Telugu Global
Sports

వన్డే సిరీస్ లో నేడు ఆఖరాట!

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయిమాక్స్ దశకు చేరింది. ఈ రోజు జరిగే ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది.

వన్డే సిరీస్ లో నేడు ఆఖరాట!
X

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయిమాక్స్ దశకు చేరింది. ఈ రోజు జరిగే ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది...

దక్షిణాఫ్రికాలో భారతజట్టు మూడంచెల పర్యటనలోని రెండో అంచె ముగింపు దశకు చేరింది. తొలిదశ టీ-20 సిరీస్ ను రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గడం ద్వారా సమఉజ్జీలుగా నిలిస్తే...రెండోదశ తీన్మార్ వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చెరోటి నెగ్గడం ద్వారా 1-1తో సమానస్థితిలో ఉన్నాయి.

పార్ల్ లోని బోలాండ్ పార్క్ వేదికగా ఈ రోజు జరిగే ఆఖరివన్డేలో నెగ్గిన జట్టే సిరీస్ విజేతగా నిలువనుంది.

రెండుజట్లకూ డూ ఆర్ డై.......

ఈ సిరీస్ లో రెండుజట్లూ పలువురు సీనియర్ స్టార్లు లేకుండానే ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడినజట్లతోనే పోటీపడుతున్నాయి. జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన తొలివన్డేలో భారత్ ముందుగా ఫీల్డింగ్ కు దిగడం ద్వారా 8 వికెట్ల చేజింగ్ విజయం సాధిస్తే...సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ముగిసిన రెండోవన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా 8 వికెట్లతోనే చేజింగ్ విజయమే సాధించడం ద్వారా సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

బ్యాటింగ్ కు అనువుగా ఉండే పార్ల్ లోని బోలాండ్ పార్క్ వేదికగా ఈరోజు సాయంత్రం 4-30 ప్రారంభమయ్యే ఆఖరి వన్డే రెండుజట్లకూ డూ ఆర్ డైగా మారింది.

విజేతగా నిలిచిన జట్టుకే సిరీస్ దక్కే అవకాశం ఉండడంతో ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతోనే రెండుజట్లూ బరిలోకి దిగబోతున్నాయి.

టాస్ నెగ్గితే మ్యాచ్ నెగ్గినట్లే......

ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో ఆతిధ్య దక్షిణాఫ్రికాజట్టు రెండు రెండుసార్లు టాస్ నెగ్గినా..చేజింగ్ కు దిగిన జట్లే విజేతలు కాగలిగాయి. తొలివన్డేలో చేజింగ్ కు దిగడం ద్వారా భారత్, రెండోవన్డేలో చేజింగ్ కు దిగిన సఫారీజట్లే 8 వికెట్ల విజయాలు నమోదు చేయగలిగాయి.

మొదటి రెండు వన్డేల పిచ్ లతో పోల్చిచూస్తే...ఆఖరి వన్డేకు సిద్ధం చేసిన పిచ్ మాత్రం బ్యాటింగ్ కు అనువుగా ఉండనుంది. గత రికార్డులనుబట్టి చూస్తే..పార్ల్ వేదికగా జరిగే మ్యాచ్ ల్లో 300 పరుగుల స్కోర్లు నమోదు కావడం సాధారణ విషయంగా కనిపిస్తోంది. దీనికితోడు స్లో వికెట్ కావడంతో స్పిన్ బౌలర్లతో పాటు మీడియం పేసర్లు సైతం కీలకం కానున్నారు.

రెండుజట్ల పైనా ఒత్తిడి....

రెండుజట్లూ తీవ్రఒత్తిడి నడుమ పోటీకి దిగుతున్నాయి. ఒత్తిడిని తట్టుకొని స్థాయికి తగ్గట్టుగా రాణించినజట్టునే విజయం వరించనుంది. తొలిమ్యాచ్ లో 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండోమ్యాచ్ లో 2 వికెట్ల నష్టానికే విజేతగా నిలిస్తే..రెండోమ్యాచ్ లో 211 పరుగులకే ఆలౌటైన భారత్ రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి విజేతగా నిలవడంతో ఆఖరి వన్డే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బోలాండ్ పార్క్ వేదికగా ఇప్పటి వరకూ జరిగిన 15 పురుషుల వన్డే మ్యాచ్ ల్లో మూడుసార్లు మాత్రమే 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 36 డిగ్రీల ఎండవేడిమి వాతావరణంలో... మందకొడి పిచ్ పైన రెండుజట్లు అసలు సిసలు పరీక్షను ఎదుర్కోనున్నాయి.

వానముప్పు లేకపోడంతో మొత్తం మ్యాచ్ ఏవిధమైన అంతరాయం లేకుండా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

సఫారీ తురుపుముక్కలు టోనీ, బర్గర్...

దక్షిణాఫ్రికా తరపున రెండో వన్డే సెంచరీ హీరో టోనీ డీ జోర్జి, బౌలింగ్ స్టార్ నాండ్రే బర్గర్ , ఫాస్ట్ బౌలర్ బ్యురాన్ హెండ్రిక్స్ మరోసారి భారత్ కు కొరకరాని కొయ్యలు కానున్నారు. ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లను భారత బౌలర్లు, బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొనకపోతే కష్టాలు తప్పవు.

కెప్టెన్ మర్కరమ్, సీనియర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, డ్యూసెన్ , క్లాసెన్ లు స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే భారత బౌలర్లకు చేతినిండా పనే.

మరోవైపు రాహుల్ నాయకత్వంలోని భారతజట్టు సిరీస్ విజేతగా నిలవాలంటే ఈ ఆఖరి వన్డేలో పూర్తిస్థాయిలో చెలరేగక తప్పదు. ఓపెనర్ రుతురాజ్, వన్ డౌన్ తిలక్ వర్మ, మిడిలార్డర్ బ్యాటర్ సంజు శాంసన్ తమ బ్యాట్లకు పని చెప్పక తప్పదు.

స్పిన్ జోడీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పాటు పేస్ త్రయం ఆవేశ్ ఖాన్, అర్షదీప్, ముకేశ్ కుమార్ సైతం చెమటోడ్చక తప్పదు.

సఫారీల వైపే రికార్డు.......

ప్రస్తుత సిరీస్ లోని రెండోమ్యాచ్ వరకూ ఈ రెండుజట్లూ 93 వన్డేలలో తలపడితే.. దక్షిణాఫ్రికా 51 విజయాలతో ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత్ కు 39 విజయాలు మాత్రమే ఉన్నాయి.

ఈ రెండుజట్లు తలపడిన గత 7 వన్డేలలో భారత్ 5 విజయాలు, దక్షిణాఫ్రికా 2 విజయాల రికార్డుతో ఉన్నాయి. సిరీస్ లోని ఈ నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో?..మ్యాచ్ ఎంత పట్టుగా సాగుతుందో తెలుసుకోవాలంటే...కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  21 Dec 2023 3:28 AM GMT
Next Story