Telugu Global
Sports

నేడు 7వ రౌండ్ పోరు..భారతజోరుకు శ్రీలంక బేజారేనా?

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా 7వ విజయానికి గురిపెట్టింది. ముంబై వేదికగా ఈ రోజు జరిగే పోరులో మాజీ చాంపియన్ శ్రీలంక పనిపట్టడానికి సిద్ధమయ్యింది.

నేడు 7వ రౌండ్ పోరు..భారతజోరుకు శ్రీలంక బేజారేనా?
X

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా 7వ విజయానికి గురిపెట్టింది. ముంబై వేదికగా ఈ రోజు జరిగే పోరులో మాజీ చాంపియన్ శ్రీలంక పనిపట్టడానికి సిద్ధమయ్యింది.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. ప్రపంచ నంబర్ వన్ భారత్ ఓ వైపు నుంచి..హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా మరోవైపు నుంచి వరుస విజయాలతో సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు చేరువయ్యాయి.

పూణే వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన 7వ రౌండ్ పోరులో సఫారీటీమ్ 190 పరుగుల తేడాతో నెగ్గితే...ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు జరిగే 7వ రౌండ్ మ్యాచ్ లో శ్రీలంకతో భారత్ తలపడనుంది.

టాప్ గేర్ లో భారత్....

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఆరు రౌండ్లలోనూ తిరుగులేని విజయాలతో 12 పాయింట్లు సాధించిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ వరుసగా 7వ విజయంతో సెమీఫైనల్స్ చేరిన తొలిజట్టుగా నిలవాలని తహతహలాడుతోంది.

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో లీగ్ టేబుల్ 7వ స్థానంలో ఉన్న శ్రీలంక.. పవర్ ఫుల్ భారత్ కు ఏపాటి పోటీ ఇవ్వగలదన్నది అనుమానంగా మారింది.

ఇప్పటి వరకూ 6 రౌండ్ల మ్యాచ్ లు ఆడిన శ్రీలంక 2 విజయాలు, 4 పరాజయాలతో 4 పాయింట్లు మాత్రమే సంపాదించి నాకౌట్ రౌండ్ బెర్త్ ను క్లిష్టంగా మార్చుకొంది.

2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తరువాత..ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్- శ్రీలంకజట్లు మరోసారి ప్రపంచకప్ సమరంలో పోటీపడబోతున్నాయి.

బౌలర్లకు, బ్యాటర్లకు సమంగా....

భారత్- శ్రీలంకజట్ల ఈ మ్యాచ్ కోసం స్పోర్టివ్ పిచ్ ను ముంబై క్యూరేటర్ సిద్ధం చేశారు. బ్యాటింగ్ కు, బౌలింగ్ కు సమానంగా అనుకూలించే ఇక్కడి వికెట్ పైన 258 పరుగుల సగటు స్కోరు నమోదవుతూ వస్తోంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 280కి పైగా పరుగులు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయంతో జట్టుకు అందుబాటులో లేకపోడంతో మహ్మద్ సిరాజ్ కు విశ్రాంతినిచ్చి..పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస వైఫల్యాలతో జట్టుకే భారంగా మారిన శ్ర్రేయస్ అయ్యర్ కు మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

గత మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టుగా ఆడటంలో విఫలమైన శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ సైతం భారీస్కోర్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. భీకరమైన ఫామ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ తన హోంగ్రౌండ్లో మరింతగా చెలరేగిపోయే అవకాశం లేకపోలేదు.

నిలకడలేమితో శ్రీలంక.....

మరోవైపు మాజీ చాంపియన్ శ్రీలంక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. టాపార్డర్ నిలకడలేమితో ఉక్కిరిబిక్కిరవుతోంది. సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ను తుదిజట్టులోకి తీసుకొన్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ముంబై పిచ్ పైన పవర్ ఫుల్ భారత్ ను నిలువరించాలంటే ఆట మూడు విభాగాలలోనూ శ్రీలంక అత్యుత్తమంగా రాణిచక తప్పదు.

బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జడేజాలతో కూడిన భారత బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొని భారీస్కోరు సాధించడం శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కు పెనుసవాలే.

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే...మొత్తం 167 మ్యాచ్ ల్లో భారత్ 98 విజయాలు, శ్రీలంక 57 విజయాలతో ఉన్నాయి.

ఇప్పటి వరకూ ఆడిన మొదటి ఆరుమ్యాచ్ ల్లోనూ కనబరచిన జోరునే భారత్ ఈరోజు జరిగే పోరులో శ్రీలంకపైనా కొనసాగించగలిగితే 14 పాయింట్లతో సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలువగలుగుతుంది. గత మూడు ప్రపంచకప్ టోర్నీలలోనూ సెమీస్ చేరిన భారత్ వరుసగా నాలుగో సెమీఫైనల్స్ బెర్త్ సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  2 Nov 2023 3:25 AM GMT
Next Story