Telugu Global
Sports

ఆసియాక్రీడల హాకీలో నేడు భారత్- కొరియా సెమీస్ పోరు!

ఆసియాక్రీడల హాకీ పురుషుల నాకౌట్ పోరుకు మాజీ చాంపియన్లు భారత్- దక్షిణ కొరియా సై అంటే సై అంటున్నాయి. ఫైనల్లో చోటు కోసం ఈరోజు జరిగే సెమీస్ పోరులో తలపడనున్నాయి.

ఆసియాక్రీడల హాకీలో నేడు భారత్- కొరియా సెమీస్ పోరు!
X

ఆసియాక్రీడల హాకీ పురుషుల నాకౌట్ పోరుకు మాజీ చాంపియన్లు భారత్- దక్షిణ కొరియా సై అంటే సై అంటున్నాయి. ఫైనల్లో చోటు కోసం ఈరోజు జరిగే సెమీస్ పోరులో తలపడనున్నాయి.

చైనాలోని హాంగ్జు వేదికగా జరుగుతున్న19వ ఆసియాక్రీడల హాకీ పురుషుల విభాగంలో నాకౌట్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. గ్రూపు లీగ్ దశ పోటీలు ముగియడంతో...పూల్ -ఏ నుంచి భారత్, జపాన్, పూల్ - బీ నుంచి దక్షిణ కొరియా, చైనాజట్లు సెమీస్ చేరడంతో నాకౌట్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఫైనల్ బెర్త్ కు భారత్ గురి..

ప్రపంచ మూడోర్యాంకర్ భారతజట్టు లీగ్ దశలో తిరుగులేని విజయాలతో టాపర్ గా నిలిచింది. మొత్తం ఐదుకు ఐదురౌండ్ల పోటీలలో ప్రత్యర్థిజట్లను చిత్తు చేసింది.

58 గోల్స్ సాధించడంతో పాటు..ప్రత్యర్థిజట్లకు ఐదుగోల్స్ మాత్రమే ఇచ్చింది.

ఆరుజట్ల గ్రూప్- ఏ లీగ్ పోరులో ఉజ్బెకిస్థాన్ ను 16-0, సింగపూర్ ను 16-1, జపాన్ ను 4-2, పాకిస్థాన్ ను 10-2, బంగ్లాదేశ్ ను 12-0 గోల్స్ తేడాతో భారత్ చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

మరోవైపు..గ్రూప్- బీ నుంచి ఆతిథ్య చైనా, దక్షిణ కొరియా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి. పూల్ - ఏ టాపర్ గా ఉన్న భారత్ తో పూల్-బీ రెండోస్థానంలో నిలిచిన కొరియా తలపడాల్సి ఉంది.

12 గోల్స్ తో హర్మన్ అగ్రస్థానం...

భారత కెప్టెన్ కమ్ డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్..ప్రస్తుత టోర్నీ లీగ్ దశలో మొత్తం 12 గోల్స్ సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. కొరియాతో జరిగే కీలక సెమీస్ పోరులో సైతం హర్మన్ కీలకం కానున్నాడు.

భారతజట్టు చివరిసారిగా 2014 ఇంచెన్ ఆసియాక్రీడల్లో హాకీ స్వర్ణపతకం సాధిస్తే..2006 దోహా ఆసియాక్రీడల్లో కొరియా విజేతగా నిలిచింది. గత ఆసియాక్రీడల సెమీస్ లోనే మలేసియా చేతిలో పెనాల్టీ షూటౌట్ ఓటమితో కాంస్య పతకంతో సరిపెట్టుకొన్న భారత్ ప్రస్తుత టో్ర్నీలో మాత్రం బంగారు పతకం గెలుచుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

కొరియాతో తలపడిన ప్రతిసారీ భారత్ గట్టిపోటీ ఎదుర్కొని విజయం సాధించాల్సి వస్తోంది. ఇటీవలే ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సైతం కొరియాను భారత్ 3-2 గోల్స్ తేడాతో అధిగమించింది.

2013 తర్వాత నుంచి ఈ రెండుజట్లు మొత్తం 17సార్లు తలపడ్డాయి. భారత్ 8, కొరియా 3సార్లు విజయాలు సాధించగా 6 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

గాంగ్జు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ ఫీల్డ్ హాకీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే నాకౌట్ పోరులో భారత్ కు దక్షిణ కొరియా ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే.

మహిళల హాకీ సెమీస్ లో భారత్...

మహిళల విభాగంలో సైతం భారత్ వరుస విజయాలతో సెమీస్ కు అర్హత సంపాదించింది. తన ఆఖరి పూల్ మ్యాచ్ లో 13-0 గోల్స్ తో హాంకాంగ్ ను చిత్తు చేసింది.ఏకపక్షంగా సాగిన పోరులో భారత వైస్ కెప్టెన్ దీపా గ్రేస్ ఎక్కా, స్ట్రయికర్ వందన కటారియా, దీపిక హ్యాట్రిక్ లు సాధించారు.

ఆట 2, 16, 48 నిముషాలలో వందన,11, 34, 42 నిముషాలలో దీప, 4, 54, 58 నిముషాలలో దీపిక తలో మూడు గోల్స్ చొప్పున నమోదు చేశారు. సంగీత కుమారి, మౌనిక, నవనీత్ కౌర్ తలో గోలు సాధించారు.

First Published:  4 Oct 2023 5:45 AM GMT
Next Story