక టీ-20 సిరీస్!

2023 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ను టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ గెలుపు ఆరంభించాలని భావిస్తోంది. ముంబై వేదికగా ఈరోజు జరిగే తొలిపోరులో ఆసియా చాంపియన్ శ్రీలంకతో తలపడనుంది.

India vs Sri Lanka T-20 series from today
X

నేటినుంచే భారత్- శ్రీలంక టీ-20 సిరీస్!

2023 అంతర్జాతీయ క్రికెట్ సీజన్ ను టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ గెలుపు ఆరంభించాలని భావిస్తోంది. ముంబై వేదికగా ఈరోజు జరిగే తొలిపోరులో ఆసియా చాంపియన్ శ్రీలంకతో తలపడనుంది....

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ కొత్తసంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది. ఆసియా చాంపియన్ శ్రీలంకతో జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలిపోరులో ఈ రోజు తలపడనుంది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

Advertisement

యువరక్తంతో భారత్...

హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా భారత్ బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్, రితురాజ్ గయక్వాడ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రన్ మాలిక్ లాంటి పలువురు యువఆటగాళ్లతో కేరింతలు కొడుతోంది.

మరో 18 మాసాలలో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ నెగ్గితీరాలన్న పట్టుదలతో ప్రస్తుత ఈ సిరీస్ తో సన్నాహాలు మొదలు పెట్టింది.

Advertisement

ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు తగిన అవకాశాలు ఇవ్వటమే లక్ష్యంగా జట్టును ఎంపిక చేసింది. సూపర్ స్టార్ క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లేకుండా శ్రీలంకతో సిరీస్‌లో బరిలోకి దిగుతున్న భారత్‌కు హార్దిక్‌ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. భవిష్యత్‌ టీ20 కెప్టెన్‌గా భావిస్తున్న పాండ్యా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంచలన విజయాలతో అంచనాలకు భిన్నంగా రాణిస్తున్న లంక..భారత్‌ను నిలువరించాలన్న పట్టుదలతో ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య ఈరోజు రాత్రి 8 గంటలకు సిరీస్ కు తెరలేవనుంది.

యంగ్ గన్స్ కు భలే చాన్స్...

దేశవాళీ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తున్న యువఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, జార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌, పేసర్ ముకేశ్‌కుమార్‌ సత్తాచాటాలని చూస్తున్నారు. మరోవైపు అంచనాలను తలకిందులు చేస్తూ ఆసియా కప్‌ విజేతగా నిలిచిన శ్రీలంక మరోసారి భారత్‌కు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.

భారతజట్టు తొలిసారిగా ఓ యువఓపెనింగ్ జోడీకి అవకాశమిస్తోంది.

ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ జోడీ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో మెరుపు డబుల్‌ సెంచరీతో కదంతొక్కిన కిషన్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. గైక్వాడ్‌ జతగా కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే..శుభ్‌మన్‌ గిల్‌ అరంగేట్రానికి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడో డౌన్‌లో సూర్యకుమార్‌, ఆ తర్వాత దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యాతో మిడిలార్డర్‌లో బలంగా కనిపిస్తోంది.

ఒక వేళ సంజును కాదనుకుంటే ఆల్ రౌండర్ దీపక్ హుడాకు చాన్స్ దక్కే అవకాశం ఉంది.

బౌలింగ్‌ విభాగంలో భారత్ తరపున అర్ష్‌దీప్‌సింగ్‌, హర్షల్‌పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ పేస్‌ దళాన్ని నడిపించనుండగా, లెగ్ స్పిన్నర్‌ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్‌ బలంగా ఉండాలని ఒకవేళ భావిస్తే ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ వైపు మొగ్గుచూపచ్చు.

ఆత్మవిశ్వాసంతో శ్రీలంక..

షనక నాయకత్వంలోని శ్రీలంకజట్టు యువఆటగాళ్లతో ఉరకలేస్తోంది. లంక లీగ్‌లో మెరుపులు మెరిపించిన అవిష్క ఫెర్నాండో, చమికా కరుణరత్నె, సదీరా సమరవిక్రమపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ లో సైతం శ్రీలంక సమతూకంతో కనిపిస్తోంది.

దుబాయ్ వేదికగా గతేడాది ముగిసిన ఆసియాకప్ టీ-20 టోర్నీలో భారత్ ను కంగుతినిపించిన శ్రీలంక మరోసారి అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో పోటీకి దిగుతోంది.

ఇక..అంతర్జాతీయ టీ-20 తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ టాప్ ర్యాంకర్ గా ఉంటే..శ్రీలంక 8వ ర్యాంకులో కొనసాగుతోంది. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే..భారత్ 17 విజయాలు, 8 పరాజయాల రికార్డుతో ఉంది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈపోరులో టాస్ నెగ్గిన జట్టు చేజింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మంచుప్రభావం కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది.

సిరీస్ లోని రెండో మ్యాచ్ జనవరి 5న పూణే, ఆఖరి టీ-20 జనవరి 7న రాజ్ కోట వేదికగా జరుగనున్నాయి.

Next Story